ఎంసెట్ ప్రశాంతం
ఏలూరు సిటీ/భీమవరం టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల ప్రవేశ పరీక్ష (ఎంసెట్-14) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా పదిమంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఏలూరు, భీమవరం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు 14 వేల 90 మంది హాజరు కావాల్సి ఉండగా, 13వేల 184 మంది మాత్రమే హాజరయ్యూరు. 906 మంది గైర్హాజరయ్యారు. జెడ్పీ సీఈవో, ఎంసెట్ జిల్లా కన్వీనర్ డి.వెంకటరెడ్డి ఏలూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా పరీక్షలను ప్రశాంతంగా పూర్తిచేశామని చెప్పారు.
హాల్ టికెట్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను అందించని విద్యార్థులు జూన్ 1వ తేదీ లోగా హైదరాబాద్‌లోని ఎంసెట్ కార్యాలయానికి చేరేలా వాటిని పంపించాలని ఎంసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ డి.రంగరాజు సూచించారు. ఎండవేడిమి తీవ్రంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరులోని పరీక్షా కేంద్రాలను ఆర్డీవో బి.శ్రీనివాసరావు తనిఖీ చేశారు. సీఆర్‌ఆర్ మహిళా కళాశాల, సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ, సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిచోట్ల లైటింగ్ సక్రమంగా లేకపోవటంతో అప్పటికప్పుడు లైట్లు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి గదిలో తాగునీటి సౌకర్యం ఉందోలేదో పరిశీలించి, లేనిచోట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
906 మంది గైర్హాజరు : ఎంసెట్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 13,184 మంది విద్యార్థులు హాజరయ్యారని ఏలూరు రీజినల్ కన్వీనర్ డాక్టర్ ఎ.ఏసుబాబు, భీమవరం రీజినల్ కన్వీనర్ రంగరాజు తెలిపారు. ఏలూరులో 11 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 6,982 మంది హాజరుకావాల్సి ఉండగా.. 430 మంది గైర్హాజరయ్యారు. 6,552మంది పరీక్ష రాశా రు. 4 కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ పరీక్షకు 2,211మంది పరీక్ష రాయాల్సిఉండగా, 1,989 మంది పరీక్ష రాశారు. 222మంది గైర్హాజరయ్యారు. భీమవరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 4,130 మందికి గాను, 3,918 మంది హాజరయ్యారు. 212 మంది పరీక్ష రాయలేదు. రెండు కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ పరీక్షకు 767 మంది హాజరుకావాల్సి ఉండగా, 725 మంది పరీక్ష రాశారు. 44 మంది హాజరుకాలేదు.