- ఉన్నతాధికారులు, నిపుణులతో మంత్రి గంటా భేటీ
- తెలంగాణ వైఖరి తెలిస్తే.. గవర్నర్‌తో సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఎంసెట్) నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతాధికారులు, నిపుణులతో మంతనాలు సాగించారు. ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో శనివారం గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశంలో చేసిన సూచనలను అనుసరించి ఏం చేయాలన్న దానిపై చర్చించారు.
గవర్నర్ భేటీ విశేషాలను శనివారం రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గంటా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభించబోతోందో గమనించాక తదుపరి చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రికి సూచించినట్లు సమాచారం. ఆదివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మరోదఫా మంత్రి మాట్లాడారు.
కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పర్యటన వాయిదా పడడంతో సోమవారం విశాఖపట్నంలో జరగాల్సిన రాష్ట్రస్థాయి విద్యాసదస్సు కూడా వాయిదా పడింది. దీంతో సోమవారం మరోసారి సీఎం చంద్రబాబుతో మంత్రి గంటా మాట్లాడనున్నారు. ఈలోపు తెలంగాణ వైఖరేమిటో తెలిస్తే తదనంతరం గవర్నర్ నరసింహన్‌ను కలవాలన్న అభిప్రాయంతో ఉన్నారు.
సమస్య పరిష్కారానికి దారేదీ?
ఉమ్మడి ఎంసెట్‌పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన భేటీపట్ల ఏపీకి చెందిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.