సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో వాటిల్లిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియగా కొన్నిచోట్ల గరిష్టంగా 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడింది. తుపాన్ తీరం దాటే సమయంలో 100–150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా, పాడి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు సంబంధించి లక్ష ఎకరాల్లో పంటలు ముంపునకు గురికాగా మరో లక్షన్నర ఎకరాల్లో నేల కొరిగినట్లు అంచనా వేశారు. 76 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడినట్లు అంచనాలున్నాయి. అత్యధికంగా 53 వేల ఎకరాల్లో మిరప, 11 వేల ఎకరాల్లో అరటి, 5 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. తుపాను తీరం దాటిన తర్వాత వర్షాలు తెరిపిచ్చి ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
తుపాన్ ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తూ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వ్యవసాయ, ఉద్యాన పంట నష్టాన్ని చాలా వరకు నియంత్రించగలిగారు. కోతలు పూర్తయిన చోట తేమతో సంబంధం లేకుండా ఆగమేఘాలపై ధాన్యాన్ని కొనుగోలు చేయగా పొలాల్లో నిలిచిన నీరు కిందకు దిగిపోయేందుకు ఆర్బీకే సిబ్బంది సాయంతో క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు.
సంక్రాంతిలోగా ఇన్‌పుట్ సబ్సిడీ
వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నాయి. బృందాలు వారం రోజుల పాటు గ్రామ స్థాయిలో పర్యటించి వాస్తవంగా జరిగిన పంట నష్టం అంచనాలను రూపొందిస్తాయి.
ఈ జాబితాలను సామాజిక తనిఖీల కోసం ఈనెల 18వతేదీ నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. 25వ తేదీన లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరైనా అర్హులు పొరపాటున మిగిలిపోతే వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ 31వతేదీన సవరించిన తుది జాబితాలను ప్రదర్శిస్తారు. అర్హత పొందిన బాధిత రైతులకు సంక్రాంతి లోగా పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దెబ్బతిన్న బోట్లు, వలలు..
తుపాన్ ప్రభావంతో 15 బోట్లు పూర్తిగా, 72 బోట్లు పాక్షికంగా దెబ్బ తినగా 1,753 వలలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 700 ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో పంట టోర్నడోల ప్రభావంతో కొంత మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పశువులు, మేకలు, గొర్రెలు మృతి చెందినట్లు నివేదికలున్నాయి. ఆయా విభాగాల వారీగా ప్రత్యేకంగా నియమించిన బృందాలు కూడా వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు రేపటి నుంచి రంగంలోకి దిగనున్నాయి.
అత్యంత పారదర్శకంగా...
పంట నష్టం అంచనాల కోసం నియమించిన ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి వారం రోజుల పాటు పర్యటించనున్నాయి. నష్టపోయిన ప్రతి ఎకరాను గుర్తించేందుకు అత్యంత పారదర్శకంగా పంట నష్టం అంచనాలు రూపొందిస్తారు. సామాజిక తనిఖీలో భాగంగా పంట నష్టం జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment