బాపట్ల పర్యటనలో వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో బాధితులు కోరుకునేది తక్షణం ఆదుకునే ఆపన్న హస్తాన్ని! మానవత్వంతో ఉదారంగా సాయం అందించే ఔదార్యాన్నే! కల్లబొల్లి కబుర్లు.. కెమెరాల ముందు డ్రామాను కానేకాదు! ఆర్భాటాలు.. హడావుడి.. డొల్ల ప్రచారంతో ఏం ఒరుగుతుంది? సహాయ చర్యల్లో నిమగ్నం కావాల్సిన అధికార యంత్రాంగాన్ని సొంత ప్రచారం కోసం తన చుట్టూ తిప్పుకున్న పెద్ద మనుషులు నీతి సూక్తులు బోధించడం దయ్యాలు వేదాలు వల్లించడం కాదా? పెత్తందారులు అందుకు వంత పాడటంలో ఏమైనా ఔచిత్యం ఉందా? అధికార యంత్రాంగానికి ముందుగానే నిధులిచ్చి దిశా నిర్దేశం చేస్తూ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పెత్తందారుల బృందానికి దిక్కు తోచడం లేదు.
తుపాన్ బాధిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు రానివారికి సైతం రూ.2,500 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించడం గమనార్హం. ఈ విధానాన్ని తొలిసారిగా తీసుకొచ్చారు. తన పర్యటనలతో సహాయ చర్యలకు అడ్డు పడకుండా యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మోహరించి తగినంత సమయం ఇచ్చాక నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను సీఎం తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం అందిందో లేదో వారినే ఆరా తీసుకున్నారు. గతం కంటే మిన్నగా, వేగంగా, ఎంతో మెరుగ్గా సహాయ చర్యలను అమలు చేస్తూ సాయం అందచేస్తున్నారు.
నాడు ఈవెంట్‌లా.. నేడు భరోసానిస్తూ
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సమస్యలు సావధానంగా ఆలకిస్తూ అక్కడిక్కడే వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తే రెడ్ కార్పెట్ పరామర్శ అంటూ ‘ఈనాడు’ తన అక్కసు మరోసారి చాటుకుంది. రైతులు, బాధితులను ఓదార్చుతూ.. ధైర్యం చెబుతూ సాగిన సీఎం పర్యటన ఎల్లో మీడియాకు రుచించలేదు. తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు శరవేగంగా సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించే విషయంలో మీనమేషాలు లేకుండా తక్షణమే ప్రభుత్వం స్పందించడం ఓ వర్గం మీడియాకు మింగుడు పడలేదు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపత్తులు వస్తే చురుగ్గా కదిలేవారంటూ తన అసలు రంగును బయట పెట్టుకున్న ఎల్లో మీడియా తుపానులు, వరదలు, చివరకు పుష్కరాలను కూడా పబ్లిసిటీ కోసం టీడీపీ అధినేత వినియోగించుకున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. ఓపక్క ప్రజలు అవస్థ పడుతుంటే అధికార యంత్రాంగాన్నంతా తన వెంట తిప్పుకుని, ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ, డ్రోన్లతో చిత్రీకరిస్తూ సహాయ చర్యలను పక్కనపెట్టిన సంగతి ఎవరికి తెలియదు? విపత్తుల వేళ కనీసం నిధులు కూడా ఇవ్వకుండా, పరిహారం సరిగా అందించకుండా వైపరీత్యాలను సైతం ఓ ఈవెంట్‌లా మార్చి హంగామా చేసిన చంద్రబాబును గొప్ప వ్యక్తిగా చూపించేందుకు ఈనాడు తన పైత్యాన్నంతా రంగరించి కథనాలు అల్లింది.
పటిష్ట వ్యవస్థ.. తొలిసారి ‘టీఆర్ 27’
గతానికి భిన్నంగా విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్ పటిష్ట వ్యవస్థను నిర్మించడంతో తక్షణమే ఫలితాలు అందుతున్నాయి. కరోనా సమయంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడమే దీనికి నిదర్శనం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అన్ని శాఖలకు అనుసంధానించి తుపాన్లు లాంటి వైపరీతాల్యపై ముందే అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా మిచాంగ్ తుపాను తీవ్రత పెరిగిన వెంటనే 420కిపైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు.
భోజనం, మంచినీటితోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను నెలకొల్పారు. శిబిరాలకు రాని వారికి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు సమకూర్చారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు.
సీఎం జగన్ ముందుగానే రెండు దఫాలు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకుండా ఉదారంగా సాయం అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ‘టీఆర్ 27’ కింద అప్పటికప్పుడు ప్రభావిత జిల్లాలకు రూ.28 కోట్లు విడుదల చేశారు. తుపానుకు నాలుగు రోజుల ముందు నుంచే జరుగుతున్న ఈ సన్నద్ధత అందరికీ తెలిసినా ఈనాడు, చంద్రబాబుకు మాత్రం కనపడకపోవడాన్ని ఏమనాలి?
నిధులిచ్చి.. సర్వం సిద్ధం చేసి
విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందుగానే నిధులిచ్చి సర్వం సిద్ధం చేసిన సీఎం జగన్ సహాయ చర్యలు నిరాటంకంగా కొనసాగేందుకు తగినంత సమయం ఇచ్చారు. పరిస్థితి కొంత కుదుట పడ్డాక క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. ఆర్థిక సాయం విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించారు. అప్పటివరకు పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు మాత్రమే రూ.2,500 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తుండగా అక్కడకు రాని వారికి సైతం ఇళ్లకు వెళ్లి మరీ పరిహారం ఇవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
సహాయ చర్యల కోసం అప్పటికే రూ.28 కోట్లు విడుదల చేయగా అదనపు సాయం వల్ల రెట్టింపు మొత్తం విడుదల చేయాల్సి వచ్చినా భరించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందాల్సిందేనని నిర్దేశించి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈనాడు చెబుతున్నట్లుగా ఓ ప్రభుత్వాధినేత తూతూమంత్రంగా పర్యటిస్తే ఇలా స్పందించడం సాధ్యమవుతుందా? ప్రజల ఇబ్బందులను స్వయంగా చూశాక ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని సీఎం అప్పటికప్పుడే నిర్ణయించారు. చంద్రబాబు హయాంలో అసలు ఈ ప్రత్యేక సాయం అనేదే లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే విపత్తుల సమయంలో ప్రత్యేక సాయాన్ని అందించే విధానాన్ని ప్రారంభించారు.
ఓదార్చి.. ఊరడిస్తూ
బాధిత ప్రాంతాల పర్యటనలో సీఎం జగన్ ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనల్లో సీఎం జగన్ స్వయంగా బాధితులను ఓదార్చారు. రైతన్నలతో మాట కలిపి వారి పరిస్థితి అడిగి తెలుసుకుని ఊరడించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోనని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. ఖరీఫ్ సీజన్ ముగిసే లోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని, 80 శాతం రాయితీతో శనగ విత్తనాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఇచ్చిన అర్జీలపై అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చారు.
హామీకి మించి ‘భరోసా’
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న మేనిఫెస్టో హామీకి మించి సీఎం జగన్ ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు రూ,67,500 అందచేస్తుండటం గమనార్హం. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కౌలురైతులతో పాటు అటవీ, దేవదాయ భూ సాగుదారులకు సైతం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2019–20 నుంచి ఏటా సగటున 52.57 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.31,005.04 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు.
దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతన్నలకు అందించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు 1,270 రైతు కుటుంబాలకు రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్ల పరిహారం చెల్లించారు. వీరిలో కూడా 212 మంది కౌలు రైతులున్నారు.
దళారీలు లేకుండా ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల జోక్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించింది. నాలుగున్నరేళ్లలో వ్యవసాయ క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 33.59 లక్షల మంది రైతుల నుంచి 3.16 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.60 వేల కోట్లు చెల్లించింది. పైగా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చులు (జీఎల్‌టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాకు రూ.252 వరకూ చెల్లిస్తోంది రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతీసారి జోక్యం చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. ఇలా 21.55 లక్షల మంది నుంచి రూ.7,712.32 కోట్ల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది.
ఆర్బీకేలతో రైతు ముంగిట్లో సేవలు
దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల ద్వారా రూ.1,208.60 కోట్ల రాయితీపై 41.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. రూ.1,259 కోట్ల విలువైన 11.39 లక్షల టన్నుల ఎరువులు, రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. నాణ్యమైన ఎరువులను రైతుల ముంగిటికే తీసుకెళ్లడం ద్వారా బస్తాకి రూ.20–రూ.30 వరకు హమాలీ, రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. టీడీపీ హయాంలో సగటున 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులొస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో 165.87 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. దేశంలోనే తొలిసారి ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ క్రాప్) ప్రామాణికంగా వాస్తవ సాగు దారులకు సంక్షేమ ఫలాలను అందచేస్తున్నారు.
ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమమే
సీజన్ చివరిలో పంట నష్టపరిహారం
వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు అదే సీజన్ చివరిలో పెట్టుబడి రాయితీని (ఇన్‌పుట్ సబ్సిడీ) సీఎం జగన్ అందచేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మందికి రూ.1,976.45 కోట్ల పరిహారాన్ని అందించారు. విపత్తులతో పంటలు నష్టపోతే 80 శాతం సబ్సిడీతో సరి్టఫై చేసిన విత్తనాలిస్తున్నారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇవ్వగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందచేసింది.
అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని ౖసైతం సీఎం జగన్ చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంట రుణం తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. టీడీపీ హయాంలో 40.60 లక్షల మంది రైతులకు రూ.685 కోట్ల వడ్డీ రాయితీనిస్తే సీఎం జగన్ 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లు (గత సర్కారు బకాయిలతో కలిపి ) వడ్డీ రాయితీని అందించారు.
పరిహారం పెంచారిలా...
విపత్తులతో వ్యవసాయ భూముల్లో మేట వేసే మట్టి, ఇసుక తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 ఉన్న పరిహారాన్ని రూ.8,500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్‌పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా ఇప్పుడు రూ.17 వేలు అందిస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు.
ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మజాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500కి, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలకు పెంచి ప్రభుత్వం అందచేస్తోంది. గతంలో గేదెలు, ఆవులు మరణిస్తే పరిహారంగా రూ.30 వేలు నిర్ణయించగా ఇప్పుడు రూ.37,500 ఇస్తున్నారు. గొర్రెలు, మేకలైతే గతంలో రూ.3 వేల చొప్పున పరిహారం వర్తించగా ఇప్పుడు రూ.4 వేలు ఇస్తున్నారు.
మత్స్యకారుల బోట్లు పాక్షికంగా దెబ్బతింటే బాబు హయాంలో రూ.4,100 ఇవ్వగా ఇప్పుడు సీఎం జగన్ రూ.6 వేలకి పెంచారు. వలలు పాక్షికంగా దెబ్బతింటే ఇచ్చే పరిహారాన్ని రూ.2,100 నుంచి రూ.3 వేలకి పెంచారు. బోట్లు పూర్తిగా దెబ్బతింటే కొత్త బోట్ల కోసం ఇచ్చే సాయాన్ని రూ.9,600 నుంచి రూ.15 వేలకి పెంచారు. పూర్తిగా దెబ్బతిన్న వలలకు రూ.2,600 మాత్రమే ఉన్న సాయాన్ని రూ.4 వేలకి పెంచి అందిస్తున్నారు.
రూ.5,942.05 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు
చంద్రబాబు హయాంలో కరువు వచ్చినా.. వరదలొచ్చినా.. అకాల వర్షాలు కురిసి పంటలు నష్టపోతే రెండేళ్ల దాకా పరిహారానికి దిక్కు లేని దుస్థితి. 2014–15లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురిస్తే 2016 జూలైలో పంట నష్టపరిహారం అరకొరగా విదిల్చారు. 2014లో కర్నూలు జిల్లాలో కరువు వస్తే 2017లో కరువు భృతి నిచ్చారు. 2018 ఖరీఫ్‌లో భారీగా పంట నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు.
ఐదేళ్లలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఇవే కాకుండా సబ్సిడీ విత్తనాల కింద రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఎగ్గొట్టిన ఘనత కూడా చంద్రబాబుదే.
Comments
Please login to add a commentAdd a comment