28 నుంచి ఎంసెట్ దరఖాస్తులు | TS EAMCET 2016 Notification Important Dates | Sakshi
Sakshi News home page

28 నుంచి ఎంసెట్ దరఖాస్తులు

Published Thu, Feb 25 2016 12:46 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

28 నుంచి ఎంసెట్ దరఖాస్తులు - Sakshi

28 నుంచి ఎంసెట్ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2016 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, సిలబస్, కోర్సులు, దరఖాస్తుల వివరాలను ఎంసెట్ కమిటీ గురువారం (ఈనెల 25న) ఎంసెట్ వెబ్‌సైట్ (ఠీఠీఠీ.్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీ)లో అందుబాటులో ఉంచనుంది. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకటాచలం, ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణరావు ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఈసారి అన్ని ఉమ్మడి ప్రవేశపరీక్షల్లో బయోమెట్రిక్ విధానం (బొటనవేలి ముద్ర, ముఖం ఫొటో) అమలు చేయాలని భావిస్తున్నట్లు మండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. దీని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేసి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసారి మెడికల్ విభాగం పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణరావు చెప్పారు. విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీని కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వీటిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
 
ఒక్క నిమిషం నిబంధన యథాతథం
పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిబంధనను ఈసారి కూడా అమలుచేయాలని నిర్ణయించామని, విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
 
పెరిగిన పరీక్ష ఫీజు
ఈసారి ఎంసెట్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతేడాది తరహాలోనే రూ.250 ఫీజును నిర్ణయించిన ఎంసెట్ కమిటీ... బీసీ, ఇతర అభ్యర్థులకు మాత్రం రెండింతలుగా రూ.500కు పెంచింది. ఈ ఫీజును ఈసేవ, మీసేవ, ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. 15 ఏళ్లుగా ఫీజు రూ.250 మాత్రమే ఉందని, ఖర్చులు పెరగడం, సంస్కరణలు తీసుకువస్తుండటంతో ఫీజు పెంచాల్సి వచ్చిందని పాపిరెడ్డి వెల్లడించారు.
 
విద్యార్థులను బట్టి పరీక్ష కేంద్రాలు
గతేడాది ఎంసెట్‌కు 2.52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి విద్యార్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ లెక్కలను తేల్చేందుకు ఎంసెట్ ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక ఎంసెట్ ఓపెన్ కోటా 15 శాతం సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. వారు తెలంగాణలో ఎంసెట్ రాసేందుకు కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
 
ఎంసెట్ షెడ్యూల్
ఫిబ్రవరి 25: అందుబాటులోకి నోటిఫికేషన్
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 28 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 3 వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో, 13వ తేదీ వరకు రూ. వెయ్యి, 22వ తేదీ వరకు రూ.5వేలు, 29 వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం
ఏప్రిల్ 4 నుంచి 13 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
ఏప్రిల్ 24 నుంచి 30 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
మే 2న: ఎంసెట్ పరీక్ష (ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష)
మే 3న: ప్రాథమిక ‘కీ’ల విడుదల
మే 9 వరకు: ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ
మే 12న: ఎంసెట్ ఫలితాల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement