రేపే ఎంసెట్ | Tomorrow EAMCET | Sakshi
Sakshi News home page

రేపే ఎంసెట్

Published Wed, May 13 2015 12:45 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

రేపే ఎంసెట్ - Sakshi

రేపే ఎంసెట్

పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
 
హైదరాబాద్: మెడిసిన్‌కు ప్లస్.. ఇంజనీరింగ్ తుస్.. ఇదీ ఈ ఏడాది ఎంసెట్ పరిస్థితి. తక్కువ సీట్లున్న మెడిసిన్ విభాగంలో ఈసారి దరఖాస్తులు భారీగా పెరగగా... భారీగా సీట్లు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్‌కు మాత్రం డిమాండ్ బాగా తగ్గిపోయింది. మెడిసిన్ విభాగంలో ఒక్కో సీటుకు 43 మంది పోటీపడుతుండగా.. ఇంజనీరింగ్‌లో మాత్రం ఒక్కో సీటుకు ఒక విద్యార్థి మాత్రమే పోటీపడుతున్నారు. గురువారం (ఈనెల 14న) జరుగనున్న ఈ ఎంసెట్-2015కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేద ని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహరించి, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

గతంలో కంటే ఎక్కువగా..: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల నుంచి 2014 ఎంసెట్‌కు 1,80,825 దరఖాస్తులురాగా.. ఈసారి 2,32,045 దరఖాస్తులు వచ్చాయి. అంటే 51,220 దరఖాస్తులు పెరిగినట్లే. ఇందులో గతేడాది మెడిసిన్ కోసం 54,754 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి 92,367 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే 37,613 దరఖాస్తులు పెరిగాయి. అదే ఇంజనీరింగ్ కోసం గతేడాది 1,26,071 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి 1,39,678 మంది (13 వేలు ఎక్కువ) దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 2,100 మెడిసిన్ సీట్లున్నాయి. ఇక ఇంజనీరింగ్‌లో ప్రస్తుతం 1.85 లక్షల సీట్లుండగా.. అందులో 42 వేల సీట్ల రద్దు కోసం యాజమాన్యాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇక 2015-16 విద్యా సంవత్సరంలో అఫిలియేషన్ల కోసం జరుగుతున్న తనిఖీలు పూర్తయ్యాక మరిన్ని సీట్లు తగ్గే అవకాశముంది.

ప్రత్యామ్నాయ రవాణా..:  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అయితే తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా సొంతంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలు ఎంసెట్  విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. ఆయా బస్సులపై ఎంసెట్ ప్రత్యేకం అనే బ్యానర్లు ఉంటాయి. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల వివరాలను ఎంసెట్ ప్రాంతీయ కోఆర్డినేటర్ కార్యాలయాల్లో పొందవచ్చు. అలాగే హెల్ప్‌లైన్ నంబర్లు 9959226160, 9959226154లో వివరాలు పొందవచ్చు.
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 
విద్యార్థులు పరీక్షకు బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్‌టికెట్ కచ్చితంగా తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం చేయించి తీసుకువచ్చి, ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేకపోతే విద్యార్థి రిజల్ట్‌ను నిలిపివేస్తారు. ఈసారి వాచీలను కూడా పరీక్షా హాల్లోకి అనుమతించరు. గణితం టేబుల్స్, స్కేల్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎల క్ట్రానిక్ వస్తువులేవీ తీసుకెళ్లరాదు.  ఓఎంఆర్ జవాబు పత్రంపై ఎలాంటి గుర్తులు పెట్టినా.. దానిని మూల్యాంకనం చేయరు.  జవాబుపత్రంలో ఒకసారి ఆప్షన్‌ను నింపాక.. దానిని తుడిపేసినా, వైట్‌నర్ పెట్టి మరో ఆప్షన్‌ను నింపినా ఆ జవాబును పరిగణనలోకి తీసుకోరు.
 
గంట ముందుగానే..

రాష్ట్రవ్యాప్తంగా 423 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నాం. 251 కేంద్రాల్లో ఇంజనీరింగ్, 172 కేంద్రాల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్ష జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10కి ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 9 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 9:30 గంటలకు ఓఎంఆర్ షీట్లు, 9:55కు ప్రశ్నపత్రాలు ఇస్తారు. 10 గంటలకు పరీక్ష ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది. ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ పరీక్ష ప్రారంభం అవుతుంది. విద్యార్థులను మధ్యాహ్నం 1:30 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 2 గంటలకు ఓఎంఆర్ జవాబు పత్రాలను, 2:25 గంటలకు ప్రశ్నపత్రాలు ఇస్తారు. 2:30కు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5:30కు పూర్తవుతుంది.
- ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement