నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష(ఎంసెట్) గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. నెల్లూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఇంజనీరింగ్ విభాగం ప్రవేశపరీక్షకు 10,934 మంది దరఖాస్తు చేసుకోగా 10,265 మంది రాశారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ విభాగ పరీక్షకు 3,265 మంది హాజరుకాగా 131 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 20, మధ్యాహ్నం 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
నిర్ణీత సమయం కన్నా గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ప్రకటించడంతో స్పందన లభించింది విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న పలువురు మాత్రం హడావుడిగా పరుగులు తీస్తూ పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు. దాదాపు అందరూ సకాలంలో పరీక్షకు హాజరయ్యారు. సీతారామపురం, వరికుంటపాడు, డక్కిలి, మర్రిపాడు, కొండాపురం తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పలువురు ముందు రోజే నెల్లూరుకు చేరుకుని బంధుమిత్రుల ఇళ్లు, లాడ్జీల్లో బస చేశారు. పరీక్ష నిర్వహణను జేఎన్‌టీయూ నుంచి వచ్చిన ఏడుగురు ప్రొఫెసర్లు పర్యవేక్షించారు. 25 మంది రెవెన్యూ ఉద్యోగులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్ పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసింది.
భానుడి ఉగ్రరూపం
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు విలవిలలాడారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి వచ్చిన వారు పరీక్ష కేంద్రాల ఆవరణలో ఆరుబయటే నిలుచుని అవస్థ పడ్డారు. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తున్నారోనని బయట ఉత్కంఠగా ఎదురుచూశారు. పరీక్ష ముగిసిన వెంటనే సమీపంలోని శీతలపానీయాల దుకాణాలు విద్యార్థులతో కిటకిటలాడాయి. ఆయా కేంద్రాల ఆవరణలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వివిధ విద్యాసంస్థలకు చెందిన వారు కరపత్రాల పంపిణీకి పోటీపడడంతో కోలాహల వాతావరణం నెలకొంది.
పలువురి సహకారం
ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేచి వుండేందుకు నగరానికి చెందిన పలు సంస్థలు సహకరించారు. డీకేడబ్ల్యూ కళాశాల వద్ద శ్రీరామకృష్ణ వివేకానంద ప్రచార సమితి, సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో షామియానా ఏర్పాటు చేయడంతో పాటు నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు అన్వేష్, వసంతకుమార్‌రెడ్డి, ఖాజా, అసంఘనానందరెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
మెడిసిన్ ప్రశ్నపత్రంలో తప్పులు
- ఆందోళనలో విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంసెట్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన ప్రశ్నపత్రంలో పలు తప్పులు దొర్లినట్లు అధ్యాపకులు గుర్తించారు. బి సిరీస్‌లో జువాలజీ సబ్జెక్టుకు సంబంధించి 63వ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. 80 ప్రశ్నకు సంబంధించి ఇచ్చిన సమాధానాల్లో రెండు కరెక్ట్‌గా ఉన్నాయని తెలిపారు. ఏ సిరీస్‌లో బోటనీ సబ్జెక్టుకు సంబంధించి 24వ ప్రశ్నకూ రెండు సమాధానాలు ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎంసెట్ నిర్వాహకులు ఏ సమాధానాన్ని ఫైనల్ చేస్తారోనని విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. సరైన నిర్ణయం తీసుకోకపోతే మూడు మార్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులోని విశ్వసాయి కళాశాల డెరైక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తప్పులు దొర్లింది వాస్తవమేనని, విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రశాంతంగా ఎంసెట్
Published Fri, May 23 2014 2:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement