గురుకుల బాలుర పాఠశాలలో ఆరుబయట స్నానం చేస్తున్న విద్యార్థులు ,గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఆరుబయట భోజనం చేస్తున్న విద్యార్థినులు
ఆరుబయటే చదువులు..భోజనాలు..స్నానాలు కూడా. అధ్వానంగా ఉన్న వంటశాలలు, పడక గదుల్లోనే పాఠాలు, ఉపాధ్యాయుల కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు. ఇక మెనూ నిర్వాహకుల ఇష్టం. నీళ్ల చారు, ఆకుకూర పప్పు. వారు పెట్టిందే పరమాన్నం. ఇదీ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో దుస్థితి. ఇక్కడ చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమాన్ని పాలకులు మరిచారు. అభివృద్ధి అంతా ఆర్భాటపు ప్రకటనలే. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. గురువారం జిల్లాలోని గురుకులాలను సాక్షి బృందం పరిశీలించింది. వాటి దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్.
నెల్లూరు రూరల్ : జిల్లాలో గురుకుల పాఠశాలల్లో వసతులు, నిర్వహణ అధ్వానంగా ఉన్నాయి. గురుకులం అంటే కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్య అనే భావన ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక గురుకుల వ్యవస్థనే భ్రష్టుపట్టింది. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను రద్దు చేసి, వాటినే గురుకులాలుగా మార్చేసి వసతి గృహాలను మాదిరిగా నడుపుతోంది. జిల్లాలో 43 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ వెంకటగిరి, ఉదయగిరి, చిలమానుచేను, తుమ్మలపెంట, ఆత్మకూరు, గండిపాళెం, నెల్లూరులోని మైనార్టీ గురుకులాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురంలో బాలికల గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల బాలుర గురుకుల పాఠశాలు నడుస్తున్నాయి.
చెన్నూరు, ఓజిలి, సర్వేపల్లి, నెల్లూరు నగరంతో పాటు మొత్తం 13 మినీ గిరిజన గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోకోట, దొరవారిసత్రం, గొలగమూడిలో గురుకులాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కావలి నియోజకవర్గంలోని నార్త్‌అమలూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల్లోని బాలికల హాస్టల్స్, సర్వేపల్లి నియోజకవర్గంలోని మహ్మదాపురం, వెంకటగిరి బాయ్స్ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, కుదురు, నాయుడుపేట, కండలేరు, డక్కిలి, ఆదూరుపల్లి, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, కోడూరు, కావలి, ముత్తుకూరులోని బాలికల గురుకులాలు, నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు బాలురు మొత్తం 14 ఎస్సీ, గురుకులాలు నడుస్తున్నాయి.
వసతులు శూన్యం
గురుకులాల్లో సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయట పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూళ్ల పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.
తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
జిల్లాలో ఏకైక ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాలను నగరంలోని ఆటోనగర్‌లో 2008లో ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడం, మంచినీటి సమస్య, చుట్టూ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పడిపోతోంది. ప్రారంభంలో 480 మంది ఉన్న విద్యార్థులు రాను రాను 246 మందికి తగ్గిపోయారు. నేలమీదే చదువులు, శిథిలావస్థకు చేరుకున్న భవనం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియక విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. అక్కచెరువుపాడులో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించి, రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల నత్తనడకన జరుగుతున్నాయి.
ప్రకటనలు..పునాదులకే పరిమితం
సర్వేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు స్థలం కేటాయింపు జరగకపోవడంతో నగరంలోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలోని గిరిజన వసతిగృహంలో నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్‌లో 200 సీట్లకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. భవనానికి రూ.2.40 కోట్లు నిధులు మంజూరైనప్పటికీ స్థలం కేటాయింపు ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇక్కడ సరిపడా గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు బకెట్లతో నీళ్లు మోసుకెళ్లే దృశ్యాలు, తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా మెనూ అమలు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులు నీళ్ల చారు, ఆకుకూర పప్పుతో అర్ధాకలితో అలమటిస్తున్నారు.
భవనం లేకపోవడంతో హాస్టల్లోనే క్లాసులు
విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో హాస్టల్‌లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాం. నూతన భవవనానికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నాం. స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం.
– పి.దేవసహాయం, ప్రిన్సిపల్, బాలికల గిరిజన
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది
ఆటోనగర్‌లో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల భవనాన్ని మార్చాల్సి ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకుంది. చుట్టూ ఉన్న వర్కషాపులు, పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వల్ల విద్యార్థులకు మంచి వాతావరణం లేదు. స్కూల్ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్చేందుకు సుముఖత చూపడం లేదు. స్కూల్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అనుమతి రాగానే స్కూల్‌ను వేరే ప్రాంతానికి మార్చుతాం.
–పి.బ్రహ్మయ్య, ప్రిన్సిపల్, మైనార్టీ గురుకుల పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment