నెల్లూరు(వీఆర్సీసెంటర్) : వీఎస్‌యూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. గత రెండురోజుల నుంచి విద్యార్థులకు యాజమాన్యానికి మధ్య హస్టల్ విషయమై గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ శివశంకర్ వాహనాన్ని అడ్డగించిన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. దీంతో గురువారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వీసీ, రిజిస్ట్రార్‌లతో విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు పెడితే వాళ్ల భవిష్యత్ ఏమైపోతుందని, అధ్యాపకులే విద్యార్థుల జీవితాలలో ఆటలాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కేసులు ఉపసంహించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు తీర్చాల్సిన మీరే కేసులెలా పెడుతారని నిలదీశారు. దీంతో వీసీ వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు బుజబుజనెల్లూరులో ఓ ప్రైవేటు భవనం అద్దెకు తీసుకున్నామని, దానిని వసతి గృహంగా ఉపయోగిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చే మార్పును బట్టి కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపారు.