vsu
-
వీఎస్‌యూ విద్యార్థుల ఆందోళన
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : వీఎస్‌యూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. గత రెండురోజుల నుంచి విద్యార్థులకు యాజమాన్యానికి మధ్య హస్టల్ విషయమై గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ శివశంకర్ వాహనాన్ని అడ్డగించిన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. దీంతో గురువారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వీసీ, రిజిస్ట్రార్లతో విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు పెడితే వాళ్ల భవిష్యత్ ఏమైపోతుందని, అధ్యాపకులే విద్యార్థుల జీవితాలలో ఆటలాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కేసులు ఉపసంహించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు తీర్చాల్సిన మీరే కేసులెలా పెడుతారని నిలదీశారు. దీంతో వీసీ వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు బుజబుజనెల్లూరులో ఓ ప్రైవేటు భవనం అద్దెకు తీసుకున్నామని, దానిని వసతి గృహంగా ఉపయోగిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చే మార్పును బట్టి కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపారు. -
కళాశాలలు నాణ్యతా ప్రమాణాలను పాటించాలి
నెల్లూరు (టౌన్) విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలల్లో కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వీఎస్‌యూ వీసీ వీరయ్య తెలిపారు. స్థానిక వీఎస్‌యూ సెమినార్ హాల్లో మంగళవారం విద్యా పరిపాలన నాయకత్వంపై వర్క్‌షాపు ముగింపు సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దార్శనికతతోనే అసలైన విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థలో బోధన, పఠనానికి ప్రాధాన్యం ఉందని చెప్పారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు అన్నింటికంటే ఈ అంశాన్ని ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఎస్వీ యూనివర్సిటీ డీన్ రామకృష్ణయ్య మాట్లాడుతూ మానవ వనురుల అభివృద్ధిశాఖ యువతను ఉన్నత విద్యవైపు ఆకర్షించి దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో మొదటిసారిగా విజ్ఞాన సమాజం అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చారని చెప్పారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ కేవలం విద్యను మాత్రమే కాకుండా సాహిత్య సాంస్కృతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వీలు కల్పించాలని కోరారు. అభివృద్ధి మార్గాలను, వాటి ఫలాలను వేగతరం చేయడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ శ్రీనివాస్, వీఎస్‌యూ డీన్ చంద్రయ్య పాల్గొన్నారు. -
వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలి
నెల్లూరు (టౌన్) : విక్రమ సింహపురి యూనివర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్షుడు సాంబశివారెడ్డి డిమాండ్ చేశారు. వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని రెండో రోజూ శుక్రవారం వీఎస్‌యూ కళాశాల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్సిటీ భవనం పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్ అసమర్థత వల్లే నూతన భవనంలోకి మార్చలేదన్నారు. ఇటీవల వర్సిటీకి రూ.24 కోట్లు విడుదలతో మార్గం సుగమమైందన్నారు. వర్సిటీని పట్టించుకోవాల్సిన పాలక మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై అడిగితే ఇన్చార్జి ప్రిన్సిపల్ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వర్సిటీ భవనం మార్పుపై ఈ నెల 16న స్పష్టత ఇస్తామని హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమింపజేశారు. ఽఏబీవీపీ నాయుకులు జయచంద్ర, ప్రతాప్, రఘు, చైతన్యకృష్ణ, రఫి, కిరణ్, వివేక్, నరేష్, దిలిప్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక మెక్లిన్స్క్లబ్లోని ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడలను మూడు విడతలుగా జరుపుతున్నట్లు తెలిపారు. తొలుత నెల్లూరులో బ్యాడ్మింటన్ పోటీలు జరుపుతున్నామన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 15, డబుల్స్ విభాగంలో 14, మహిళల సింగిల్స్ విభాగంలో 9, డబుల్స్ విభాగంలో 9 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతలను శివకాశిలోని మధురై కామరాజు వర్సిటీలో అక్టోబరు 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్వర్సిటీ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్‌యూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శ ఎం చంద్రమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, వీఆర్ కళాశాల అధ్యాపకుడు గరుడేశ్వర్రెడ్డి, టోర్నీ అబ్జర్వర్ సీవీ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనకు ప్రాధాన్యం
వీఎస్‌యూ వీసీ వీరయ్య నెల్లూరు (టౌన్): రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనలకు ప్రాధన్యం ఇవ్వాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వీరయ్య తెలిపారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ క్లియర్ కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్‌పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పరిశోధనలను బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్, ఇంధిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. న్యూ క్లియర్ కెమిస్ట్రీ ఆవిష్కరణకు హె న్రీ బెకరల్, క్యూరీ లాంటివారు గట్టి పునాదులు వేశారని చెప్పారు. పశ్చిమ దేశాల్లో వ్యవసాయంలో వస్తున్న పెనుమార్పులుకు పరిశోధనలే కారణమన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ నేడు ప్రాకృతిక శిలాజ వనరులను కాపాడుకోవాలంటే అసంప్రాదాయక శక్తి వనరులైన అణుధార్మిక శక్తిని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అణుశక్తి ఉపయోగంతో తీవ్ర మానవ రుగ్మతల నివారణ, మానవ వికాసాన్ని పొందవచ్చన్నారు. ముంబైకు చెందిన బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ అణుశక్తి ఆధునిక పరిశోధనలు క్యాన్సర్ నివారణకు, రోగ నిర్ధారణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమెస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణి రేడియోధార్మిక మూలకాలైన కోబాల్ట్, బిస్మత్ లాంటి పదార్థాలను పలు ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి విజయ, త్రివేణి, వీరారెడ్డి, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు. -
పీజీ సెంటర్ కళాశాల స్థలం కబ్జా
కావలి : విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ కళాశాలకు చెందిన మూడు ఎకరాల స్థలాన్ని పేరుమోసిన కాంట్రాక్టర్ ఒకరు కబ్జా చేశారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి అన్నారు. పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా ఆక్రమించిన విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ దష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందన్నారు. రూ.18 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా వర్సిటీ వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆక్రమణల చుట్టూ కంచె వేసి విద్యార్థులను అటువైపుగా వెళ్లకుండా చేశారని ఆవేదన చెందారు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మనోజ్, నాని, శ్రీను, మణి, రమేష్ పాల్గొన్నారు. -
వీఎస్‌యూ వెబ్సైట్ మళ్లీ హ్యాక్
పాకిస్థాన్ జిందాబాద్ మెసేజ్ నెల్లూరు (టౌన్): నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్‌సైట్‌ను కొందరు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం నుంచి మరోసారి హ్యాక్ చేశారు. కొంత మంది విద్యార్థులు డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల కోసం వీఎస్‌యూ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పనిచేయలేదు. అయితే గూగూల్ కెళ్లి వీఎస్‌యూ రిజల్ట్స్ టైపు చేస్తే ఓపెన్ అవుతుంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. వీఎస్‌యూ అధికారులకు మాత్రం ‘సాక్షి’ సమాచారం ఇచ్చేదాక తెలియక పోవడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. పాకిస్థాన్ జిందాబాద్ అని, వెబ్‌సైట్‌కు సెక్యూరిటీ అనుకోవడం కేవలం మీ భ్రమని పోస్టు చేశారు. దీంతో పాటు ఈ నెల 14న దేశ వ్యాప్తంగా అనేక వెబ్సైట్లను హ్యాక్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఇదే వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను గత నెల 30న పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. అయితే వీఎస్‌యూ వెబ్‌సైట్‌పై సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెబ్‌సైట్‌ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహణలో ఉంది. వీఎస్‌యూ వెబ్సైట్ హ్యాక్ విషయంలో వీఎస్‌యూ రిజిస్ట్రార్ శివశంకర్‌కు ఫోన్ చేయగా మాల్వేర్ ఇంజక్షన్ వైరస్ ఫైర్‌వాల్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. సంస్థ నిర్వాహకులకు ఈవిషయాన్ని తెలియజేసి వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయించారని తెలిపారు. -
వీఎస్‌యూ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు
నెల్లూరు(టౌన్) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కళాశాలకు ప్రథమసంవత్సర విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో ర్యాంగింగ్‌ను అరికేట్టేందుకు, తరగతులు నిర్వహణ, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు వీఎస్‌యూ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో వర్సిటీలో పలు సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారని తెలిసింది. -
వీఎస్‌యూలో బోధనా సిబ్బందిని నియమించాలి
నెల్లూరు (టౌన్) విక్రమ సింహపురి విశ్వవిద్యాయంలో పూర్తిస్థాయిలో బోధించేందుకు అధ్యాపకులు నియమించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది త్యసాయి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో విద్యార్థులకు బోధనకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదన్నారు. ఏ ఏడాదికేడు కాంట్రాక్టు అధ్యాపకుల విధులను రెన్యువల్ చేస్తూ బోధనకు ఇబ్బం దులు లేకుండా చూసేవారని చెప్పా రు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులను నిలిపివేసిన నేపథ్యంలో సమస్య నెలకొందని తెలిపారు. ఈ విషయం హైకోర్టులో ఉన్నందున వీసీ, రిజిస్ట్రార్లు గెస్ట్ ఫ్యాకల్టీ పేరు తో కొత్తవారిని తీసుకునేందుకు కొత్త ప్రయత్నానికి తెరలేపారని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను కాకుండా గంటల ప్రకారం చెప్పే వారిని తీసుకోవాడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేక ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రార్ తుగ్లక్ పాలనతో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.