ఉత్తమ విద్యకు.. మంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచాయి నవోదయ విద్యాలయాలు. వీటిలో సీటు సాధించిన వారికి 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందించనున్నారు. అంతేకాకుండా కాకుండా భోజనం, వసతి సదుపాయం కూడా అందుతుంది. జిల్లాలో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎమ్మిగనూరు సమీపంలో వెలిసింది. ఇందులో ప్రవేశానికి ఈనెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదవాల్సిన పాఠ్యాంశాలపై సూచనలు, సలహాలు..
- న్యూస్‌లైన్, ఎమ్మిగనూరు రూరల్
ఇవి నిషేధం..
నవోదయ పరీక్షకు హాజరయ్యే విద్యార్థి తప్పనిసరిగా బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రంలో అందజేసే ఓఎంఆర్ షీట్‌లోని జవాబులను ఆ పెన్నుతోనే నింపాలి. పెన్సిల్, రబ్బర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించొద్దు. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకెళ్లరాదు. వెంట ప్యాడ్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు.
గంట ముందే చేరుకోవాలి..
ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్‌టికెట్ అందిన విద్యార్థులు ముందస్తుగా ఏ ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయించారో తెలుసుకోవాలి. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎలాంటి ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉండవు. ఈ పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అయినా.. నిర్ణీత సమయంలోనే పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.
గ్రూపు చర్చలతోప్రయోజనం..
నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గ్రూపు చర్చలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి చర్చలతో సబ్జెక్టులను ఎక్కువగా అవగతం చేసుకోవచ్చు. తద్వారా పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించడానికి వీలుంటుంది.
రిజర్వేషన్లు..
ఎక్కువ మార్కులు వచ్చిన వారికి విద్యాలయంలో సీటు దక్కుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు ఏడున్నర శాతం, పీహెచ్‌సీలకు 2, బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పట్టణ విద్యార్థులకు 25 సీట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 సీట్లు భర్తీ చేస్తారు.
పాత ప్రశ్నపత్రాలను గమనించాలి..
విద్యార్థులు పూర్వ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. కనీసం మూడేళ్ల నుంచి ప్రశ్నపత్రం ఏ విధంగా రూపొందిస్తున్నారో, ఏయే చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి.
ఏ చాప్టర్ కీలకమో గమనించాలి. భాష భాగంలో కొద్దిపాటిగా తర్ఫీదు తీసుకుంటే మార్కులు సాధించడం కష్టమేమి కాదు. ముఖ్యంగా విద్యార్థులు సమయంతో పోటీపడాలి. తక్కువ సమయంలోనే జవాబులు గుర్తించగలగాలి. తొలుత తెలిసిన సమాధానాన్ని పూర్తిచేయాలి. తదుపరి మిగతా ప్రశ్నలపై ఆలోచించాలి. జవాబుపత్రంలో కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానం రాయాలి.
భాషపై పట్టు తప్పనిసరి...
విద్యార్థుల భాష, పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాష పరీక్ష ఉంటుంది. మెజార్టీ విద్యార్థులు తెలుగునే ఎంచుకుంటారు. 25 మార్కులు కేటాయిస్తారు. ఏదేని మూడు పాఠ్యాంశాలను ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో ఐదు ప్రశ్నలుంటాయి. వ్యాకరణం, లేఖన నైపుణ్యం, పరీక్షించేందుకు మరో పది ప్రశ్న లుంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా వచ్చే ప్రశ్నకు సమాధానాలు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులను ఎంచుకోవాలి. వ్యాకరణంలో ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నా అభ్యాసమే అత్యంత ప్రాధాన్యం. రోజూ ఓ గంట వ్యాకరణం చదవడం మేలు.
పరీక్ష జరిగే విధానం..
నవోదయ ప్రవేశ పరీక్ష ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా రెండు గంటలపాటు ఉంటుంది. నిర్ధేశించిన సమయంలోనే విద్యార్థులు పరీక్ష రాయాలి. మేధాశక్తి, గణితం, భాషా సంబంధిత పరీక్షలు (మూడు విభాగాలుగా) ఉంటాయి. వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మేధా శక్తి(రీజనింగ్)లో 50 మార్కులు, గణితంలో 25 మార్కులు, తెలుగు/ఆంగ్లం పఠనాంశంలో 15 మార్కులు, వ్యాకరణంలో 10 మార్కులు ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి వీలైనంత మేరకు ప్రశ్నలన్నింటికీ జవాబురాయడం ఉత్తమం.
శ్రద్ధ+సాధన=నవ విజయం
Published Wed, Feb 5 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement