న్యూఢిల్లీ: ఆ సెంటర్‌లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అది ఫలితాలపై, మొత్తం పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తూ .. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నాం సెంటర్‌ల వారీగా ఫలితాలు విడుదల చేశారు. అయితే..
హర్యానాలో 720కి 720 ఆరుగురికి వచ్చిన సెంటర్‌లో ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బహాదుర్‌ఘడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్‌లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. కానీ, ఆ సెంటర్‌లో రీఎగ్జామ్ రాసిన వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్‌లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.
మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో.. హర్యానా సెంటర్‌లో రాసిన ఆరుగురికి ఫుల్‌స్కోర్, మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. అయితే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్‌టీఏ వెల్లడించడం తెలిసిందే.
గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై రాజకీయ దుమారం సైతం చెలరేగడం, ఆపై వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తూ రీటెస్ట్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. జూన్ 24వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహించగా.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు.
ఇక.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచింది. అయితే.. ఫలితాల వెల్లడి టైంలో విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీం సూచనను టెస్టింగ్ ఏజెన్సీ పాటించింది.
Comments
Please login to add a commentAdd a comment