ఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్ పద్దతిలో నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కేంద్ర విద్య-ఆరోగ్య శాఖల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘‘నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం మేరకు నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తామని ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
2024లో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా, జేఈఈ మెయిన్ తరహాలోనే ఈసారి కూడా నీట్ యూజీ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్ విధానంలోనే నీట్ నిర్వహించాలంటూ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత సర్వే, చర్చల్లో ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.
నీట్ ఫలితాల ఆధారంగానే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు చేపడతారు. దీంతో పాటుగా ఆర్మ్‌డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నీట్ యూజీ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక
Comments
Please login to add a commentAdd a comment