8వ వేతన సంఘం ఏర్పాటు | Union Cabinet Approves Formation Of 8th Pay Commission | Sakshi
Sakshi News home page

8వ వేతన సంఘం ఏర్పాటు

Published Thu, Jan 16 2025 3:38 PM | Last Updated on Fri, Jan 17 2025 8:04 AM

Union Cabinet Approves Formation Of 8th Pay Commission

ప్రధాని ఆమోదం  

లబ్ది పొందనున్న కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు 

న్యూఢిల్లీ: దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. 8వ పే కమిషన్‌ ఏర్పాటుకు ప్రధాని మోదీ గురువారం ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తంచేశారు. గురువారం ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే వేతనసంఘాన్ని ఏ తేదీన ఏర్పాటుచేస్తారో ఆయన వెల్లడించలేదు. 

ఈసారి ఫిట్‌మెంట్‌ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఒకవేళ ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూలవేతనం, దానికి హౌస్‌ రెంట్‌ అలవెన్సులు, ఇతరత్రాలు కలుపుకుని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చు. వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలుచేస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. ఏడో వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఏడాది నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు వేతనసంఘాన్ని ఏర్పాటుచేశారు. 

చివరిసారిగా 2016లో ఏడో వేతన సంఘం అమల్లోకి వచి్చంది. ‘‘ 7వ పే కమిషన్‌ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కొత్త కమిషన్‌ ఏర్పాటుకు ఏడాది కాలముంది. ఈలోపే పూర్తిస్థాయిలో సలహాలు, స్వీకరించడానికి సరిపడా సమయం ఉండటం కలిసొచ్చే అంశం’’ అని మంత్రి వైష్ణవ్‌ అన్నారు. జీత భత్యాలు, వేతనాలు, అలవెన్సులు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమిషన్‌దే కీలక పాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో పే కమిషన్‌ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. తగు సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. 

ఏడో కమిషన్‌ ఏం చెప్పింది? 
ఏడో పే కమిషన్‌ను 2014లో ఏర్పాటుచేయగా అది 2016 జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. 7వ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. నెలకు కనీస వేతనం రూ.18,000 ఉండాలని, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు ఉండాలని సిఫార్సు చేసింది. 

మూలవేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు రూ.20 లక్షలు ఉండాలని సిఫార్సుచేసింది. అంతకుముందు 2006 ఏడాదిలో వచి్చన ఆరో పే కమిషన్‌ నెలకు కనీస వేతనం రూ.7,000, కార్యదర్శిస్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం రూ.80,000 చెల్లించవచ్చని సిఫార్సు చేసింది. 1.86 రెట్లు ఫిట్‌మెంట్‌ ఉండాలని, గ్రాట్యుటీ రూ.10 లక్షలు ఇవ్వాలని, సరిపడా హౌస్‌ రెంట్‌ అలవెన్సు ఇవ్వాలని సూచించింది. 

అరకోటి మంది ఉద్యోగులకు లబ్ధి 
జీతభత్యాలను పెంచుతూ ఎనిమిదో కమిషన్‌ ఇచ్చే సిఫార్సులతో దాదాపు అరకోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబి్ధపొందనున్నారు. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో రక్షణ శాఖతోపాటు ఢిల్లీ రాష్ట్రపరిధిలో పనిచేసే ఉద్యోగులూ ఉంటారు. అంటే ఫిబ్రవరి ఐదున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్‌ ఏర్పాటు వార్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్‌ పే కమిషన్‌ ఏర్పాటుపై హడావుడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలొచ్చాయి. 

ఏడో పే కమిషన్‌ సిఫార్సులను అమలుచేయడం వల్ల ప్రభుత్వంపై 2016–17 ఆర్థికసంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల వ్యయభారం పడింది. అయితే పెరిగిన వేతనాలను ఉద్యోగులు ఖర్చుచేయడంతో దేశంలో వినిమయం పెరిగి దేశారి్థకం బాగుపడుతుందనే వాదనలూ ఉన్నాయి. సాధారణంగా సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ప్రతి పదేళ్లకు పే కమిషన్‌ ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలావరకు పే కమిషన్‌ సిఫార్సులను పరగణనలోకి తీసుకుని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ఓ నిర్ణయానికొస్తాయి.   
 

ఇదీ చదవండి: కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement