తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే..
నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్‌లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు.
మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్‌ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్‌టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్‌టీఏ తెలిపింది.
విమర్శల నేపథ్యంతో..
కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబడుతున్నారు.
పోలీస్ కేసు నమోదు
బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్‌టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్‌లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది.
డ్రెస్ కోడ్ ఏంటంటే..
అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్‌లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్‌లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
గతంలో కేరళలోనే..
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment