
కేరళలో వింత ఘటన
పథనంథిట్ట(కేరళ): ప్రకృతి రమణీయతకు, ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరైన కేరళలో పథనంథిట్ట జిల్లా అంతే స్థాయిలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ జిల్లాలో భూమి కోసమో నగదు కోసమో తగాదా జరిగితే అది వార్త స్థాయికి చేరేదికాదు. కానీ ఒక కోడి కూత ఇప్పుడు ఫిర్యాదుచేసి కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ కోడి అన్ని కోళ్లలాగా ఉదయం ఆరు గంటలకో అంతకు కాస్తంత ముందే కూత పెట్టట్లేదు. ఆ కోడి పుంజు ప్రతిరోజూ ఠంచనుగా తెల్లవారుజామున మూడు గంటలకే కూత అందుకుంటోంది.
నిశ్శబ్దం రాజ్యమేలే మూడు గంటల వేళ అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ కోడి కూత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఇది ముఖ్యంగా పక్కింట్లో ఉండే వృద్ధుడు రాధాకృష్ణ కురూప్ నిద్రకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లజేస్తోంది. ఆ శబ్దాలకు నిద్ర పట్టక రాధాకృష్ణ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని ఆ కోడి యజమాని అనిల్‌కుమార్‌కు చెప్పిచూసినా లాభం లేకుండాపోయింది. దీంతో చేసిదిలేక అదూర్ రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆ కోడి పుంజుపై ఫిర్యాదు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బందులు పడుతున్న ఆ పెద్దాయన అవస్థ చూడలేక అధికారులు కోడి యజమాని అనిల్ కుమార్‌ను పిలిపించారు. తన తప్పేంలేదని యజమాని అనిల్ వాదించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పోలీసులు రంగంలోకి దిగి కోళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అనిల్ కుమార్ ఆ కోళ్లను నేలపై పెంచకుండా తన స్థలంలోని తొలి అంతస్తులో పెంచుతున్నాడు.
ఎత్తు నుంచి శబ్దం వస్తుండటంతో చుట్టూతా గోడలు, ఎలాంటి అడ్డూ లేకపోవడంతో కోడి కూత పెద్దగా వినిపిస్తోందని అధికారులు తేల్చారు. దీనికి పరిష్కారంగా కోళ్లను మొదటి అంతస్తు నుంచి తరలించి అదే స్థలంలో దక్షిణ వైపు నేలపై పెంచుకోవాలని అధికారులు సూచించారు. మరో 14 రోజుల్లోపు ఈ కోళ్ల తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని యజమాని అనిల్‌కు అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో వృద్ధుడు కాస్తంత ఆనందం వ్యక్తంచేశారు. కోడి కూత అంశం కేసుదాకా వెళ్లిందని ఇరుగుపొరుగు తెగ మాట్లాడుకుంటున్నారు. పళ్లిక్కల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment