రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒకే ఒక పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. అదే కేరళలోని మలప్పురం నియోజకవర్గం అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. ఎందుకంటే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే..
విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు. ‘ది క్వింట్’ కథనం ప్రకారం.. రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రభావితుడై రాజకీయాల్లోకి వచ్చారు. 2022 జూలై నుంచి లోక్‌సభలో గానీ, రాజ్యసభలోగానీ బీజేపీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు.
మలప్పురం స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్, సీపీఎం అభ్యర్థి వి.వసీఫ్‌లపై అబ్దుల్ సలామ్ పోటీ చేయనున్నారు. మలప్పురం నియోజకవర్గం డీలిమిటేషన్‌కు ముందు మంజేరిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భాగమైన ఐయూఎంఎల్‌కి కంచుకోటగా ఉంది.
ఎవరీ అబ్దుల్ సలామ్?
మలప్పురంలో జన్మించిన అబ్దుల్ సలామ్ పీహెచ్‌డీ చేశారు. 2011 నుంచి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. కేరళలో యూడీఎఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఐయూఎంఎల్ ద్వారానే ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం.
అబ్దుల్ సలామ్ బీజేపీలో చేరిన రెండు సంవత్సరాల తరువాత అంటే 2021లో తిరుర్ స్థానం నుండి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఐయూఎంఎల్ అభ్యర్థి కురుక్కోలి మొయిదీన్ చేతిలో 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా సలాం బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment