
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్‌సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు.
కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్‌లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.
ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment