Kollam
-
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
పండుగ పూట.. మహిళలుగా మారిపోయే పురుషులు (ఫొటోలు)
-
దేశంలోని సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా ఏది?
అది కేరళలోని ఒక జిల్లా. అక్కడి పౌరులందరికీ రాజ్యాంగంలో నియమనిబంధనలు, హక్కులు గురించి క్షుణ్ణంగా తెలుసు. జిల్లాలోలోని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని చదివాడు. ఇటువంటి విలక్షణత కలిగిన జిల్లా దేశంలో ఇదొక్కటేనని చెప్పవచ్చు. ఈ జిల్లా పేరు కొల్లాం. ఈ జిల్లాలలో 10 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరికీ రాజ్యాంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. రెండేళ్ల క్రితం కేరళలోని పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ‘సిటిజన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈ జిల్లాల్లోని పిల్లలు, పెద్దలు, అధికారులు, శ్రామికులు ఇలా అందరూ రాజ్యాంగాన్ని చదివి, దానిపై అవగాహన ఏర్పరుచుకున్నారు. కొల్లాం జిల్లా జనాభా 14 లక్షలు. ఈ జిల్లాలోని వారికి వివిధ పంచాయతీలు, కొల్లాం జిల్లా యోజన సమితి, కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ ఎడ్మినిస్ట్రేషన్ మొదలైనవన్నీ ‘సిటిజన్-2022’ కింద రాజ్యాంగంపై అవగాహన కల్పించాయి. ఈ నేపధ్యంలో కొల్లాం రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా మార్పునొందింది. 2023 జనవరి 14న కేరళ సీఎం పినరయి విజయన్ కొల్లాం జిల్లాను భారత తొలి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు. జిల్లాలోని 7 లక్షల కుటుంబాలకు చెందిన 23 లక్షల మంది పౌరులకు రాజ్యాంగ అక్షరాస్యతను అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కొల్లంలో దాదాపు 90% మందికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఫలితంగా జిల్లాలో సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత సాధ్యమయ్యిందని అధికారులు చెబుతున్నారు. -
తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. (ఇది చదవండి: థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!) కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పి.. అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగింది. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా.. రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది. (ఇది చదవండి: మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా) Bouncers try to stop fan from getting near #Tamannaah but she says #Kaavaalaa and gracefully poses for a selfie sending the fan to cloud nine #KaavaalaaStorms100MViews Get ready to witness @tamannaahspeaks magic on big screens #JailerFromAugust10th 😍😍pic.twitter.com/cnt4N9ZFsh — moviememesmedia (@moviememesmedi1) August 6, 2023 -
ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్ ప్రస్తుతం సమీపంలోని కొడుంగలూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సుధీ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) ఎలా జరిగిందంటే.. సుధి, మిగిలిన ముగ్గురు వటకరా ప్రాంతంలో ఒక ఈవెంట్‌ను ముగించుకుని కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ కెరీర్ కొల్లం సుధీ 2015లో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, 'ఎస్కేప్', స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాల్లో నటించాడు. సుధీ చాలా చిత్రాలలో కనిపించినప్పటికీ.. అతను బుల్లితెరపై నటనకే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాడు. కొల్లం సుధీ తన మిమిక్రీతోనే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతను స్టార్ మ్యాజిక్ షోతో మరింత ఫేమ్ సంపాదించారు. మలయాళంలో పలు కామెడీ షోలతో అలరించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) View this post on Instagram A post shared by Kollam Sudhi (@kollam_sudhi_) -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవంతి(ఫేజ్–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు. దీంతోపాటు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. వివేకానంద హౌజ్‌ను సందర్శించిన మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు. -
గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు
తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. శనివారమే అతడ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని మంత్రి తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుని కుటుంబసభ్యుల్లో ఎవరికీ మంకీపాక్స్ సోకలేదని, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు. అలాగే మంకీపాక్స్ బారినపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. కేరళ కొల్లం జిల్లాకు చెందిన మంకీపాక్స్ తొలిబాధితుడికి జులై 14న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఆ తర్వాత కేరళలోనే మరో రెండు కేసులు వెలుగుచూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చినవారే. మంకీపాక్స్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య ఇప్పటికే తెలిపింది.ఈ మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇది స్మాల్‌పాక్స్ తరహా వ్యాధి అని ప్రాణాంతకం కాదని పేర్కొంది. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు.. మరాఠీ గర్వాన్ని అవమానించారు -
Kerala NEET Controversy: బలవంతంగా లోదుస్తులు విప్పించారు
తిరువనంతపురం: నీట్ పరీక్ష కోసం వెళ్లిన ఓ అభ్యర్థి చేదు అనుభవం.. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆ ఘటన దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్ట్ ఏజెన్సీ’ ఈ ఘటనను తోసిపుచ్చింది. విద్యార్థిని తండ్రి Gopakumar Sooranad ఆరోపణలను అసత్యప్రచారంగా కొట్టిపడేసింది. అయితే మంగళవారం మరో రెండు ఫిర్యాదులు అందడంతో.. నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవహారం మరింత ముదిరినట్లయ్యింది. ఇదిలా ఉండగా.. బాధితురాలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అదొక చేదు అనుభవంగా చెప్పిన పదిహేడేళ్ల యువతి.. నీట్ సెంటర్ దగ్గర బలవంతంగా తమతో లోదుస్తులు విప్పించారని తెలిపింది. ‘స్కానింగ్ జరిగే దగ్గర కొందరు సిబ్బంది ఉన్నారు. అక్కడికి రమ్మని నాకు సైగ చేశారు. అక్కడ రెండు లైన్లలో అభ్యర్థులు నిల్చుని ఉన్నారు. నన్ను స్కాన్ చేశాక.. లోపలికి పంపిస్తారు అనుకున్నా. కానీ, ‘మెటల్ ఉన్న ఇన్నర్‌వేర్ వేస్కున్నావా?’ అని అడిగారు. ‘అవును’ అని సమాధానం ఇచ్చా. వెంటనే పక్కనే ఉన్న ఓ లైన్లో నిల్చొమన్నారు. అప్పుడు అర్థమైంది ఆ లైన్లో ఉన్నవాళ్లంతా మెటల్ హుక్ బ్రాలు ధరించిన వాళ్లేనని... ఆ తర్వాత ఆ క్యూలో ఉన్న అందరినీ పక్కకు పిలిచి బ్రాలు తొలగించి.. టేబుల్ మీద పెట్టమన్నారు సిబ్బంది. పరీక్ష రాయడానికి బ్రాలు ఉండాల్సిన అవసరం లేదని, లేకుంటే లోపలికి పంపించమని అనడంతో మా అందరికీ సిగ్గుగా అనిపించింది. ఒక చీకటి గదిలోకి వెళ్లి అమ్మాయిలమంతా చెప్పినట్లు చేశాం. అదొక భయానక అనుభవం. గదిలో వెలుతురు లేదు.. లైట్ లేదు. అమ్మాయిలు.. అబ్బాయిలు అంతా ఒకే హాలులో పరీక్ష రాయాల్సి ఉంది. సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించి.. చాలామంది శాలువాలు, స్కార్ఫ్‌లు వేసుకుంటామని అడిగాం. కుదరదన్నారు. చేసేది లేక.. జుట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాశాం. చాలామంది అవమానంగా, భయంభయంగా పరీక్ష రాశారు. నాతో సహా చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఇన్విజిలేటర్ సెక్యూరిటీతో వచ్చి.. ఎందుకు ఏడ్వడం అంటూ గట్టిగా గద్దించారు. పరీక్ష అయ్యాక బ్రాలను కుప్పలుగా పడేశారు. వెతుక్కోవడానికి చాలామంది అవస్థలు పడ్డారు. ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి రాకూడదు అంటూ ఏడుస్తూ.. చెప్పుకొచ్చింది యువతి. ముక్తకంఠంతో ఖండన కేరళ కొల్లాంలో నీట్ పరీక్షకు హాజరైన అమ్మాయిల లోదుస్తులు తొలగించిన ఘటనపై జాతీయ మహిళా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన సిగ్గు చేటని, అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశమని ప్రకటించింది. మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. మళ్లీ తాజా దర్యాప్తును చేపట్టాలని కేరళ పోలీసులను విద్యాశాఖ మంత్రి డాక్టర్ బిందు ఆదేశించారు. మరోవైపు మానవ హక్కుల సంఘం సైతం ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిజనిర్ధారణ కమిటీ రెండు మూడు రోజుల్లో ఘటనపై దర్యాప్తు ప్రారంభించనుంది. రేఖా శర్మ లేఖ కేరళలో ఆదివారం ఓ నీట్ పరీక్ష కేంద్రంలో 17 ఏళ్ల అమ్మాయిని నిర్వాహకులు లో దుస్తులు విప్పించారన్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ తీవ్రంగా ఆగ్రహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు లేఖ రాశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు ఏజెన్సీ వ్యక్తులను, ఇద్దరు విద్యాసంస్థ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, నీట్ పరీక్షలో అభ్యర్థికి బదులు వేరొకరు పరీక్ష రాసేందుకు రూ.20 లక్షల చొప్పున ఒప్పందాలు జరిగాయని సీబీఐ విచారణలో తేలింది. చదవండి: నీట్ పరీక్షకు ‘బ్రా’ వేసుకోకూడదా?.. గైడ్‌లైన్స్‌లో ఏముందంటే.. -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
నీట్ పరీక్షలో విద్యార్థినికి ఘోర అవమానం! ఫిర్యాదు చేసిన తండ్రి
తిరువనంతపురం: నీట్ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే కేరళ కొల్లం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు. రూల్ ఏం లేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మెటల్ హుక్స్ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్ చేసిన తర్వాతైనా హాల్లోకి అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు మార్ థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
ఆ కారులోనే నా బిడ్డ ఆత్మ! దోషికి శిక్ష ఖరారు
కొల్లం: కేరళలో వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసిఆత్మహత్యకుప్రేరేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల నేరాలకుగాను ఈ శిక్ష విధించినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్ ,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహనరాజ్ విలేకరులకు తెలిపారు. ఈకేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కుమార్‌కు గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.ఈ ఘటనకు ఒక రోజు ముందు, విస్మయ తన బంధువులకు వరకట్న వేధింపుల గురించి వాట్సాప్ సందేశాలను పంపింది, అలాగే ఆమె శరీరంపై గాయాల ఫోటోలు, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపించింది. 2020లో పెళ్లి సందర్భంగా కుమార్‌కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్‌కి కట్నంగా ఇచ్చారు. కారు, నచ్చలేదని, వద్దన్న కిరణ్ ఆ పది లక్షల నగదు రూపంలో కావాలని వేధించి, చిత్ర హింసలకు గురి చేయడంతో విస్మయ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే, దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన విస్మయ తల్లితండ్రులు త్రివిక్రమన్ నాయర్, సజిత సంతోషం వ్యక్తం చేశారు. అయితే కిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకున్నారు. అంతేకాదు ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే ఆమె తండ్రి విచారణకు హాజరయ్యారు. ‘‘నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం సీటు ఎపుడూ ఖాళీగా ఉంచుతా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు తాజా తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లై వెల్లడించారు. -
అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
కొల్లాం: కేరళ రాష్ట్రంలో వరకట్న వేధింపులకు బలైన 23 ఏళ్ల యువతి ఘటన చర్చనీయాంశంగా మారింది. కుందనపు బొమ్మ లాంటి ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధించిన చిత్రహింసలు చివరకు ఆమె చావుకు కారణమైంది. కడక్కల్ లోని కైతోడ్ కు చెందిన ఎస్.వి. విస్మయ సోమవారం(జూన్ 21) ఉదయం వాష్ రూమ్ లో ఊరి వేసుకొని కనిపించింది. తొలుత అందరూ ఆత్మహత్యాగా భావించినప్పటికి తర్వాత తన సోదరుడికి పంపిన మెసేజ్‌లు, ఫొటోలు బయటపడటంతో అత్తింటి వారే ఆమెను హింసించి చంపినట్టుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తింట్లో ఆమె పడిన క్షోభ అంతా ఇంతా కాదని ఆ ఫొటోలను చూస్తే మనకు స్పష్టం అవుతుంది. ఈ చిత్రాలలో ఆమె ముఖం, చేతులపై గాయాలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండటంతో కూతురిని సంతోషంగా చూసుకుంటాడని విస్మయ తల్లిదండ్రులు కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. అతనికి కట్నం కింద 100 సెవిరీల బంగారం, ఎకరానికి పైగా భూమి, టయోటా యారిస్ కారును కట్నంగా అల్లుడికి ఇచ్చారు. పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత హింసించడం మొదలు పెట్టాడు. కిరణ్ తనకు కట్నంగా ఇచ్చిన కారుకు బదులుగా నగదు కావాలని పట్టుబట్టాడు. అతను ఇంతకు ముందు కూడా ఆమెపై దాడి చేసినట్లు తమకు తెలుసునని విస్మయ తండ్రి వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు. "ఒకసారి అతను ఆమెతో ఇంటికి వచ్చాడు, అందరూ పార్టీ తర్వాత తాగి ఉన్నారు. వారు ఇంటికి చేరుకున్న తర్వాత అతను ఆమెను కొట్టాడు, నా కుమారుడు దాని గురించి అడగడానికి వెళ్ళినప్పుడు, కిరణ్ అతనిని కూడా కొట్టాడు. మేము వెంటనే పోలీసులను ఆశ్రయించాము. అయితే, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కిరణ్, మా కుటుంబం మధ్య రాజీ కుదిర్చారు. ఈసారి వదిలేయండి అని తన కుమారుడు చెప్పడంతో ఆ తర్వాత నుంచి నా కుమార్తె మా ఇంట్లోనే ఉంది. కానీ రెండు నెలల క్రితం, ఆమె బీఎఎమ్ఎస్ పరీక్షలు రాయడానికి కళాశాలకు (పండలంలో) వెళ్ళినప్పుడు, కిరణ్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు, ఆ తర్వాత నుంచి ఆమె ఇంటికి రాలేదు" అని వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు. ఆ తర్వాత నుంచి విస్మయ తన తల్లిని మాత్రమే కాల్ చేసేది, తండ్రికి లేదా సోదరుడకి కాల్ చేసేది కాదు. తన తల్లితో భర్త కిరణ్ రోజు హింసించే వాడని, రోజు కొడుతున్నడని ఆమె వాళ్ల అమ్మకు చెప్పది. ఈ విషయం గురుంచి సోదరుడికి, తండ్రికి చెప్పవద్దు అన్నట్లు కూడా చెప్పింది. చాలా రోజుల పాటు నరకయాతన అనుభవించిన విస్మయ చనిపోయే రెండు రోజుల ముందు సరిగ్గా జూన్ 19న తన కజిన్‌కు భర్త కిరణ్ తనను ఎంత వేధిస్తున్నాడో మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని తనకు అయిన గాయాలను చూపిస్తూ ఫొటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపింది. సరిగ్గా రెండు రోజులకే ఆమె అత్త ఇంటి నుంచి విస్మయ తల్లిదండ్రులకు ఫోన్ వెళ్లింది. విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమెను ఆసుపత్రికి తరలించామని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. విస్మయ సోదరుడు విజిత్ పీ నాయర్ భాదతో ఇది ఒక హత్య అని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. స్థానిక పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి సోదరుడు ఆమె ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించి మహిళ చిత్రాలు, వాట్సప్ సంభాషణలను పోలీసులకు సమర్పించాడు. ఈ కేసుపై వెంటనే నివేదిక సమర్పించాలని కొల్లం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)ని మహిళా కమిషన్ కోరింది. మహిళ కుటుంబం ఎంచుకున్న ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా చేయాలని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిదా కమల్ చెప్పారు. చదవండి: బైక్‌తో బీటెక్ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని -
సోషల్ మీడియా పోస్ట్ రచ్చ.. లవర్ని సజీవదహనం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ వల్ల చెలరేగిన వివాదం చివరకు మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీ వద్ద మహిళను సజీవ దహనం చేశాడు ఆమె భాగస్వామి. ఆ వివరాలు.. షానవాజ్(30), అతిరా గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. కొల్లాం అంచల్లో నివసిస్తున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతిరా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాట మాట పెరిగింది. ఆగ్రహించిన షాన్వాజ్ అతిరా మీద కిరోసిన్ పోసి, లైటర్‌తో నిప్పంటించాడు. ఆమె ఆరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఇక ఈ ఘటనలో షాన్వాజ్కు కూడా తీవ్రంగా గాయలయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఇక తీవ్రంగా గాయపడిన అతిరా మృతి చెందగా.. షాన్వాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇక అతిరా తల్లి ఫిర్యాదు మేరకు కొల్లాం పోలీసులు షాన్వాజ్ మీద కేసు నమోదు చేశారు. చదవండి: సహజీవనం.. గదిలో బంధించి అత్యాచారం -
ఈత కొట్టి, చేపలు పట్టిన రాహుల్.. వైరల్
కొల్లాం: కేరళలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అతి పెద్ద సాహసమే చేశారు. కొల్లాం సముద్రంలో వారితో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా సముద్రంలోకి దూకి కాసేపు ఈత కొట్టారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం తెల్లవారుజామున వాడి బీచ్ నుంచి మత్స్యకా రులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. మీ పని అంటే గౌరవం పడవ తిరిగి ఒడ్డుకు వచ్చాక థంగస్సెరీ బీచ్ దగ్గర మత్స్యకారులనుద్దేశించి రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మీరు చేసే పనిని నేను ఎంతో గౌర విస్తాను. ఆరాధిస్తాను. మేము లొట్టలేసుకుంటూ చేపలు తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్లోకి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇవాళే అర్థమైంది’’ అని రాహుల్ అన్నారు. సముద్రంలో సాహసం వల వేశాక మత్స్యకారులతో కలసి రాహుల్ కూడా సముద్రంలో దిగారు. హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. దాదాపు 10 నిమిషాలు ఈత కొట్టినట్టుగా ఆయనతో పడవలో ప్రయాణించిన కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఎవరితో చెప్పకుండా హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు. హమ్ దో.. హమారే దో! గుజరాత్లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు విసిరారు. ‘హమ్ దో.. హమారే దో(మేమిద్దరం.. మాకిద్దరు)’ అనే హ్యాష్ ట్యాగ్‌తో బుధవారం ఒక వ్యంగ్య వ్యాఖ్యను ట్వీట్ చేశారు. ‘వాస్తవాలు ఎంత అందంగా బయటపడుతున్నాయో చూడండి. స్టేడియం పేరు నరేంద్ర మోదీ స్టేడియం. ఒక ఎండ్ పేరు అదానీ ఎండ్, మరో ఎండ్ పేరు రిలయన్స్ ఎండ్. పరిపాలన బాధ్యతల్లో జే షా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా, స్టేడియంలోని రెండు ఎండ్లను అదానీ, రిలయన్స్ ఎండ్స్గా నిర్ణయించడాన్ని రాహుల్ ఇలా ఎద్దేవా చేశారు. కాగా, ఈ పేరు మార్పు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. కేవలం స్టేడియం పేరును మాత్రమే మార్చామని, మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు సర్దార్ పటేల్ పేరుపైననే కొనసాగుతుందని వివరణ ఇచ్చింది. ప్రధాని దార్శనికతకు గౌరవం.. గుజరాత్లో నిర్మించిన స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేయడాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమర్ధించారు. ఇది క్రీడారంగంలో భారత్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ దార్శనికతను గౌరవించే వినమ్ర ప్రయత్నమని అభివర్ణించారు. స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు తొలగించి, ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ నాయకులు స్పందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ ఏ నాడూ గౌరవించలేదని ఆరోపించారు. అంతకుముందు, పటేల్ పేరును తొలగించి స్టేడియానికి మోదీ పేరు పెట్టడం సర్దార్ పటేల్‌నే కాదు.. భారతీయులని అవమా నించడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. -
‘కరోనా’కి జై కొడుతున్నారు!
కేరళలోని కొల్లాం వాసులు ‘కరోనా’కి జై కొడుతున్నారు. దేశ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనాకు ఎందుకు జై కొడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? వాళ్లు జేజేలు పలికేది కరోనా వైరస్‌కు కాదు. దీని వెనుక కథ తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.. తిరువనంతపురం: కరోనా వైరస్ మహామ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ప్రజలు ‘పో కరోనా పో’ అంటూ కరోనాపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ, కేరళలోని ఓ ప్రాంతం ప్రజలు ‘కరోనాకి జై’.. ‘కరోనా వర్ధిల్లాలి’ అంటున్నారు. అయితే ఈ జేజేలు మహామ్మారి పురుగు కరోనా వైరస్ కోసం కాదు! కార్పొరేషన్ ఎన్నికల బీజేపీ అభ్యర్థి ‘కరోనా థామస్’ కోసం. ఇంతకీ అసలు కథేంటంటే.. 24 ఏళ్ల కరోనా థామస్ కేరళలోని కొల్లాం ప్రాంతం వారు. తండ్రి థామస్ మాథ్యూ కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తి. అందుకే పుట్టిన కవల పిల్లలలో ఒకరి కోరల్ అని మరొకరికి కరోనా అని పేర్లు పెట్టాడు. గడిచిన ఇన్నేళ్లలో తన పేరు కారణంగా కరోనా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. (హాహాహా... ఊహించలేని సంఘటన ఇది! ) కానీ, ఈ కరోనా పరిస్థితుల్లో ఆమె పేరు విన్న వారు ఆమె వైపు విచిత్రంగా ఓ లుక్కేసేవారంట. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కరోనా బీజేపీ సానుభూతి పరుల ఇంట్లోకి అడుగుపెట్టారు. తాజాగా కొల్లాం కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కరోనా దూసుకుపోతున్నారు. అంతకు క్రితం వింతగా చూసిన జనం ప్రస్తుతం జైజైలు కొడుతున్నారు. అయితే కరోనా వైరస్ బారిన పడి క్రిమితో పోరాడి గెలిచిన కరోనా.. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతానేమోనన్న భయంతో ఉన్నారు. -
రాకెట్ వేగంతో ట్రక్కు; కొంచెం అయ్యుంటే..
తిరువనంతపురం: 'అదృష్టం ఉన్నోడిని పాడు చేయలేం, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేం' అన్న సామెత ఇతని విషయంలో అక్షరాలా నిజమైంది. కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఎడమ పక్కనుంచి ఓ ట్రక్కు తుఫాను వేగంతో వెళ్లింది. కళ్లు తెరిసి మూసే లోపే అది రయ్‌మని వెళ్లిపోయింది. దీంతో అసలేం జరిగిందో అర్థమవని స్థితిలో తత్తరపాటుకు లోనైన అతనికి ముందు రాకెట్లా దూసుకుపోతున్న వాహనం చూసి గుండెలదిరిపోయాయి. పైగా ఆ బండి బ్యాలెన్స్ తప్పుతూ వంకరటింకర్లు తిరిగింది. (షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’) అది చూసి హడలిపోయిన ఆ బాటసారి చావు తన పక్కన నుంచే వెళ్లిందా అనుకుంటూ రోడ్డు దిగి ఊపిరి పీల్చుకున్నాడు. గుండెలదిరే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్రక్కుకు, సదరు వ్యక్తికి మధ్య కొన్ని ఇంచుల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆ వ్యక్తిని అదృష్టవంతుడు అని కొనియాడుతున్నారు. అయితే ఈ వీడియోలో అతివేగంతో వెళుతున్న డ్రైవర్‌ది తప్పని కొందరు, రోడ్డుపైనే ఎందుకు నడవడం?, పక్కన దారి ఉంది కదా! అని సదరు వ్యక్తిదే తప్పని మరికొందరు విమర్శిస్తున్నారు. (కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్) Luckiest man of the month award goes to this man. Chavara, Kollam District,Kerala. pic.twitter.com/dAGnteQpDe — Nisar നിസാർ (@nisarpari) August 22, 2020 -
పాము కాటుతో భార్య మృతి.. భర్త అరెస్ట్
తిరువనంతపురం : కేరళలోని ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పాము కాటుతో చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న సూరజ్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఉత్తర అనే యువతితో వివాహం అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు కొల్లంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య ఆస్తి మీద కన్నేసిన సూరజ్.. గత ఐదు నెలలుగా ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాములు పట్టడంలో నేర్పరి అయిన తన స్నేహితుడు సురేశ్ సాయం కోరాడు. అతని సాయంతో ఫిబ్రవరిలో ఒకసారి ఉత్తరను పాము కాటు వేసేలా చేశాడు. అయితే సరైన సమయంలో చికిత్స అందడంతో ఉత్తర ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే మే తొలి వారంలో మరోసారి ఉత్తరను అంతమొందించాలని సురేశ్ నిర్ణయించుకున్నాడు. సురేశ్ వద్ద నుంచి పామును తీసుకుని.. మే 6వ తేదీ రాత్రి ఉత్తర బెడ్ రూమ్‌లో వదిలాడు. మరుసటి రోజు తెల్లవారేసరికి ఆమె మరణించారు. ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్న సురేశ్.. తనకేం తెలియదనట్టు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టుగా నిర్ధారించారు. అయితే ఉత్తరను రెండుసార్లు పాము కాటు వేయడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె బంధువులు ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భార్య ఆస్తి కోసమే సూరజ్ పథకం ప్రకారం ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు సూరజ్ ఫోన్లో పాములకు సంబంధించిన వీడియోలు చూసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి..!
తిరువనంతపురం: నిండు నూరేళ్లు భార్యతో కాపురం చేయాల్సిన భర్త అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి చంపిన ఘటన కేరళలో జరిగింది. ఉతారా గదిలో ఘటన జరిగిన రోజున తలుపులు, కిటికీలు అన్ని మూసి ఉండటం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పాముకాటుకు గురవ్వడంపై కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చివరకు నిజాన్ని ఒప్పుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతనికి ఉతారాతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాదిన్నర పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొద్ది రోజులుగా కలతలు మొదలయ్యాయి. సూరజ్ భార్యపై వరకట్న వేదింపులకు దిగాడు. ఉతారా కుటుంబం ఆర్థికంగా ఎటువంటి భరోసా ఇచ్చే దారి కపిపించకపోవడంతో తనను హత్యచేసి ఆ నేరాన్ని తనపైకి రాకుండా ఉండాలని ఆలోచించి ఓ పథకం వేశాడు. వెంటనే పథకాన్ని అమలు చేయాలని భావించి తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి రెండు పాములను రూ. 10,000లకు కొన్నాడు. ఉతారా ఓ రోజు గదిలో నిద్రపోతుండగా పామును ఆమెపైకి వదిలగా అది కాటు వేసింది. ఆమె వెంటనే తేరుకొని చుట్టుప్రక్కల వారి సాయంతో ఆసుపత్రికి చేరుకొని ప్రాణాలతో బయటపడింది. చదవండి: రూ.2 వేల కోసం బావమరిదిని హత్య ఆ తర్వాత మరోసారి మే 7న సూరజ్ నిద్రపోతున్న ఉతారాపై మరోసారి పామును వదిలాడు. ఈసారి పాముకాటుకు ఉతారా ప్రాణాలు కోల్పోయింది. సూరజ్ మాత్రం తనకేమీ ఎరగనట్లు పామును చంపి ఇంట్లోనే ఉంటున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానంపై కలిగిన ఉతారా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణలో వ్యవహారం మొత్తం బయటపడింది. చదవండి: గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్.. -
తండ్రిని మోసిన కుమారుడు.. విచారణకు ఆదేశం
కొల్లాం(కేరళ) : ఆరోగ్యం బాగాలేని తండ్రిని, కుమారుడు ఎత్తుకుని కిలోమీటరు మేర నడిచిన ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. కొల్లాం జిల్లాలోని పునలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తన తండ్రి జార్జ్(89)ని తీసుకురావడానికి వెళుతుండగా లాక్డౌన్ కారణంగా పునలూర్‌లో పోలీసులు రోయ్‌మన్(30) ఆటోను అడ్డుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి తన తండ్రిని తీసుకురావాలని మొరపెట్టుకున్నా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఒక కిలోమీటరు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి తన తండ్రిని తీసుకురావడానికి వేరే అవకాశం లేకపోవడంతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకువచ్చాడు. తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్‌మన్‌ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు స్పందించలేదు. పులనూరు సీఐ ముందుగా తనను ఆటో డాక్యుమెంట్లు అడగ్గా అన్ని చూపించానని రోయ్‌మన్ తెలిపారు. అయినా ఆటోను ఆసుపత్రి వరకు అనుమతించలేదన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. ఇక జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనపై రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ మానవ హక్కుల సంఘం తెలిపింది. -
తండ్రిని మోసిన కుమారుడు..
-
అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!
మాఫియా డాన్లను పట్టుకోవడానికి పోలీసు అధికారి నరసింహం విదేశాలకు వెళ్లడం చూశాం. నేరం చేసిన వాడు ఎవడైతే ఏంటి, ఎక్కడ తలదాచుకుంటే ఏమిటి.. చిత్తశుద్ధి ఉంటే వాడి తాట తీయడం తీయొచ్చని అని నరసింహం నిరూపించాడు. అయితే అదంతా సింగం సిరీస్‌లో హీరో సూర్య రీల్ లైఫ్ పెర్ఫామెన్స్. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఓ మహిళా ఆఫీసర్ ఉన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి సౌదీకి పారిపోయిన ఓ మృగాడిని పట్టుకునేందుకు ఆమె తన టీమ్‌తో కలిసి ఎడారి దేశానికి బయల్దేరారు. ఇంటర్‌పోల్ సహాయంతో అతడిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. ఆ లేడీ సింగం పేరు మెరిన్ జోసెఫ్. కేరళలోని కొల్లాం పోలీసు కమిషనర్ ఆమె. అకృత్యానికి బలై ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు ఆమె చేస్తున్న కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. కేసు నేపథ్యం ఇదీ... కేరళలోని కొల్లాంకు చెందిన సునీల్ కుమార్ బంద్రాన్(38) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో టైల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో సెలవుల నిమిత్తం స్వదేశానికి వచ్చినపుడు స్నేహితుడి మేన కోడలిపై అకృత్యానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల బాలిక అనే కనికరం లేకుండా మూడు నెలల పాటు ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారి మిన్నకుండి పోయింది. అయితే ఆ కామాంధుడు సౌదీ వెళ్లిపోయాక జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ పీడకలను మర్చిపోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొల్లాం పోలీస్ చీఫ్ మెరిన్ ఇటీవలే రియాద్‌కు వెళ్లారు. స్థానిక పోలీసుల అదుపులో ఉన్న సునీల్ కుమార్‌ను అరెస్టు చేసి కేరళకు తీసుకువచ్చారు. పోక్సో చట్టం కింద అతడిపై ఉన్న కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఎక్కడా దాక్కున్నా శిక్ష తప్పదు.. ఈ కేసు గురించి జోసెఫ్ మెరిన్ మాట్లాడుతూ..‘ ఇది అత్యంత హేయమైన నేరం. సునీల్ దుశ్చర్య కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మహిళలు, చిన్నారుల పట్ల ఇటువంటి అకృత్యాలు జరిగినపుడు మనసు కకావికలం అవుతుంది. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎంతటి మానసిక క్షోభ అనుభవిస్తారో నాకు తెలుసు. సమాజం కూడా వారిని చూసే తీరు వేరుగా ఉంటుంది. అటువంటి వాళ్లకు న్యాయం చేయడం నా కర్తవ్యం. అందుకే నిందితుడిని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ కేసులో నిందితుడు సౌదీకి పారిపోయాడు. అతడు ఒక్కడే కాదు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న చాలా మంది కేరళ కార్మికులు.. ఇక్కడ నేరాలకు పాల్పడి పారిపోతున్నారు. ఇటువంటి కేసులు ఎంత క్లిష్టతరమైనవో నాకు తెలుసు. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. మా బాస్ ప్రోద్భలంతో కేసులో పురోగతి సాధించాను. రియాద్‌కు వెళ్లి సునీల్ కుమార్‌ను అరెస్టు చేసి కేరళకు తీసుకువచ్చాను. ఇక అతడికి శిక్ష వేయించడమే నా ముందున్న లక్ష్యం. ’ అని చెప్పుకొచ్చారు. సవాళ్లను స్వీకరించాలి.. ‘సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న లింగ వివక్ష వేళ్లూనుకుపోయింది. అయితే ఒక మహిళగా నేనెప్పుడూ రాయితీలు కోరుకోలేదు. ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నిరాశ చెందక సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగాను. ఐపీఎస్ కావాలన్న నా కలను నెరవేర్చుకున్నాను. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను. నిజానికి మహిళా అధికారుల పట్ల కూడా ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. ఒత్తిళ్లను ఎదుర్కొని పని చేయలేరన్న కారణంగా ఫీల్డ్ పోస్టింగులు తక్కువగా ఇస్తుంటారు. అది వాస్తవం కాదు. మహిళలకు పని పట్ల శ్రద్ధ, అంకిత భావం ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అన్ని రంగాల్లో వారు ముందుకు సాగుతున్న తీరును గమనించాలి. పోలీసు శాఖలో మహిళా అధికారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది’ అంటూ కేరళలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పోలీసు కమిషనర్‌గా గుర్తింపు పొందిన మెరీన్(29) అమ్మాయిల్లో స్ఫూర్తి నింపారు. -
విముక్తి పొందావు; హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా!
‘అసలు ఇలాంటి ఒక నోట్ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. ఆధునిక కాలంలో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే సమాజంలో మనం ఉన్నాం. ఎవరైతే అనుమానం, జాలి, ద్వేషం వంటి భావనలు కలిగి ఉంటారో.. దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఏమైనా అన్నా సరే. దాని పట్టించుకునే వాళ్లెవరూ లేరు ఇక్కడ. అవును ఈ పోస్టు మా అమ్మ పెళ్లి గురించి’ అంటూ కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ అనే అబ్బాయి ఫేస్బుక్లో పెట్టిన పోస్టు పలువురిని ఆలోచింపజేస్తుంది. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తార్కాణంగా నిలిచింది. తల్లిదండ్రులు మాత్రమేనా?! దైవభూమిగా పేరుగాంచిన కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్ శ్రీధర్ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి అతడి చిట్టి గుండెకు కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన.. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా స్త్రీని ఒక బొమ్మలా భావించే తండ్రి మూర్ఖత్వానికి.. అమ్మ జీవితం చెరలో చిక్కుకుందే అనే అపరాధ భావన ..గోకుల్‌కు మనశ్శాంతి లేకుండా చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అతడి మానసిక సంఘర్షణకు తెరపడింది. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్ ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేస్బుక్లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి. రక్తం కారుతున్నా లెక్కచేయలేదు.. ‘నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆమె వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు ఆమెతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. అవును ఆమె ఎవరో కాదు మా అమ్మ. నా కోసం తన కలలు త్యాగం చేసిన మాతృమూర్తి. మేము ఇళ్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నీ జీవితం సంతోషంగా గడవాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేగాక నెగటివ్ కామెంట్లు చేసేవారు ఈ పోస్టు చూసి అనవసరంగా సమయం వృథా చేసుకోకండి అని సలహా కూడా ఇచ్చాడు. అయితే అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. -
చితక్కొట్టుకున్న కార్యకర్తలు.. వీడియో వైరల్
తిరువనంతపురం : కేరళలోని కొల్లాంలోని పూయపల్లిలో రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన కేరళలో పోలింగ్ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన ఆదివారం పూయపల్లిలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండాలతోనే ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. -
కేరళలో హృదయవిదారక ఘటన
సాక్షి, కొల్లాం: కేరళలోని కరునాగప్పపల్లిలో హృదయవిదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులకు ఓ కోడలు బలైంది. అడిగినంత కట్నం తీసుకురాలేదనే కోపంతో ఓ మహిళకు అన్నం పెట్టకుండా ఒక సంవత్సరం పాటు వేధించడంతో ఆమె చనిపోయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోయినపుడు 20 కేజీల బరువు మాత్రమే ఉండటం గమనిస్తే ఆమెను భర్త, అత్త ఎంత వేధించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఆమె కొన్నిరోజులుగా నానబెట్టిన బియ్యం, నీళ్లల్లో చక్కెర వేసుకుని ఆహారంగా తీసుకుంటూ బతికిందని, మొదట చూసినపుడు మృతురాలు ఒక ఎముకల గూడులా కనిపించిందని పోలీసులు వెల్లడించారు. వేధింపులకు గురిచేసిన భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. అదనపు కట్నం కోసం వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా తన కూతురిని కట్నం కోసం అల్లుడు వేధించాడని, ఏడాది నుంచి తన కూతుర్ని కూడా కలవనీయలేదని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురికేమైనా హాని తలపెడతాడేమోనని భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. మృతురాలి భర్త చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండేవాడని, వీరికి 2013లో పెళ్లి జరిగిందని, అలాగే వీరికి ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. పెళ్లి సమయంలో కొంత బంగారం, డబ్బులను కట్నంగా కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అదనపు కట్నం కోసమే ఈ విధంగా వేధించి, ఆకలితో అలమటించి చనిపోయేలా చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం విశాఖపట్నం–కొల్లం–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (08515) ప్రత్యేక రైలు నవంబర్ 17, 20, 24, 27, డిసెంబర్ 1, 4, 8, 15, 22, 25, జనవరి 5, 12, 15 తేదీలలో రాత్రి 11.15కు విశాఖపట్నంలో బయలుదేరి రెండోరోజు ఉదయం 7 గంటలకు కొల్లం చేరుతుంది. రైలు నెంబరు (08516) ప్రత్యేక రైలు నవంబర్ 19, 22, 26, 29, డిసెంబర్ 3, 6, 10, 17, 24, 27, జనవరి 7, 14, 17 తేదీలలో ఉదయం 10 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటిరోజు సా. 6.30కు విశాఖ చేరుతుంది. -
రెండు తరాలుగా వారికి కులంలేదు!
‘నమస్తే అండీ.. నా పేరు క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని ఆయన చెప్పగానే.. ప్రజలు ఆయన వైపు అయోమయంగా చూస్తారు. ఏమిటీ వింత పేరు అన్నట్టుగా ఉండే వారి అయోమయం చూపులను చూసి.. క్యాస్ట్‌లెస్ జూనియర్ లోలోపల నవ్వుకుంటారు. కానీ, అత్యంత అరుదైన ఆయన నామం వెనుక పెద్ద కథే ఉంది. ఆయనే కాదు.. ఆయన తోబుట్టువుల పేర్లు విన్నప్పుడు కూడా జనం ఇలాగే విస్తుపోతుంటారు. ఆయన సోదరుడి పేరు క్యాస్ట్‌లెస్ (కులం లేదు). సోదరి పేరు షైన్ క్యాస్ట్‌లెస్. కేరళ రాజధాని కొచ్చి నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణించి.. కొల్లాం జిల్లాలోని పునలూరుకు వెళితే.. అక్కడ ఓ ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌పై ఇలాంటి ఓ అరుదైన పేరు దర్శనమిస్తుంది. ‘కులంలేని ఇల్లు’ అని మలయాళంలో రాసి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద ఫసులుద్దీన్ అలికుంజ్. పుట్టుకతో ముస్లిం. ఆయన సహచరి ఏజ్నెస్ గాబ్రియెల్.. క్రైస్తవ మతస్తురాలు. ఇద్దరూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. ఫసులుద్దీన్ను ఏజ్నెస్ ప్రేమిస్తుందని తెలిసి.. కుటుంబసభ్యులు ఆమెను ‘హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఫసులుద్దీన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి మరీ ఆమెను విడిపించారు. 1973లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒకటయ్యారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా 19 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు ఏ మతాన్ని పాటించలేదు. అయితే, తమ ఆచరణ వల్ల పిల్లలకు ఇబ్బంది ఎదురుకాకూడదని 1992లో వారు తమ కలయికను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించారు. తమ ఆస్తులు వారసత్వంగా తమ పిల్లలకు దక్కడంలో ఇబ్బంది ఎదురుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తాను పదో తరగతిలో ఉన్నట్టు గుర్తుచేసుకుంటారు వారి రెండోకొడుకు క్యాస్ట్‌లెస్ జూనియర్. అయితే, ఆ సమయంలో ఇటు ఫసులుద్దీన్, అటు ఏజ్నెస్ కుటుంబాలు.. వారికి పుట్టబోయే పిల్లలు తమ మతాన్నే అనుసరించాలని ఒత్తిడి తెచ్చారు. వారి పిల్లలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫసులుద్దీన్కానీ, ఏజ్నెస్కానీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ‘మా తల్లిదండ్రులిద్దరూ హేతువాదులు. వారు లౌకికవాదాన్ని ఆచరించేవారు. తమ కుటుంబసభ్యుల ఒత్తిడిని లెక్కచేయక వారు జీవనాన్ని సాగించారు’ అని అంటారు క్యాస్ట్‌లెస్ జూనియర్. సహజంగా తండ్రి మతమే పుట్టబోయే పిల్లలకు వస్తుందనే చాలామంది నమ్ముతారు. ‘కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. 1974లో మా అన్నయ్య పుట్టినప్పుడు.. అమ్మనాన్నలు అతనికి ‘క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు’ అని నవ్వుతారు క్యాస్ట్‌లెస్ జూనియర్. ఆ తర్వాత 1975లో తమకు పుట్టిన రెండో బాబుకు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని, 1983లో పుట్టిన చిన్నకూతురికి ‘షైన్ క్యాస్ట్‌లెస్’ అని నామకరణం చేశారు ఫసులుద్దీన్ దంపతులు. కులాన్ని, మతాన్ని అనుసరించకపోవడం వల్ల తమ పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోలేదని, స్కూల్ రికార్డ్స్ల్లోగానీ, ఇతర ప్రతాల్లోగానీ కులం, మతం అని ఉన్న చోట ‘నిల్’ అని రాసేవారని ఫసులుద్దీన్ గుర్తుచేసుకుంటారు. కాన్వెంట్ స్కూల్వాళ్లు తమ ఇంటికి వచ్చి పిల్లలు పేర్లు మార్చాలని అడిగేవారని, కానీ 18 ఏళ్లు వచ్చిన తర్వాత తమ పేర్లపై పిల్లలే నిర్ణయం తీసుకుంటారని స్కూల్వాళ్లకు చెప్పి పంపేవాళ్లమని ఆయన చెప్తారు. క్యాస్ట్‌లెస్, క్యాస్ట్‌లెస్ జూనియర్, షైన్ క్యాస్ట్లెస్లకు పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎవరూ మతపరమైన ఆచారాలు పాటించలేదు. కట్నంగానీ, పూజారిగానీ లేకుండా కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారు తమ వివాహాలను రిజిస్టర్ చేయించుకున్నారు. ‘పెళ్లికి చాలాముందే మా భాగస్వాములకు మా దృక్పథం ఏమిటో చెప్పాం. వాళ్లు అంగీకరించారు’ అంటారు క్యాస్ట్‌లెస్. మీ పిల్లలకు పెళ్లిళ్లు కావని, వారికి మంచి సంబంధాలు రావని ఫసులుద్దీన్, ఏజ్నెస్ను వాళ్ల కుటుంబాలు బెదిరించేవి. ఆ బెదిరింపులు ఉత్తవేనని వీరి పెళ్లిళ్లు నిరూపించాయి. సమాజం కూడా తమ కుటుంబ జీవనవిధానాన్ని అంగీకరించిందని క్యాస్ట్‌లెస్ అంటారు. కులం నేపథ్యం చూడకుండా ఒక్క ఓటు కూడా వేయని మన సమాజంలో పునలూరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను గెలుపొంది.. 2005-10 మధ్యకాలంలో వైస్ చైర్మన్‌గా సేవలు అందించానని ఆయన గుర్తుచేసుకుంటారు. క్యాస్ట్‌లెస్ ఆయన తోబుట్టువులు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంబీఏ చేసిన క్యాస్ట్‌లెస్ భార్య పేరు సబిత, దుబాయ్‌లో నివాసముంటారు. వీరు తమ పిల్లలకు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్’, ‘ఇండియన్ క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు. న్యాయవాది అయిన క్యాస్ట్‌లెస్ జూనియర్.. పునలూరు బార్ అసోసియేషన్ సభ్యుడు. హిందు మహిళ అయిన రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ‘అగ్నా క్యాస్ట్‌లెస్ జూనియర్’, ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని పేరు పెట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పీహెచ్డీ చేస్తున్న షైన్ క్యాస్ట్‌లెస్ వ్యాపారవేత్త చెగువరెను పెళ్లాడారు. వీరికి అలైదా చెగువరె అనే కూతురు ఉంది. క్యాస్ట్‌లెస్ అనే పేరును కొనసాగించడం అన్నది తమ వ్యక్తిగత అభీష్టమని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని ఫసులుద్దీన్ కుటుంబం అంటుంది. అయినా, మీరు చనిపోతే.. మీ మృతదేహాలను ఖననం చేస్తారా? లేక పూడ్చిపెడతారా? అంటూ బంధువులు కొత్త కొత్త సందేహాలతో తమ వద్దకు వస్తారని, తమ మృతదేహాలను సైంటిఫిక్ కమ్యూనిటీకి అందజేసి.. వారికి ఉపయోగిపడితే చాలు అని తాము భావిస్తున్నామని, ఇది అప్పుడు బతికి ఉన్న కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకుంటారని క్యాస్ట్‌లెస్ జూనియర్ ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అన్నారు. కులానికి అతీతంగా సమాజంలో హుందాగా బతకగలమని చాటిన ‘క్యాస్ట్‌లెస్’ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.. కాదంటారా? ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో పంచుకోండి. -
నిన్నటిదాకా బికారి.. నేడు లక్షాధికారి
సాక్షి, తిరువనంతపురం : అదృష్టం అంటే ఆ టీ కొట్టు ఓనర్‌దే. నిన్నమొన్నటిదాకా అతనో నిరుపేద. హఠాత్తుగా భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలింది.. ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. కేరళలోని పారాయిలముక్కులో బాబు (48) టీ కొట్టు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు పదేళ్లుగా అతనికి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటుంది. ఈ క్రమంలోనే అతను కేరళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే శ్రీశక్తి లాటరీని కొనుగోలు చేశారు. బాబు కొనుగోలు చేసిన లాటరీకే బంపర్ ప్రైజ్ రూ. 60 లక్షలు తగిలింది. లాటరీ తగిలిన విషయం తెలిసి ఒక్కసారిగా నన్ను నేను నమ్మలేకపోయానని బాబు చెప్పారు. బాబు కొన్న టిక్కెట్‌కు బంపర్ ప్రైజ్ 60 లక్షలు తగలడంతో పాటు.. కన్సొలేషన్ ప్రైజ్ కింద మరో 30 వేలు వచ్చాయి. లాటరీ తగిలిన విషయం తెలిసాక రెండు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నానని.. తరువాత ప్రభుత్వం ఇచ్చిన్ చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేశాక.. మళ్లీ బయటకు వచ్చానని బాబు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఒక్కడినే స్వేచ్ఛగా తిరిగిన నాకు.. ఇప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి
కొల్లాం : కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సమీపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్రిడ్జిపై సుమారు 80మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జిపై స్థానికులు రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా స్థానికులు వాకింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోగా, మరికొంతమంది ఇనుపరాడ్ల మధ్య చిక్కుకుపోయారు. ఈత వచ్చినవారు నదిలో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరోవైపు స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి తుప్పు పట్టిందని, మరమ్మత్తులు చేయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు కేఎంఎంఎల్ ఉద్యోగిని శ్యామల (55)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
శబరిమలలో ఆగిన పనులు
కొల్లాం: ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలతో శబరిమలలో పనులను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉన్న అయ్యప్ప దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా శబరిమల ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా క్యూలైన్, దర్శనానంతరం కిందకు దిగేదారి వంటి పనులతో పాటు కొండమీద మరిన్నిపనులను సత్వరమే పూర్తి చేయాలని దేవస్థానం బోర్డు భావిస్తోంది. అవినీతి పరులైన కొందరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ కాంట్రాక్టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టర్లు కొల్లాం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు పనులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబమరిమల, కొల్లాం -
ఆ సిటీలోనే అత్యధిక నేర ఘటనలు
క్రైమ్ అనగానే మొదట గుర్తుకొచ్చే సిటీ ఢిల్లీ. కానీ 2015లో ఢిల్లీ తన క్రైమ్ రేటును తగ్గించుకుందట. అయితే దక్షిణ కేరళలోని ప్రముఖ నగరం కొల్లామ్ సిటీ అత్యధిక నేర ఘటనలు నమోదుచేసి క్రైమ్ క్యాపిటల్‌గా 2015లో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేరళ సిటీలో క్రైమ్ రేటు 1194.3 గా నమోదైంది. దాని తర్వాత ఢిల్లీలో 1066.2, ముంబాయిలో 233.2, కోల్‌కత్తాలో 170 క్రైమ్ రేటు రికార్డు అయినట్టు తాజా డేటా వెల్లడించింది. 13,257 నేరాలతో కొల్లామ్, ఇండియాలోనే 2 శాతం క్రైమ్స్‌ను నమోదుచేసిందని తెలిపింది. మహిళలపై జరుగుతున్న దాడులు కొల్లామ్ నగరంలో 172 ఘటనలు నమోదయ్యాయని, మహిళలపై లైంగిక వేధింపులు 172 కేసులు, భర్త, కుటుంబసభ్యుల చేస్తున్న చిత్రహింసలు 221 కేసులు రికార్డైనట్టు ఈ గణాంకాలు తెలిపాయి. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన నగరాలుగా యాహు ప్రకటించే జాబితాలో కొల్లామ్ టాప్ 20లో ఒకటిగా ఉంటోంది. అల్లర్లు కూడా ఈ సిటీలోనే ఎక్కువగా జరుగుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. రాజకీయ అల్లర్లు, విద్యార్థుల ఘర్షణలలో కేరళనే ప్రథమస్థానంలో నిలుస్తుందని ఎన్సీఆర్బీ డేటా పేర్కొంది. అయితే కులానికి సంబంధించిన ఘర్షణల్లో ఇతర నగరాలతో పోలిస్తే కొల్లామ్‌లో ఎలాంటి కేసులు రికార్డు కానున్నట్టు నివేదిక వెల్లడించింది. -
114కు చేరిన కొల్లాం మృతుల సంఖ్య
కొల్లాం (కేరళ) : పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదంలో మృతుల సంఖ్య 114కు చేరుకుంది. కాళికాదేవి ఆలయంలో వేడుకల్లో భాగంగా పేల్చిన బాణాసంచా వల్ల అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 106మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. దాదాపు 400ల మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా మారుతోంది. గురువారం మరో బాధితుడు మృతి చెందాడు. మరో ఆరుగురు క్షతగాత్రుల పరిస్థితి ప్రమాదం అంచున ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం ఏళ్లుగా వస్తోన్ ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. -
ఏపీలోని ఆలయాల్లో బాణాసంచాపై నిషేధం
హైదరాబాద్: కొల్లాం ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి అన్ని రాష్ట్రాలూ పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా వినియోగాన్ని నిషేధించింది. ఇక నుంచి ఏ గుడిలో ఎలాంటి ఉత్సవం జరిపినా ఆ సందర్భంగా పటాకులు పేల్చే కార్యక్రమాన్న చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులను ఆదేశిచింది. ఒకవేళ ఏదైనా ఉత్సవంలో బాణాసంచా ఉపయోగించడం తప్పనిసరి ఆచారమైతే, అలాంటి సందర్భంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సర్కారు సూచించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల కిత్రం కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగల్ అమ్మవారి ఆలయ ఉత్సవంలో బాణా సంచా పేల్చుతూ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని వంద మందిపైగా మృతి చెందడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల్లో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏడాదికి రూ. 25 వేలకు పైబడి ఆదాయం ఉండే ఆలయంలో అగ్ని ప్రమాద నివారణకు స్థానిక ఆలయ అధికారులు జిల్లా ఫైర్ ఆఫీసర్ సూచనల అమలు చేయాలని ఆదేశించారు. అన్నదాన, ప్రసాద పాకశాల వద్ద పందిళ్ల ఏర్పాటుపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. రథోత్సవం, దీపోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా చేశారు. టీటీడీ పరిధిలో సైతం అగ్నిప్రమాదాల నివారణ విషయంలో అక్కడి ఈవో ప్రస్తుత పరిస్థితులపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
నిబంధనల ఉల్లంఘనతో పేలుడు
కేరళ ఆలయంలో విషాదంపై విచారణ ఆరుగురిపై హత్యాయత్నం కేసు ♦ 109కి చేరిన మృతుల సంఖ్య ♦ పరారీలోనే పుట్టింగల్ ఆలయ కమిటీ అధికారులు ♦ పటాసుల పోటీపై నిషేధం విధించాలని హైకోర్టు జడ్జి లేఖ ♦ నిషేధాన్ని అంగీకరించబోమని చెప్పిన ట్రావెన్కోర్ బోర్డు కొల్లాం: పేలుడు పదార్థాలపై నిబంధనల ఉల్లంఘన, నిషేధిత రసాయనాల వాడకం వల్లనే కేరళలోని పుట్టింగల్ ఆలయంలో విషాదం జరిగిందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన పేలుడు పదార్థాల నియంత్రణ ఉన్నతాధికార బృందం సోమవారం ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఆలయ అధికారులతోపాటు ఆరుమందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. సోమవారం మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 109కి పెరిగింది. 300 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కొల్లాం జిల్లాలోని పరువూర్‌లో వందేళ్ల నాటి పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలిన సంగతి తెలిసిందే. ఆలయాన్ని సోమవారం కూడా మూసే ఉంచారు. సంప్రదాయబద్ధమైన పూజాధికాలూ జరగలేదు. హత్యాయత్నం అభియోగాలు ఆలయ కమిటీకి చెందిన అధికారులతోపాటు ఆరుమందిపై ఐపీసీలోని పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 307 (హత్యాయత్నం), 308 (ఉద్దేశపూర్వకంకాని హత్యాయత్నం) కింద పోలీసులు కేసు నమోదుచేశారు. బాణసంచా ప్రదర్శనపై జిల్లా కలెక్టర్ నిషేధం విధించినప్పటికీ, దాన్ని తోసిరాజని పోటీని నిర్వహించినందుకు కాంట్రాక్టర్ల సహాయకులపైనా అభియోగాలు నమోదుచేశారు. ప్రమాదం తర్వాత పారిపోయిన ఆలయ కమిటీలోని 15 మంది సభ్యులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన పేలుడు పదార్థాల చీఫ్ కంట్రోలర్ సుదర్శన్ కమల్ ఆలయాన్ని సందర్శించి ఆధారాలను సేకరించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిబంధనల ఉల్లంఘన వల్లనే ప్రమాదం సంభవించిందన్నారు. ‘తయారీదారులు బాణసంచాలో నిషేధిత రసాయనాలు వాడారు. వాటితో ప్రదర్శన నిర్వహించారు’ అని ఆయన చెప్పారు. బాణాసంచా అనుమతి అంశంతోపాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతామని క్రైమ్‌బ్రాంచ్ ఇంచార్జి ఎస్.అనంతక్రిష్ణన్ చెప్పారు. అట్టింగల్ దగ్గర్లోని గోడౌన్ నుంచి పోలీసులు 100 కిలోల పేలుడు పదార్థాల సామగ్రిని సీజ్ చేశారు. పటాసుల ముడిపదార్థాలున్న రెండు కార్లనూ స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు షాక్‌లోనే... ఈ ప్రమాద షాక్ నుంచి స్థానికులు తేరుకోలేదు. మృతులకు భార హృదయంతో కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రి(టీఎంసీహెచ్)తోపాటు క్షతగాత్రులున్న ఇతర ఆస్పత్రులు ఇంకా భీతావహంగానే ఉన్నాయి. బంధువులు, సన్నిహితులు తమ వారి మృతదేహాల కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అనుమతి ఇవ్వలేదు: కొల్లాం కలెక్టర్ ఆలయంలో బాణసంచా పోటీకి తాను అనుమతి ఇవ్వలేదని కొల్లాం జిల్లా కలెక్టర్ ఎ.షైనమోల్ స్పష్టంచేశారు. ‘తొలుత అనుమతి నిరాకరించాలని పోలీసులు నాకు నివేదించారు. తర్వాత ఈనెల 9న వారు వైఖరి మార్చుకున్నారన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించాన’న్నారు. బాణసంచాపై నిషేధాన్ని ఒప్పుకోం: ట్రావెన్కోర్ బోర్డు పుట్టింగల్ విషాదం నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతుండగా, నిషేధాన్ని అంగీకరించబోమని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) పేర్కొంది. గుళ్ల ఉత్సవాల్లో బాణసంచా ప్రదర్శనలు భాగమని, అందువల్ల బాణసంచా పోటీలపై నిషేధానికి తాము వ్యతిరేకమని టీడీబీ అధ్యక్షుడు గోపాలక్రిష్ణన్ స్పష్టంచేశారు. ప్రభుత్వ, కోర్టు ఆంక్షల మేరకు సురక్షిత చర్యలు చేపట్టి బాణసంచా పోటీలకు అనుమతి ఇవ్వాలన్నారు. నిబంధనల మేరకే పటాసుల ప్రదర్శన నిర్వహించాలని తన పర్యవేక్షణలోని 1,255 ఆలయాలకు టీడీబీ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. కాగా, అన్ని ఆలయాల్లో భారీ పేలుడు పదార్థాల వాడకంపై తక్షణమే నిషేధం విధించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ వి.చిత్రాంబరేశ్ కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించవచ్చన్నారు. ఆలయాల వ్యవహారాలను చూసే హైకోర్టు దేవస్థానం బెంచ్ దీన్ని మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. -
పెను విషాదాన్ని ఆమె ముందే ఊహించింది
ఒక్క కొల్లాంలోనేకాదు ప్రపంచం నలుమూలలా మత కార్యక్రమంలోనో చోటుచేసుకునే విషాదాల్లో ప్రాణాలు కోల్పోయేది అమాయక భక్తులే! బీదసాదలే! అమ్మవారికి దండం పెట్టుకునేందుకు ఆలయాలకు వచ్చే అలాంటి భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, సంప్రదాయం పేరుతో విషాదాలు సృష్టించొద్దని నాలుగేళ్లుగా నినదిస్తోంది.. కొల్లాంకు చెందిన వృద్ధురాలు పంకజాక్షి. పుట్టింగళ్ ఆలయంలో పెను విషాదం జరుగుతుందని ముందే ఊహించిందామె. ఆ విషాదాన్ని అడ్డుకునేందుకు నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనేఉంది. కానీ ఫలితంరాలేదు. 'ఏదో ఒకరోజు ఇలా జురుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆ పేలుళ్ల తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు' అని అంటోంది పంకజాక్షి. కొల్లాంలో ఆ ఆలయానికి పక్కనే ఆమె ఇల్లుంటుంది. బాణాసంచ ఆచారం ఇప్పటిది కాకపోయినప్పటికీ మధ్య పేలుళ్ల తీవ్రత ఎక్కువైపోయిందని వాపోతున్నారామె. ఆలయంలో బాణాసంచా పేలినప్పుడల్లా పంకజాక్షి వాళ్ల ఇల్లు కంపిస్తుంది. ఆ వేడుక జరిగినంతసేపు వాళ్ల కుటుంబం ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని కూర్చుంటారు. పేలుళ్ల తీవ్రతకు ఇంటి పై కప్పు పెచ్చులు ఊడటం, సామాన్లన్ని చెల్లాచెదురుగా పడిపోవటం పరిపాటేనట. ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కొల్లాం జిల్లా కలెక్టర్ ను సైతం పలుమార్లు కలిసి వినతి పత్రం ఇచ్చింది. అలా నాలుగేళ్ల నుంచి అధికారులకు వినతులు చేసిచేసి విసుగెత్తింది. ఈ ఏడాది కూడా వేడుక ప్రారంభంకావటానికి ముందు కలెక్టర్ ను కలిసొచ్చింది. 'ఆచారవ్యవహారాలకు నేను వ్యతిరేకం కాదు. అమాయకుల ప్రాణాల గురించే పాకులాట. భారీ పేలుడు పదార్థాలను వినియోగించడం ఎప్పటికైనా ప్రమాదమేనని నేను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆదివారం నాటి విషాదంలో మా ఇల్లు కూడా ధ్వంసమైంది. ఎవరో బాంబులు వేసినట్లు కుప్పకూలిపోయింది. ఇకనైనా ఆలయంలో బాణాసంచ కాల్చడం ఆపేయాలన్నదే నా మనవి' అని విజ్ఞప్తి చేస్తోంది పంకజాక్షి. కొల్లాంలోని పుట్టింగళ్ ఆలయంలో వార్షిక ఉత్సవాల్లో భాగంగా పటాకులు పేల్చే కార్యక్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 108 మంది మరణించారు. మరో 400 మంది క్షతగాత్రులయిన సంగతి తెలిసిందే. -
కొల్లాంలో మళ్లీ కలకలం
కొల్లాం: పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి కోలుకోకముందే కొల్లాంలో మళ్లీ కలకలం చెలరేగింది. బాణాసంచా పేలి 106 మంది ప్రాణాలు కోల్పోయిన కాళికాదేవి ఆలయానికి అతి సమీపంలో మూడు గుర్తుతెలియని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా భారీగా పేలుడు పదార్థాలు నింపిఉండటంతో అధికారులతోపాటు ప్రజల్లోనూ కలవరం మొదలైంది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్థాల ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాటిని ఆలయంలో జరిగే వేడుకల కోసం తెచ్చారా? లేక సంఘవిద్రోహుల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొల్లాంకు వచ్చినప్పుడు కూడా ఆ కార్లు అక్కడే ఉన్నాయా? లేక ఆ తరువాత తీసుకొచ్చి నిలిపారా అనే విషయాలు కూడా ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కార్లలోని పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వెలికి తీసేప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా కాల్చే వేడుకలో చెలరేగిన భారీ పేలుడు కారణంగా 106 మంది మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 400 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు సమయంలో ఆలయంలో 15 వేల మంది భక్తులు ఉన్నారు. ఇదిలా ఉంటే కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై రేపు(మంగళవారం) కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం ఏళ్లుగా వస్తోన్ ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల రాజకీయాలకు 107మంది బలి
కొల్లామ్: కేరళలోని పుట్టింగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన బాణసంచా పేలుళ్లలో 107 మంది మరణించడానికి, 308 మంది గాయపడడానికి బాధ్యులెవరు? కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆదేశించిన న్యాయవిచారణగానీ, క్రైమ్‌బ్రాంచి దర్యాప్తుగాని మూల కారణాలను శోధించి బాధ్యులను వెతికి పట్టుకుంటుందా? ప్రజల ప్రాణాలను బుగ్గిపాలు చేసిన ప్రాధమిక ఉల్లంఘనలకు అసలు కారకులెవరో గుర్తిస్తుందా? ఆలయంలో బాణాసంచా పేల్చడానికి వీల్లేదంటూ జిల్లా కలెక్టర్ నుంచి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వరకు ప్రతి స్థాయిలో అనుమతి నిరాకరించినప్పటికీ, ఆలయాన్ని ఆనుకొని ఉన్న 11 ఇళ్ల నివాసితుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బాణసంచా పేల్చడానికి వీల్లేదంటూ స్థానిక తహసిల్దార్ ఆదేశించినా ఎలా బాణసంచాను పేల్చారు. గతంలో పేలుళ్ల వల్ల తన ఇల్లు కాలిపోయిందని, ఈ సారి పేలుళ్లను నిలిపి వేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఆమెను బెదిరించింది ఎవరు? ఇంతమంది అనుమతి నిరాకరించిన బాణసంచా పేలుళ్లను స్థానిక పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? సంప్రదాయం ప్రకారం ఆలయంలో బాణసంచాను పేల్చాల్సిందేనంటూ ఆలయ నిర్వాహకులపై ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక హిందూ సంఘాలు, రాజకీయ నాయకులే ఇందుకు కారణమని తెల్సింది. జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లు ఇద్దరూ ముస్లింలు. అందుకే వారు హిందూ సంప్రదాయాన్ని అడ్డుకుంటున్నారని స్థానిక రాజకీయ నాయకులు వారిని బెదిరించారట. ఎన్నికళ వేళ తమ సంప్రదాయాన్ని అడ్డుకోకూడదంటూ స్థానిక పోలీసులను కూడా వారు హెచ్చరించారట. ఈ కారణంగానే తాము జోక్యం చేసుకోలేకపోయామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పైగా రాత్రి 10 గంటల తర్వాత బాణసంచాను పేల్చరాదంటూ జనరల్ నిబంధనలు అమల్లో ఉన్నా పట్టించుకోకుండా అన్యాయంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న స్థానిక రాజకీయ నాయకులకు శిక్ష విధిస్తారా? -
'గుడి' మంటలు
కేరళలోని పుట్టింగల్ ఆలయంలో పెను విషాదం బాణసంచా వేడుకల్లో చెలరేగిన మంటలు.. 106 మంది మృత్యువాత 383 మందికి తీవ్ర గాయాలు పలువురి పరిస్థితి విషమం ♦ కాళికాదేవి ఉత్సవాలకు తరలివచ్చిన 15 వేల మంది భక్తులు ♦ నింగిలో పేలాల్సిన ఓ టపాసు భూమిపై పేలడంతో ప్రమాదానికి బీజం ♦ పక్కనే బాణసంచా నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలో పడ్డ నిప్పురవ్వలు ♦ పేలుళ్లతో దద్దరిల్లి కుప్పకూలిన భవనం.. చెలరేగిన మంటలు.. తొక్కిసలాట ♦ కిలోమీటరు వరకు వినిపించిన పేలుళ్లు.. 10 మీటర్లు ఎగిరిపడ్డ సిమెంట్ దిమ్మలు ♦ కరెంట్ పోవడంతో చిమ్మచీకటి.. గందరగోళంతో జనం పరుగులు ♦ కాలిన దేహాలు, తెగిపడిన అవయవాలతో భీతావహంగా ఆలయ ప్రాంగణం ♦ ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి అది కేరళలోని పుట్టింగల్ ఆలయం.. సమయం.. ఆదివారం వేకువజామున 3.30 గం. కాళికాదేవి ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చారు.. ఉత్సవాల చివరి రోజు కావడంతో ఎప్పట్లాగే బాణసంచా వేడుకలు మొదలయ్యాయి.. టపాసుల వెలుగులతో ఆ ప్రాంతమంతా కళ్లు మిరుమిట్లుగొలుపుతోంది.. మరికొద్దిసేపట్లో వేడుక ముగుస్తుందనగా ఓ భారీ టపాసును అంటించారు.. నింగికి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలాల్సిన ఆ టపాసు నేలపైనే ఢాం అంది! పక్కనే ఓ రెండంతస్తుల భవనంలో నిల్వ చేసిన అలాంటి టపాసులపై నిప్పురవ్వలు పడ్డాయి. ఇంకేముంది.. చెవులు చిల్లులుపడే శబ్దంతో అవన్నీ వరుసగా పేలిపోయాయి.. మంటలు చెలరేగాయి.. పేలుళ్ల ధాటికి భూమి కంపించిపోయింది.. రెండంతస్తుల భవనం కుప్పకూలింది.. కిలోమీటరు మేర పేలుడు శబ్దాలు వినిపించాయి.. ఇంతలో కరెంట్ పోయింది.. ఏం జరుగుతుందో తెలియని జనం చీకట్లోనే దారీతెన్నూ లేకుండా పరుగులు పెట్టారు.. మంటల్లో కొందరు.. తొక్కిసలాటలో మరికొందరు.. భవనం కింద ఇంకొందరు.. ఇలా కొద్దిసేపటికే ఆలయ ప్రాంగణం మరుభూమిలా మారింది! 106 మంది మృత్యువాత పడ్డారు!! 383 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. దేవభూమిగా పేరొందిన కేరళలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘోరకలి దేశాన్ని కలచివేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తదితరులు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొల్లాం/న్యూఢిల్లీ: ప్రకృతి అందాలకు ఆలవాలమైన కేరళను గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు. అంటే దేవభూమి అని అర్థం! కానీ పుట్టింగల్ దుర్ఘటనతో ఆ దేవభూమి మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన పుట్టింగల్ ఆలయం కొల్లాం జిల్లా పరువూర్‌లో ఉంది. ఇక్కడ ఏటా 7 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు పెద్దఎత్తున బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని వేడుకలా కాకుండా ఓ పోటీలా నిర్వహిస్తారు. జనం రెండు పక్షాలుగా విడిపోయి పోటాపోటీగా టపాసులు కాలుస్తారు. ఏ వర్గం ఎంత ఘనంగా టపాసులు కాల్చిందో నిర్ణయించేందుకు న్యాయనిర్ణేతలు కూడా ఉంటారు. దీనిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోటీకి జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. శనివారం సాయంత్రం వరకు పోటీ జరుగుతుందా లేదా అన్న విషయంలో సందిగ్దం నెలకొంది. చివరికి.. ‘పోటీ లేదు కానీ టపాసులు కాల్చుకోవచ్చు..’ అంటూ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఉన్నతాధికారులు ‘మౌఖికంగా’ అనుమతించారని స్థానిక పోలీసులకు చెప్పడంతో వారూ అడ్డుపడలేదు. దీంతో శనివారం రాత్రి 11 గంటలకు బాణసంచా పేలుళ్లు మొదలయ్యాయి. ఊహకందని విషాదం: ప్రధాని ‘‘ఇది ఊహకందని విషాదం. ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తాం. దీనిపై మాట్లాడేందుకు నాకు మాటలు రావడం లేదు. చాలామంది చనిపోయారు. కొందరి తలలు తెగిపోయాయి. ఎందరో చావుబతుకుల్లో ఉన్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన పుట్టింగల్ దేవి ఆలయానికి వెళ్లి ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం చాందీతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర చికిత్స కోసం ఎవరినైనా ముంబై, ఢిల్లీ, ఇతర నగరాలకు తరలించాల్సి వస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని సీఎంకు చెప్పారు. తర్వాత కొల్లాం వెళ్లిన మోదీ.. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రమాదం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకొని మోదీతోకాకుండా విడిగా వెళ్లి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది: రాహుల్ ప్రమాదం గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. తర్వాత కొల్లాం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ‘‘ఇది రాష్ట్రంతోపాటు దేశానికి కూడా తీరని విషాదం. ప్రమాదం జరగ్గానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ఇక్కడేం జరిగిందో తెలుసుకునేందుకే వచ్చా. పార్లమెంట్, కేంద్రం స్థాయిలో ఏ అంశమైనా లేవనెత్తాల్సి వస్తే పార్టీ పరంగా అందుకు తగినట్టుగా స్పందిస్తాం’’ అని ఆయన వివరించారు. పుట్టింగల్ ఆలయ చరిత్ర కొల్లాం: పుట్టింగల్ దేవీ ఆలయం... కొల్లాం జిల్లా పరావుర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం... చీమల కొండపై(పుట్టు) అమ్మవారు కనిపించడంతో ఆ ప్రాంతంలో గుడిని నిర్మించారు. అదే పుట్టింగల్ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ప్రతి రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మలయాళం క్యాలెండర్ ప్రకారం మీనం(మార్చి-ఏప్రిల్) నెలలో భరణి నక్షత్రం రోజున భారీ ఎత్తున ఉత్సవం చేస్తారు. అలాగే అశ్వత్తి విలక్కు, కథాకళి, కంపడికలి, మారమెడుప్పు వంటి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. మహిళల వేషధారణలో పురుషులు దీపారాధన చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ. దీపారాధన అనంతరం బాణాసంచా(మత్సర కంబం) కాలుస్తారు. పవిత్ర స్థలాల్లో ప్రమాదాలు తిరువనంతపురం: కేరళలోని కొల్లాంలో పుట్టింగల్ అమ్మవారి దేవాలయంలో జరిగిన ప్రమాదం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ కేరళ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగటం ఇదేం కొత్తకాదు. కేరళలో దేవాలయాలు,చర్చిల్లో బాణసంచా కాల్చటం కారణంగా జరిగిన ప్రమాదాలూ చాలానే ఉన్నాయి. 1989లో కాందశం కడవు చర్చిలో జరిగిన ప్రమాదంలో 12 మంది, ఇదే చర్చిలో 1984లో జరిగిన బాణసంచా ప్రమాదంలో 20 మంది చనిపోయారు. 1952లో శబరిమలలోనూ బాణసంచా పేలుడుతో 68 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. దీనికి తోడు దేశంలోని అనేక పవిత్ర స్థలాల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో వందల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గత పుష్కరకాలంగా జరిగిన ప్రమాదాలను ఓసారి గమనిస్తే.. ఆగస్టు 27, 2003 నాసిక్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోగా.. 125 మంది గాయపడ్డారు. జనవరి 25, 2005 మహారాష్ట్రలోని మంధ్రాదేవీ గుడిలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు చనిపోయారు. ఆగస్టు 3, 2008 హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవీ ఆలయంలో కొండచరియలు విరిగిపడ్డాయన్న పుకార్లతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతిచెందారు. ఆగస్టు 10, 2008 రాజస్థాన్‌లోకి కోటాలో పురాతన శంకరుడి ఆలయం మెట్లు కూలి ఇద్దరు భక్తులు మరణించారు. సెప్టెంబర్ 30,2008 జోధ్‌పూర్‌లోని మెహ్రంగఢ్ కోటలోని చాముండాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 220 మంది భక్తులు ప్రాణాలు కొల్పోయారు. జనవరి 14, 2011 కేరళలోని పులిమేడు (శబరిమల) వద్ద ఓ జీపు అదుపుతప్పటంతో దీన్ని తప్పించుకునేందుకు జరిగిన తొక్కిసలాటలో 100 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. జూలై 14, 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మంది మృతి విధ్వంసం సృష్టించిన ఆ ఒక్కటీ... అమ్మవారి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతోపాటు బాణసంచా వేడుకల తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దాదాపు 15 వేల మంది దాకా వచ్చినట్టు తెలుస్తోంది. టపాసులు మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. ఇంతలో రాకెట్ మాదిరి నింగిలోకి దూసుకెళ్లి పెద్దశబ్దంతో పేలిపోయే ‘అమిట్టు’ అనే టపాసు వెలిగించారు. ఈ టపాసే పెను విధ్వంసానికి కారణమైంది. నిప్పంటించగానే ఆకాశంలోకి వెళ్లాల్సిన అమిట్టు నేలపైనే పేలిపోయింది. నిప్పు రవ్వలు మరిన్ని అమిట్టులపై పడడంతో అవన్నీ పేలాయి. ఇదే సమయంలో పక్కనే బాణసంచాను నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలోని టపాసులు పేలడం మొదలైంది. పెద్దపెద్ద శబ్దాలతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పేలుళ్ల ధాటికి భవనం కుప్పకూలింది. భవనంలోని సిమెంట్ దిమ్మెలు సైతం పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ భీతావహ పరిస్థితికి తోడు కరెంటు కూడా పోవడంతో జనం చీకట్లో పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మంటలు ఆలయం వరకు వ్యాపించడంతో గుడికి చెందిన కార్యాలయ భవనం కూడా దెబ్బతింది. మొత్తమ్మీద పేలుళ్ల దెబ్బకు చుట్టుపక్కల ఉన్న ఏడు భవనాలు ధ్వంసమయ్యాయి. భీతావహం.. హృదయ విదారకం అటు మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచినవారి దేహాలు.. ఇటు తెగిపడిన శరీర అవయవాలతో ఆలయ ప్రాంగణం భీతావహంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, కాలిన గాయాలతో బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి హృదయ విదారకంగా మారింది. ‘‘నేను మా ఇంటిపై నుంచి వేడుక చూస్తున్నా. ఇంతలో పెను పేలుడు సంభవించింది. కరెంటు పోవడంతో గందరగోళం నెలకొంది. వెంటనే అక్కడికెళ్లి చూసే సవరికి 10-15 మంది చనిపోయి పడి ఉన్నారు’’ అని లాలు అనే ఓ జర్నలిస్టు తెలిపారు. ‘‘ప్రమాదం తర్వాత వెంటనే అక్కడికి వెళ్లా. ఎటు చూసినా కాలిపోయిన.. పడిపోయిన శవాలే కనిపించాయి. కొందరు మంటల్లో చిక్కుకొని పరుగులు పెడుతున్నారు. కొందరైతే గుర్తుపట్టేందుకు కూడా వీల్లేకుండా కాలిపోయారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నా’’ అని విజయన్ అనే ప్రత్యక్షసాక్షి చెప్పారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు జాప్యమయ్యాయని, క్షతగాత్రులను తరలిచేందుకు వాహనాలు ఆలస్యంగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వేడుకలను చూసేందుకు జనం గుమిగూడిన భవనం కూలిపోవడంతో శిథిలాల కింద నలిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ‘‘మా ఇల్లు ఆలయానికి దగ్గరే ఉంటుంది. టపాసులతో ఏటా మాకు ఏదో ఒక నష్టం వాటిల్లడంతో దీన్ని ఆపాలంటూ నేనే అధికారులను ఆశ్రయించా. వారు అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించారు. ఈ ప్రమాదంలో మా ఇల్లు చాలా వరకు దెబ్బతింది’’ అని 73 ఏళ్ల పంజాక్షియమ్మ చెప్పారు. సహాయక చర్యల్లో రక్షణ దళాలు ప్రమాదం ఘటన వెలుగులోకి రాగానే నేవీ, వైమానిక దళాలు సహాయక చర్యలకు తరలాయి. క్షతగాత్రులను 6 హెలికాప్టర్ల ద్వారా కొల్లాం, తిరువనంతపురంతోపాటు సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. బాధితులకు కావాల్సిన మందులు, ఇతరత్రా సామగ్రిని నేవీకి చెందిన మూడు నౌకల ద్వారా కొల్లాం తీరానికి తరలించారు. చైన్నై సమపంలోని అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో మందుపాతర, ఇతర ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న అంశాన్ని తేల్చాలంటూ కేంద్రం హుటాహుటిన కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్వో)ను పంపింది. ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, రాంమనోహర్ లోహియా ఆసుపత్రుల నుంచి 25 మంది వైద్యుల బృందాన్ని కూడా పంపింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్.. కేరళ సీఎం ఊమెన్ చాందీకి ఫోన్ చేసి తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఆలయ అధికారులు మాయం.. అనుమతి లేకున్నా బాణసంచా కాల్చినందుకు ఆలయ అధికారులపై పోలీసులు సెక్షన్ 307, సెక్షన్ 308తోపాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదం తర్వాత ఆలయానికి చెందిన 15 మంది నిర్వాహకులు కనిపించకుండా పోయారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణకు ఆదేశింది. క్రైం బ్రాంచ్ నేతృత్వంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా 84 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అందులో 75 మృతదేహాలను గుర్తించినట్లు సీఎం ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుమతి లేకున్నా బాణసంచా పేల్చుతుంటే పోలీసులు ఏం చేశారని కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితాలను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇందులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదు. వేలాది మంది ఒకచోట చేరిన తర్వాత పోలీసులు చర్య తీసుకుంటే అది ఇంకో సమస్యకు దారి తీస్తుంది’’ అని అన్నారు. మరోవైపు ప్రమాదం విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో యువకులు రక్తం ఇవ్వడానికి స్థానిక ఆస్పత్రుల ముందు బారులు తీరారు. కేంద్రం రూ.2 లక్షలు,రాష్ట్రం రూ.10 లక్షల పరిహారం మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున ప్రధాని రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. రాష్ర్టం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని కేరళ సీఎం చాందీ వెల్లడించారు. యావత్ దేశం దిగ్భ్రాంతి... న్యూఢిల్లీ: కేరళలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంతో దేశం యావత్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం జయలలిత సహా దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్... ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలపగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాప సందేశంలో ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మాతా అమృతానందమయి మఠం తెలిపింది. క్షతగాత్రులకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించింది. గల్ఫ్‌లోని భారతీయ వ్యాపారవేత్త ఎం.ఎ. యూసఫ్ అలీ కూడా మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు. కొల్లాం దుర్ఘటనపై వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న పుట్టింగల్ దేవి ఆలయం వద్ద సంభవించిన అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అసలు అనుమతే లేదు పుట్టింగల్ ఆలయంలో ఏటా బాణసంచా వేడుక నిర్వహిస్తున్నా.. ఈసారి అధికారులు అందుకు అనుమతివ్వలేదు. ఆలయ ప్రాంగణంలో టపాసులు నిల్వ చేయొద్దని సాక్షాత్తూ సీఎం కార్యాలయం ఆదేశించింది. అయినా ‘మౌఖిక’ అనుమతి ఉందంటూ ఆలయ అధికార్లు ప్రకటించడంతో వేడుక మొదలైంది. వేడుక కాదు.. పోటీ... టపాసులు కాల్చడాన్ని వేడుకలా కాకుండా ఓ పోటీలా నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో బాణసంచా అమ్మకానికి అనార్కలి అనే కాంట్రాక్టరుకు మాత్రమే అనుమతి ఉంది. మరో కాంట్రాక్టర్ సురేంద్రన్‌కు అనుమతి లేకున్నా అమ్మకానికి పెద్దఎత్తున బాణసంచా తెచ్చాడు. ఇతనిపై కేసు నమోదు చేశారు. స్థానికులు వద్దన్నా.. ఆలయం నివాసాల మధ్య ఉండడంతో బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరమంటూ స్థానికులు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయినా దేవస్థానం బోర్డు వినిపించుకోకుండా ఎప్పట్లాగే ముందుకెళ్లింది. ఎలా జరిగింది? ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో మరికొద్దిసేపట్లో వేడుక ముగుస్తుందనగా ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన భవనం పేలుళ్లతో దద్దరిల్లి కుప్పకూలింది. పెలుళ్ల ధాటికి కొందరి చెవుల్లోంచి రక్తం వచ్చింది. దేవస్థానం బోర్డు బిల్డింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సహాయక చర్యలు క్షతగాత్రులను హుటాహుటిన తిరువనంతపురం మెడికల్ కాలేజీకి, కొల్లాంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని వైమానిక దళానికి చెందిన విమానాల ద్వారా తరలించారు. -
పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన రాహుల్
కొల్లాం: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కేరళలో అగ్నిప్రమాదం సంభవించిన పుట్టింగళ్ ఆలయానికి వెళ్లారు. బాణసంచా పేలుడు కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని, కేరళ హోం మంత్రి చెన్నితల రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా భక్తులు గాయపడ్డారు. -
సహాయక చర్యలు పూర్తయ్యాయి: ఊమెన్ చాందీ
తిరువనంతపురం : కొల్లం పుట్టంగల్ ఆలయంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు.క్షతగాత్రుల వైద్య సహాయం పై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో ఊమెన్ చాందీ ఫోన్లో వివరించారు. అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఊమెన్ చాందీకి మోదీ హామీ ఇచ్చారు. అలాగే ప్రమాద ఘటన స్థలాన్ని కేరళ హోంశాఖ మంత్రి రమేష్ చెన్నితాల సందర్శించారు. మంటలు అదుపులోకి వచ్చాయని... గాయపడిన వారిని తిరువనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లం పుట్టంగల్ ఆలయ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేష్ చన్నితాల ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేరళ మంత్రి వర్గం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురంలో అత్యవసర సమావేశం కానుంది. ఇదిలా ఉంటే మోదీ కేరళ బయలుదేరారు. అలాగే కేరళలో నిర్వహించిన వలసిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు. -
మాటలకందని విషాదం : మోదీ
కొల్లాం : కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదం మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఇది హృదయ విదారకమైన ప్రమాదమని, మాటలకందని విషాదమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం గురించి కేరళ సీఎం ఓమన్ చాందీతో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. తాను కూడా వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్ కొల్లాం ప్రమాదంపై స్పందించారు. ఇటువంటి విషాదవార్త విన్నందుకు బాధగా ఉందన్నారు. బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. Fire at temple in Kollam is heart-rending & shocking beyond words. My thoughts are with families of the deceased & prayers with the injured. — Narendra Modi (@narendramodi) 10 April 2016 Spoke to CM Oommen Chandy about the fire at a temple in Kollam. Arranging for immediate shifting of those critically injured via helicopter. — Narendra Modi (@narendramodi) 10 April 2016 Have also asked my Cabinet colleague & Health Minister @JPNadda to immediately reach the site of the fire tragedy in Kollam. — Narendra Modi (@narendramodi) 10 April 2016 -
పుట్టింగల్ దేవి ఆలయ విశిష్టత
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనా భరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌లో మీనమ్ మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గుడిలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తుంటారు. అంతేకాదు మగవారు ఆడవారిలాగా అలంకరించుకొని దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత బాణాసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కూడా లక్షలాదిమంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చారు. పూజలు చేసిన తర్వాత బాణాసంచాను కాల్చడం మొదలు పెట్టారు. అయితే ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పు రవ్వలు ఎగిసి పక్కనే ఉన్న... బాణాసంచాపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అలాగే దీపాల కోసం ఉంచిన నూనె కూడా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించి ఉండటం... ప్రమాదం జరిగిన సమయంలోనే ఎక్కువ మంది ఒకేచోట ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. నిమిషాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ప్రాణనష్టం భారీగా ఉందని తెలుస్తోంది. -
బాణసంచా పేలిన దృశ్యాల వీడియో..
కొల్లం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుత్తింగళ్ దేవీ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 83 మందికిపైగా మృతిచెందగా, 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జరుగుతుండగా కొంత దూరం నుంచి తీసిన వీడియోను ఏఎన్ఐ వార్త సంస్థ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. -
ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం: 83 మంది మృతి
కొల్లం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 80 మందికిపైగా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కొల్లం, తిరువనంతపురం ఆస్పత్రులకు తరలించారు. కేరళ సీఎం ఉమెన్ చాందీ, మంత్రులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
కన్నీళ్లు పెట్టిన శ్వేతా మీనన్
కొచ్చి: కొల్లాం లోక్‌సభ సభ్యుడు ఎన్ పితాంబర కురుప్(73) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కొల్లాం నుంచి వచ్చిన పోలీసుల బృందం ఈ ఉదయం 9 గంటలకు శ్వేతా మీనన్ నివాసంలో ఆమె వాంగూల్మం నమోదు చేసింది. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కురుప్, శ్వేతా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పట్ల కురుప్ అభ్యంతర కరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ నిన్న ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ కూడా రాశారు. మంగళవారం ముఖ్యమంత్రిని ఆమె కలవనున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోత్సాహంతోనే తాను ఆరోపణలు చేశానని కురుప్ వ్యాఖ్యనించడాన్ని ఆమె కొట్టి పారేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. -
4 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖపట్నం మీ దుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే పచ్చజెండా ఊపింది. గువహటి-సికింద్రాబాద్, హైదరాబాద్-షాలిమా ర్, షాలిమార్-యశ్వంత్‌పూర్, సాం త్రగచ్చి-కొచివేలి వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న విశాఖ-కొల్లాం(కేరళ) రైలును మరో రెండు మాసాల వరకూ పొడి గిస్తూ ఆదివారం ప్రకటన జారీ చేసింది. కొల్లాం రైలు పొడిగింపుతో అయ్యప్ప భక్తుల ప్రయాణ సమస్యలు దాదాపు తీరినట్టేనని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొల్లాం రైలును సెప్టెంబర్ నెల వరకూ మాత్రమే ప్రకటించిన రైల్వే తాజాగా అక్టోబర్, నవంబర్ మాసాల చివరి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రయాణికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 17 బోగీలుండే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చెరోబోగీతో బాటు 7 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలుంటాయి. రైలు నంబర్ 08569 విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకూ(మొత్తం 16 ట్రిప్పులు) ప్రతి ఆది, గురువారాల్లో ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, కాట్పడి, జోలార్పేటయ్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం మీదుగా కొల్లాంకు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడకు మధ్యాహ్నం 2.50 గంటలకు, గూడూరుకు రాత్రి 8.28 గంటలకు, కోయంబత్తూర్‌కు ఆ మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు చేరుతుంది. రైలు నంబర్ 08570 కొల్లాం-విశాఖపట్నం బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కొల్లాంలో బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు కోయంబత్తూర్ చేరుకునే ఈ రైలు గూడూరు స్టేషన్‌కు ఉదయం 14.50 గంటలకు, విజయవాడకు రాత్రి 7.10 గంటలకు, చేరుకునే ఈ రైలు అర్థరాత్రి 1.25 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుతుంది. గువహటి-సికింద్రాబాద్ మధ్య 9 ట్రి ప్పులు రైలు నంబర్ 07149 సికింద్రాబాద్-గువహటి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖలో రాత్రి 8.20 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గువహటి చేరుకుంటుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 9 ట్రిప్పులు నడుస్తుంది. రైలు నంబర్ 07150 గువహటి-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు గువహటిలో బయల్దేరి మంగళవారం రాత్రి 7.40 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైలు విశాఖ మీదుగా పరుగులు తీస్తుంది. దువ్వాడ, విశాఖ, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 8 స్లీపర్‌క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి. హైదరాబాద్ -షాలిమర్ మధ్య సూపర్‌ఫాస్ట్ రైలు నంబర్ 07128 స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకూ ప్రతి ఆదివారం రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటలకు బయల్దేరి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07127 షాలిమర్-హైదరాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11.05 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖ నుంచి ప్రతి బుధవారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్, భద్రక్ స్టేషన్లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 4 జనరల్ బోగీలుంటాయి. యశ్వంత్‌పూర్‌కు స్పెషల్ యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే ఉంటాయి. అందుకే దసరా సీజన్లో మరో ప్రత్యేక రైలును ఈ మార్గంలో నడుపుతున్నారు. షాలిమర్ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య ఈ ప్రత్యేక రైలు 8 ట్రిప్పులు నడుస్తుంది. విశాఖకు రాకుండానే ఈ రైలు దువ్వాడ మీదుగా ప్రయాణిస్తుంది. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విజయనగరం, బరంపూర్, కుర్దారోడ్, భువరనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్ల మీదుగా ప్రయాణించే ఈ రైలులో ఫస్టు, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో బాటు 11 స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. జనరల్ బోగీలు ఈ రైల్లో ఉండవు. రైలు నంబర్ 02863 షాలిమర్-యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్7 వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 11.43 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుతుంది. రెండు నిమిషాల హాల్టు అనంతరం బయల్దేరి మంగళవారం సాయంత్రం 4 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 02864 యశ్వంత్ పూర్-షాలిమర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ ప్రతి బుధవారం ఉదయం 11.15 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ప్రతి గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి దువ్వాడలో 3.32 గంటలకు బయల్దేరి ప్రతి గురువారం సాయంత్రం 4.20 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. సాంత్రగచ్చి(హౌరా) నుంచి కేరళకు మరో స్పెషల్ కేరళలోని త్రివేండ్రం సమీపంలో ఉన్న కొచువేలి స్టేషన్ నుం చి హౌరా దరి సాంత్రగచ్చి స్టేషన్‌కు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ రైలు విశాఖ మీదుగా ప్రయాణిస్తుంది. రైలు నంబర్ 02851 సాంత్రగచ్చి-కొచువేలి స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ ప్రతి శనివారం సాయంత్రం 4.05 గంటలకు సాంత్రగచ్చిలో బయల్దేరి ఆదివారం తెల్లవారు జామున 4.40గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకుంటుంది. విశాఖలో తెల్లవారు జామున 5 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 10.30 గంటలకు కొచువేలి చేరుకుంటుంది. రైలు నంబర్ 02852 కొచువేలి నుంచి హౌరా స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 3వ తేదీ మధ్య ప్రతి మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు కొచువేలిలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 11.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖలో 11.35 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాంత్రగచ్చి చేరుతుంది. ఈ రైలులో రెండు థర్డ్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి.