'గుడి' మంటలు | Huge tragedy in the Puttingal temple in Kerala | Sakshi
Sakshi News home page

'గుడి' మంటలు

Published Mon, Apr 11 2016 3:39 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'గుడి' మంటలు - Sakshi

'గుడి' మంటలు

కేరళలోని పుట్టింగల్ ఆలయంలో పెను విషాదం
బాణసంచా వేడుకల్లో చెలరేగిన మంటలు..
106 మంది మృత్యువాత
383 మందికి తీవ్ర గాయాలు
పలువురి పరిస్థితి విషమం

 
కాళికాదేవి ఉత్సవాలకు తరలివచ్చిన 15 వేల మంది భక్తులు
నింగిలో పేలాల్సిన ఓ టపాసు భూమిపై పేలడంతో ప్రమాదానికి బీజం
పక్కనే బాణసంచా నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలో పడ్డ నిప్పురవ్వలు
పేలుళ్లతో దద్దరిల్లి కుప్పకూలిన భవనం.. చెలరేగిన మంటలు.. తొక్కిసలాట
కిలోమీటరు వరకు వినిపించిన పేలుళ్లు.. 10 మీటర్లు ఎగిరిపడ్డ సిమెంట్ దిమ్మలు
కరెంట్ పోవడంతో చిమ్మచీకటి.. గందరగోళంతో జనం పరుగులు
కాలిన దేహాలు, తెగిపడిన అవయవాలతో భీతావహంగా ఆలయ ప్రాంగణం
ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి
 
అది కేరళలోని పుట్టింగల్ ఆలయం.. సమయం.. ఆదివారం వేకువజామున 3.30 గం.  కాళికాదేవి ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చారు..  ఉత్సవాల చివరి రోజు కావడంతో ఎప్పట్లాగే బాణసంచా వేడుకలు మొదలయ్యాయి..  టపాసుల వెలుగులతో ఆ ప్రాంతమంతా కళ్లు మిరుమిట్లుగొలుపుతోంది..

 
 మరికొద్దిసేపట్లో వేడుక ముగుస్తుందనగా ఓ భారీ టపాసును అంటించారు.. నింగికి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలాల్సిన ఆ టపాసు నేలపైనే ఢాం అంది! పక్కనే ఓ రెండంతస్తుల భవనంలో నిల్వ చేసిన అలాంటి టపాసులపై నిప్పురవ్వలు పడ్డాయి. ఇంకేముంది.. చెవులు చిల్లులుపడే శబ్దంతో అవన్నీ వరుసగా పేలిపోయాయి.. మంటలు చెలరేగాయి.. పేలుళ్ల ధాటికి భూమి కంపించిపోయింది.. రెండంతస్తుల భవనం కుప్పకూలింది.. కిలోమీటరు మేర పేలుడు శబ్దాలు వినిపించాయి.. ఇంతలో కరెంట్ పోయింది.. ఏం జరుగుతుందో తెలియని జనం చీకట్లోనే దారీతెన్నూ లేకుండా పరుగులు పెట్టారు.. మంటల్లో కొందరు.. తొక్కిసలాటలో మరికొందరు.. భవనం కింద ఇంకొందరు.. ఇలా కొద్దిసేపటికే ఆలయ ప్రాంగణం మరుభూమిలా మారింది! 106 మంది మృత్యువాత పడ్డారు!! 383 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. దేవభూమిగా పేరొందిన కేరళలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘోరకలి దేశాన్ని కలచివేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తదితరులు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
 కొల్లాం/న్యూఢిల్లీ:  ప్రకృతి అందాలకు ఆలవాలమైన కేరళను గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు. అంటే దేవభూమి అని అర్థం! కానీ పుట్టింగల్ దుర్ఘటనతో ఆ దేవభూమి మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన పుట్టింగల్ ఆలయం కొల్లాం జిల్లా పరువూర్‌లో ఉంది. ఇక్కడ ఏటా 7 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు పెద్దఎత్తున బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని వేడుకలా కాకుండా ఓ పోటీలా నిర్వహిస్తారు. జనం రెండు పక్షాలుగా విడిపోయి పోటాపోటీగా టపాసులు కాలుస్తారు. ఏ వర్గం ఎంత ఘనంగా టపాసులు కాల్చిందో నిర్ణయించేందుకు న్యాయనిర్ణేతలు కూడా ఉంటారు. దీనిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోటీకి జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. శనివారం సాయంత్రం వరకు పోటీ జరుగుతుందా లేదా అన్న విషయంలో సందిగ్దం నెలకొంది. చివరికి.. ‘పోటీ లేదు కానీ టపాసులు కాల్చుకోవచ్చు..’ అంటూ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఉన్నతాధికారులు ‘మౌఖికంగా’ అనుమతించారని స్థానిక పోలీసులకు చెప్పడంతో వారూ అడ్డుపడలేదు. దీంతో శనివారం రాత్రి 11 గంటలకు బాణసంచా పేలుళ్లు మొదలయ్యాయి.
 
 ఊహకందని విషాదం: ప్రధాని
 ‘‘ఇది ఊహకందని విషాదం. ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తాం. దీనిపై మాట్లాడేందుకు నాకు మాటలు రావడం లేదు. చాలామంది చనిపోయారు. కొందరి తలలు తెగిపోయాయి. ఎందరో చావుబతుకుల్లో ఉన్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన పుట్టింగల్ దేవి ఆలయానికి వెళ్లి ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం చాందీతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర చికిత్స కోసం ఎవరినైనా ముంబై, ఢిల్లీ, ఇతర నగరాలకు తరలించాల్సి వస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని సీఎంకు చెప్పారు. తర్వాత కొల్లాం వెళ్లిన మోదీ.. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రమాదం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకొని మోదీతోకాకుండా విడిగా వెళ్లి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది: రాహుల్
 ప్రమాదం గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. తర్వాత కొల్లాం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ‘‘ఇది రాష్ట్రంతోపాటు దేశానికి కూడా తీరని విషాదం. ప్రమాదం జరగ్గానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ఇక్కడేం జరిగిందో తెలుసుకునేందుకే వచ్చా. పార్లమెంట్, కేంద్రం స్థాయిలో ఏ అంశమైనా లేవనెత్తాల్సి వస్తే పార్టీ పరంగా అందుకు తగినట్టుగా స్పందిస్తాం’’ అని ఆయన వివరించారు.
 
 పుట్టింగల్ ఆలయ చరిత్ర



కొల్లాం: పుట్టింగల్ దేవీ ఆలయం... కొల్లాం జిల్లా పరావుర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం... చీమల కొండపై(పుట్టు) అమ్మవారు కనిపించడంతో ఆ ప్రాంతంలో గుడిని నిర్మించారు. అదే పుట్టింగల్ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ప్రతి రోజు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మలయాళం క్యాలెండర్ ప్రకారం మీనం(మార్చి-ఏప్రిల్) నెలలో భరణి నక్షత్రం రోజున భారీ ఎత్తున ఉత్సవం చేస్తారు. అలాగే అశ్వత్తి విలక్కు, కథాకళి, కంపడికలి, మారమెడుప్పు వంటి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. మహిళల వేషధారణలో పురుషులు దీపారాధన చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ. దీపారాధన అనంతరం బాణాసంచా(మత్సర కంబం) కాలుస్తారు.
 
 పవిత్ర స్థలాల్లో ప్రమాదాలు
 తిరువనంతపురం: కేరళలోని కొల్లాంలో పుట్టింగల్ అమ్మవారి దేవాలయంలో జరిగిన ప్రమాదం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ కేరళ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగటం ఇదేం కొత్తకాదు. కేరళలో దేవాలయాలు,చర్చిల్లో బాణసంచా కాల్చటం కారణంగా జరిగిన ప్రమాదాలూ చాలానే ఉన్నాయి. 1989లో కాందశం కడవు చర్చిలో జరిగిన ప్రమాదంలో 12 మంది, ఇదే చర్చిలో 1984లో జరిగిన బాణసంచా ప్రమాదంలో 20 మంది చనిపోయారు. 1952లో శబరిమలలోనూ బాణసంచా పేలుడుతో 68 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. దీనికి తోడు దేశంలోని అనేక పవిత్ర స్థలాల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో వందల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గత పుష్కరకాలంగా జరిగిన ప్రమాదాలను ఓసారి గమనిస్తే..
 
 ఆగస్టు 27, 2003
 నాసిక్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోగా.. 125 మంది గాయపడ్డారు.
 
 జనవరి 25, 2005
 మహారాష్ట్రలోని మంధ్రాదేవీ గుడిలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు చనిపోయారు.
 
 ఆగస్టు 3, 2008
 హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవీ ఆలయంలో కొండచరియలు విరిగిపడ్డాయన్న పుకార్లతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతిచెందారు.
 
 ఆగస్టు 10, 2008
 రాజస్థాన్‌లోకి కోటాలో పురాతన శంకరుడి ఆలయం మెట్లు కూలి ఇద్దరు భక్తులు మరణించారు.
 
 సెప్టెంబర్ 30,2008
 జోధ్‌పూర్‌లోని మెహ్రంగఢ్ కోటలోని చాముండాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 220 మంది భక్తులు ప్రాణాలు కొల్పోయారు.
 
 జనవరి 14, 2011
 కేరళలోని పులిమేడు (శబరిమల) వద్ద ఓ జీపు అదుపుతప్పటంతో దీన్ని తప్పించుకునేందుకు జరిగిన తొక్కిసలాటలో 100 మంది అయ్యప్ప భక్తులు మరణించారు.
 
 జూలై 14, 2015
 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మంది మృతి
 
 విధ్వంసం సృష్టించిన ఆ ఒక్కటీ...
 అమ్మవారి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతోపాటు బాణసంచా వేడుకల తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దాదాపు 15 వేల మంది దాకా వచ్చినట్టు తెలుస్తోంది. టపాసులు మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. ఇంతలో రాకెట్ మాదిరి నింగిలోకి దూసుకెళ్లి పెద్దశబ్దంతో పేలిపోయే ‘అమిట్టు’ అనే టపాసు వెలిగించారు. ఈ టపాసే పెను విధ్వంసానికి కారణమైంది. నిప్పంటించగానే ఆకాశంలోకి వెళ్లాల్సిన అమిట్టు నేలపైనే పేలిపోయింది. నిప్పు రవ్వలు మరిన్ని అమిట్టులపై పడడంతో అవన్నీ పేలాయి. ఇదే సమయంలో పక్కనే బాణసంచాను నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలోని టపాసులు పేలడం మొదలైంది. పెద్దపెద్ద శబ్దాలతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పేలుళ్ల ధాటికి భవనం కుప్పకూలింది. భవనంలోని సిమెంట్ దిమ్మెలు సైతం పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ భీతావహ పరిస్థితికి తోడు కరెంటు కూడా పోవడంతో జనం చీకట్లో పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మంటలు ఆలయం వరకు వ్యాపించడంతో గుడికి చెందిన కార్యాలయ భవనం కూడా దెబ్బతింది. మొత్తమ్మీద పేలుళ్ల దెబ్బకు చుట్టుపక్కల ఉన్న ఏడు భవనాలు ధ్వంసమయ్యాయి.


 
 భీతావహం.. హృదయ విదారకం
 అటు మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచినవారి దేహాలు.. ఇటు తెగిపడిన శరీర అవయవాలతో ఆలయ ప్రాంగణం భీతావహంగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, కాలిన గాయాలతో బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి హృదయ విదారకంగా మారింది. ‘‘నేను మా ఇంటిపై నుంచి వేడుక చూస్తున్నా. ఇంతలో పెను పేలుడు సంభవించింది. కరెంటు పోవడంతో గందరగోళం నెలకొంది. వెంటనే అక్కడికెళ్లి చూసే సవరికి 10-15 మంది చనిపోయి పడి ఉన్నారు’’ అని లాలు అనే ఓ జర్నలిస్టు తెలిపారు. ‘‘ప్రమాదం తర్వాత వెంటనే అక్కడికి వెళ్లా. ఎటు చూసినా కాలిపోయిన.. పడిపోయిన శవాలే కనిపించాయి.


కొందరు మంటల్లో చిక్కుకొని పరుగులు పెడుతున్నారు. కొందరైతే గుర్తుపట్టేందుకు కూడా వీల్లేకుండా కాలిపోయారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నా’’ అని విజయన్ అనే ప్రత్యక్షసాక్షి చెప్పారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు http://img.sakshi.net/images/cms/2016-04/61460326222_Unknown.jpgజాప్యమయ్యాయని, క్షతగాత్రులను తరలిచేందుకు వాహనాలు ఆలస్యంగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వేడుకలను చూసేందుకు జనం గుమిగూడిన భవనం కూలిపోవడంతో శిథిలాల కింద నలిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ‘‘మా ఇల్లు ఆలయానికి దగ్గరే ఉంటుంది. టపాసులతో ఏటా మాకు ఏదో ఒక నష్టం వాటిల్లడంతో దీన్ని ఆపాలంటూ నేనే అధికారులను ఆశ్రయించా. వారు అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించారు. ఈ ప్రమాదంలో మా ఇల్లు చాలా వరకు దెబ్బతింది’’ అని 73 ఏళ్ల పంజాక్షియమ్మ చెప్పారు.
 


 సహాయక చర్యల్లో రక్షణ దళాలు
 ప్రమాదం ఘటన వెలుగులోకి రాగానే నేవీ, వైమానిక దళాలు సహాయక చర్యలకు తరలాయి. క్షతగాత్రులను 6 హెలికాప్టర్ల ద్వారా కొల్లాం, తిరువనంతపురంతోపాటు సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. బాధితులకు కావాల్సిన మందులు, ఇతరత్రా సామగ్రిని నేవీకి చెందిన మూడు నౌకల ద్వారా కొల్లాం తీరానికి తరలించారు. చైన్నై సమపంలోని అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో మందుపాతర, ఇతర ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న అంశాన్ని తేల్చాలంటూ కేంద్రం హుటాహుటిన కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్‌వో)ను పంపింది. ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, రాంమనోహర్ లోహియా ఆసుపత్రుల నుంచి 25 మంది వైద్యుల బృందాన్ని కూడా పంపింది. కేంద్ర  హోం మంత్రి రాజ్‌నాథ్.. కేరళ సీఎం ఊమెన్ చాందీకి ఫోన్ చేసి తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు.

 ఆలయ అధికారులు మాయం..
 అనుమతి లేకున్నా బాణసంచా కాల్చినందుకు ఆలయ అధికారులపై పోలీసులు సెక్షన్ 307, సెక్షన్ 308తోపాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదం తర్వాత ఆలయానికి చెందిన 15 మంది నిర్వాహకులు కనిపించకుండా పోయారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణకు ఆదేశింది. క్రైం బ్రాంచ్ నేతృత్వంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా 84 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అందులో 75 మృతదేహాలను గుర్తించినట్లు సీఎం ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుమతి లేకున్నా బాణసంచా పేల్చుతుంటే పోలీసులు ఏం చేశారని కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితాలను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇందులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదు. వేలాది మంది ఒకచోట చేరిన తర్వాత పోలీసులు చర్య తీసుకుంటే అది ఇంకో సమస్యకు దారి తీస్తుంది’’ అని అన్నారు. మరోవైపు ప్రమాదం విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో యువకులు రక్తం ఇవ్వడానికి స్థానిక ఆస్పత్రుల ముందు బారులు తీరారు.
 
 కేంద్రం రూ.2 లక్షలు,రాష్ట్రం రూ.10 లక్షల పరిహారం
 మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున ప్రధాని రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. రాష్ర్టం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని కేరళ సీఎం చాందీ వెల్లడించారు.
 
 యావత్ దేశం దిగ్భ్రాంతి...
 న్యూఢిల్లీ: కేరళలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంతో దేశం యావత్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం జయలలిత సహా దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్... ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలపగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాప సందేశంలో ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మాతా అమృతానందమయి మఠం తెలిపింది. క్షతగాత్రులకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించింది. గల్ఫ్‌లోని భారతీయ వ్యాపారవేత్త ఎం.ఎ. యూసఫ్ అలీ కూడా మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

 కొల్లాం దుర్ఘటనపై వైఎస్ జగన్ సంతాపం
 సాక్షి, హైదరాబాద్: కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న పుట్టింగల్ దేవి ఆలయం వద్ద సంభవించిన అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
 అసలు అనుమతే లేదు
 పుట్టింగల్ ఆలయంలో ఏటా బాణసంచా వేడుక నిర్వహిస్తున్నా.. ఈసారి అధికారులు అందుకు అనుమతివ్వలేదు. ఆలయ ప్రాంగణంలో టపాసులు నిల్వ చేయొద్దని సాక్షాత్తూ సీఎం కార్యాలయం ఆదేశించింది. అయినా ‘మౌఖిక’ అనుమతి ఉందంటూ ఆలయ అధికార్లు ప్రకటించడంతో వేడుక మొదలైంది.
 
 వేడుక కాదు.. పోటీ...

 టపాసులు కాల్చడాన్ని వేడుకలా కాకుండా ఓ పోటీలా నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో బాణసంచా అమ్మకానికి అనార్కలి అనే కాంట్రాక్టరుకు మాత్రమే అనుమతి ఉంది. మరో కాంట్రాక్టర్ సురేంద్రన్‌కు అనుమతి లేకున్నా అమ్మకానికి పెద్దఎత్తున బాణసంచా తెచ్చాడు. ఇతనిపై కేసు నమోదు చేశారు.
 
 స్థానికులు వద్దన్నా..
 
ఆలయం నివాసాల మధ్య ఉండడంతో బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరమంటూ స్థానికులు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయినా దేవస్థానం బోర్డు వినిపించుకోకుండా ఎప్పట్లాగే ముందుకెళ్లింది.
 
 ఎలా జరిగింది?
 ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో మరికొద్దిసేపట్లో వేడుక ముగుస్తుందనగా ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన భవనం పేలుళ్లతో దద్దరిల్లి కుప్పకూలింది. పెలుళ్ల ధాటికి కొందరి చెవుల్లోంచి రక్తం వచ్చింది. దేవస్థానం బోర్డు బిల్డింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.
 
 సహాయక చర్యలు
 క్షతగాత్రులను హుటాహుటిన తిరువనంతపురం మెడికల్ కాలేజీకి, కొల్లాంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని వైమానిక దళానికి చెందిన విమానాల ద్వారా తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement