ఎన్నికల రాజకీయాలకు 107మంది బలి
కొల్లామ్: కేరళలోని పుట్టింగల్ ఆలయంలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన బాణసంచా పేలుళ్లలో 107 మంది మరణించడానికి, 308 మంది గాయపడడానికి బాధ్యులెవరు? కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆదేశించిన న్యాయవిచారణగానీ, క్రైమ్‌బ్రాంచి దర్యాప్తుగాని మూల కారణాలను శోధించి బాధ్యులను వెతికి పట్టుకుంటుందా? ప్రజల ప్రాణాలను బుగ్గిపాలు చేసిన ప్రాధమిక ఉల్లంఘనలకు అసలు కారకులెవరో గుర్తిస్తుందా?
ఆలయంలో బాణాసంచా పేల్చడానికి వీల్లేదంటూ జిల్లా కలెక్టర్ నుంచి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వరకు ప్రతి స్థాయిలో అనుమతి నిరాకరించినప్పటికీ, ఆలయాన్ని ఆనుకొని ఉన్న 11 ఇళ్ల నివాసితుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బాణసంచా పేల్చడానికి వీల్లేదంటూ స్థానిక తహసిల్దార్ ఆదేశించినా ఎలా బాణసంచాను పేల్చారు. గతంలో పేలుళ్ల వల్ల తన ఇల్లు కాలిపోయిందని, ఈ సారి పేలుళ్లను నిలిపి వేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఆమెను బెదిరించింది ఎవరు?
ఇంతమంది అనుమతి నిరాకరించిన బాణసంచా పేలుళ్లను స్థానిక పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? సంప్రదాయం ప్రకారం ఆలయంలో బాణసంచాను పేల్చాల్సిందేనంటూ ఆలయ నిర్వాహకులపై ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక హిందూ సంఘాలు, రాజకీయ నాయకులే ఇందుకు కారణమని తెల్సింది. జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లు ఇద్దరూ ముస్లింలు. అందుకే వారు హిందూ సంప్రదాయాన్ని అడ్డుకుంటున్నారని స్థానిక రాజకీయ నాయకులు వారిని బెదిరించారట.
ఎన్నికళ వేళ తమ సంప్రదాయాన్ని అడ్డుకోకూడదంటూ స్థానిక పోలీసులను కూడా వారు హెచ్చరించారట. ఈ కారణంగానే తాము జోక్యం చేసుకోలేకపోయామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పైగా రాత్రి 10 గంటల తర్వాత బాణసంచాను పేల్చరాదంటూ జనరల్ నిబంధనలు అమల్లో ఉన్నా పట్టించుకోకుండా అన్యాయంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న స్థానిక రాజకీయ నాయకులకు శిక్ష విధిస్తారా?