కేరళ ఆలయానికి పొలిటికల్ వీఐపీల క్యూ!
తిరువనంతపురం: కేరళలోని శివగిరి ముత్తు ఆలయం ఇప్పుడు రాజకీయ నాయకులు రాకపోకలతో సందడిగా మారింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆలయాన్ని సందర్శించి.. ఇక్కడి హిందూ మత పెద్దలతో భేటీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం శివగిరి ముత్తు ఆలయాన్ని సందర్శించారు. ఒకరోజు కేరళ పర్యటనకు వచ్చిన సోనియా శివగిరి ముత్తు ఆలయం వద్ద జరిగిన భక్తుల వార్షిక తీర్థయాత్ర ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. కేరళ ప్రముఖ సంస్కరణవేత్త శ్రీ నారాయణ్‌గురు ప్రవచనాలను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. మతవాదం, విద్వేషం, మతమౌఢ్యాన్ని వ్యాప్తి చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతూ శ్రీ నారాయణ్‌గురు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
శ్రీ నారాయణ్ గురు 1903లో శ్రీ నారాయణ్ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ)ని స్థాపించారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో హిందువుల్లో మెజారిటీ వర్గమైన ఈజావాల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజావాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక యాత్ర చేపట్టే శివగిరి ముత్తు ఆలయం ఇటీవల రాజకీయంగా ప్రధాన ఆకర్షణగా మారింది. సంప్రదాయికంగా వామపక్షాల ఓటుబ్యాంకు అయిన ఈజావ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే గత నెలలో కేరళ వచ్చిన మోదీ బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి.. పూజారులతో సమావేశమయ్యారు. తాజాగా సోనియాగాంధీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.