న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై విమర్శల వర్షం గుప్పించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. దేశ పాలన ప్రధాని నివాసం నుంచి ఎందుకు జరుగుతోందని, సమరుథడైన ప్రధాని ఎందుకున్నారనేదే ఆమె అసలు సమస్య అని ఎద్దేవా చేసింది. సోనియాకు ప్రసంగాన్ని రాసిపెడుతున్నవాళ్లు అనాలోచితంగా రాస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారమిక్కడ విమర్శించారు. యూపీఏది కేవలం మాటల ప్రభుత్వమని, బీజేపీది చేతల ప్రభుత్వమని అన్నారు. ‘అధికారంలోకి వచ్చి 100 రోజులైనా నల్లధనంపై చర్యలేవని సోనియా ప్రశ్నించారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశించి రెండేళ్లయినా.. నల్లధనంపై యూపీఏ ప్రభుత్వం సిట్ వేయలేదు. అదే మోదీ ప్రభుత్వం కేబినెట్ తొలి సమావేశంలోనే సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక కాంగ్రెస్ ఒక బలహీనమైన ప్రధానిని పెట్టుకుంది.
బీజేపీ అత్యంత సమర్థుడైన ప్రధానితో పాటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసలు సోనియా సమస్య ఏమిటంటే.. పాలనలో నిర్ణయాలన్నీ ప్రధాని నివాసం నుంచే వస్తున్నాయెందుకనేదే! అధికారం చెలాయించేందుకు జాతీయ సలహా మండలి లేదేం? ఈ ప్రభుత్వానికి ‘10 జన్‌పథ్ (సోనియా నివాసం)’ వంటి అధికార కేంద్రం లేదేమనేవి ఆమె సమస్యలు.. ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.