న్యూఢిల్లీ/చండీగఢ్: వాద్రా భూ లావాదేవీకి సంబంధించి హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. ఆ లావాదేవీని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధం చేయడంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలనే మోదీ వ్యాఖ్య పై స్పందిస్తూ.. ‘ఆ నిర్ణయం జూలై 16కి ముం దే తీసుకున్నారు. అప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో లేదు. సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఒక ప్రధానమంత్రి అయి ఉండి మోదీ అంత అజ్ఞానంతో మాట్లాడకూడదు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. మోదీ అమాయకుడా? లేక తెలిసే చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదన్నారు.
ప్రతీ విషయాన్ని సంచలనం చేయడం, రాజకీయం చేయడం మోదీకి అలవాటైపోయిందని కాం గ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ అంటూ మోదీ చేసిన ప్రసంగం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.