చట్టాలను నీరుగారుస్తున్నారు
బ్రహ్మపురి(మహారాష్ట్ర): కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శనివారం మహారాష్ట్ర, హర్యానాల ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ, ఉపాధి హామీ చట్టాలను బలహీనపరచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాలకు కోసం అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ, ఐఎన్‌ఎల్‌డీ ప్రధాన లక్ష్యమని, వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని శనివారం హర్యానాలోని తోషమ్‌లో ప్రజలకు సూచించారు. హామీలు ఎక్కువగా ఇచ్చి, ఆచరణ తక్కువగా చేసే బీజేపీ వలలో పడవద్దని హర్యానా ప్రజలను హెచ్చరించారు.
కాగా, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయని మహారాష్ర్టలోని బ్రహ్మపురి, గోండియా సభల్లో విమర్శించారు. ఆ ఇరు పార్టీల లక్ష్యం విద్వేషాలు రెచ్చగొట్టడమేనన్న ఆమె.. అభివృద్ధి ముసుగేసుకొచ్చే ఆ పార్టీలకు ఓట్లేయొద్దని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడ్డాయన్నారు.