SNDP
-
Hyderabad: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ) వింగ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, నిధులు మంజూరు అయినప్పటికీ పనులు కాలేదు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే మే నెలాఖరులోగా వీలైనన్ని పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ పనులు పూర్తవలేదు. ఇందుకు కారణాలనేకం. ఈ సంవత్సరం ఆరంభం వరకు అసలు పనుల్లో కదలిక లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. ఒక్కో పనికి మూడు నాలుగుసార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. తీరా పనులు ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయి పరిస్థితులతో అలైన్మెంట్లు, డిజైన్లు మార్చాల్సివచ్చింది. కొన్ని ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా చెబుతూపోతే.. ఎన్నో కారణాలున్నాయి. పనులు మాత్రం పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చి నేపథ్యంలో ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల వివరాల ఆధారంగా రాబోయే నెలన్నరలో దాదాపు పది పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఉన్నతాధికారులకు జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు హామీ ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్గా .. హామీ ఇచ్చిన పనుల్ని ఫాస్ట్ట్రాక్గా, ఎక్స్‌ప్రెస్ వేగంతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కానీ.. వర్షాలు కురిస్తే ఇంజినీరింగ్ పనులు.. అందునా నాలాల వంటి పనులు చేయడం అసాధ్యం. సమస్య పరిష్కారం కంటే ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు వరకు దాదాపు రూ.200 కోట్ల విలువైన పనుల్ని పూర్తి చేయగలమని జోనల్ కమిషనర్లు హామీ ఇచ్చినా ఏమేరకు అమలవుతాయన్నది వేచి చూడాల్సిందే. పనుల వేగం క్షేత్రస్థాయి స్థితిగతులు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జూలై ఆఖరు వరకు పూర్తవుతాయనుకుంటున్న పనుల వివరాలు.. పని పేరు.. అంచనా వ్యయం.. పూర్తయ్యే తేదీ.. ► నాగిరెడ్డి చెరువు– కాప్రా చెరువు వరద కాల్వ పనులు. రూ.41 కోట్లు: (జూన్ 30) ► ఫాక్స్‌సాగర్ కెమికల్ నాలా, కోల్‌కాల్వ– కెమికల్ నాలా. రూ.95 కోట్లు: (జూలై 15) ► కరాచీ బేకరీ వద్ద పికెట్ నాలా ఆధునికీకరణ పనులు (ఒకవైపు).రూ.10 కోట్లు: (జూన్ 30) ► ఈర్ల చెరువు– నేషనల్ హైవే 65.రూ.15.58 కోట్లు: (జూలై 15) ► ఇసుకవాగు– నక్కవాగు.రూ.5 కోట్లు: (జూలై 15) ► మోదుకుల కుంట– కొత్తచెరువు. రూ.17.80కోట్లు: (15 జూలై) ► అప్పాచెరువు– ముల్గుంద్ చెరువు. రూ.8.54 కోట్లు: (జూలై 31) ► బాతుల చెరువు– ఇంజాపూర్ నాలా.రూ.9.65 కోట్లు: (జూన్ 30) ► బండ్లగూడ చెరువు – నాగోల్ చెరువు. రూ.7.26 కోట్లు: ( జూలై 31) ► నెక్నాంపూర్ నాలా– మూసీ. రూ.24 కోట్లు: (జూలై 31) ఫాక్స్‌సాగర్, కెమికల్ నాలా, కోల్‌కాల్వ–కెమికల్నాలా రెండు పనులు ఒకే ప్యాకేజీ కింద చేపట్టారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111కు ఫోన్ చేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కూడా ప్రజలు ఫోన్ చేయవచ్చని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్‌నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, ఎల్బీనగర్/నాగోలు: నగరంలో నలువైపులా ఒకే తీరు అభివృద్ధి చేస్తున్నామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.672 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించినట్లు, రూ.103 కోట్ల వ్యయంతో నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. నాగోలు బండ్లగూడ చెరువు వద్ద నాలా అభివృద్ధి పనులకు, ఎల్బీనగర్ చౌరస్తాలో అండర్‌పాస్ (కుడివైపు), బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బి.దయానంద్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో వర్షాలు, వరదలతో ఎల్బీనగర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద రూ.103 కోట్ల వ్యయంతో వరద ముంపును శాశ్వతంగా నివారించేందుకు నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.2,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా నగర అభ్యున్నతికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఎస్సీ రవీందర్ రాజు, కార్పొరేటర్లు చింతల అరుణ, కొప్పుల నర్సింహారెడ్డి, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, సబిత, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి 10 వేల కోట్లు తీసుకురావాలి: కేటీఆర్ స్థానికంగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధిలో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురావాలని కోరారు. వరదల వేళ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. కిషన్‌రెడ్డి నిధులు తెస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఆయనకు పౌర సన్మానం చేస్తామన్నారు. -
నాలాల అభివృద్ధిపై జెడ్సీ సమీక్ష
బంజారాహిల్స్: వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా నాలాల రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సూచించారు. ఆదివారం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన సంబంధిత ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అన్నదానిపై సంబంధిత ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. సమీక్షలో పాల్గొన్న ఖైరతాబాద్ జెడ్సీ రవికిరణ్ -
హుస్సేన్‌సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన
-
కేరళ ఆలయానికి పొలిటికల్ వీఐపీల క్యూ!
తిరువనంతపురం: కేరళలోని శివగిరి ముత్తు ఆలయం ఇప్పుడు రాజకీయ నాయకులు రాకపోకలతో సందడిగా మారింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆలయాన్ని సందర్శించి.. ఇక్కడి హిందూ మత పెద్దలతో భేటీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం శివగిరి ముత్తు ఆలయాన్ని సందర్శించారు. ఒకరోజు కేరళ పర్యటనకు వచ్చిన సోనియా శివగిరి ముత్తు ఆలయం వద్ద జరిగిన భక్తుల వార్షిక తీర్థయాత్ర ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. కేరళ ప్రముఖ సంస్కరణవేత్త శ్రీ నారాయణ్‌గురు ప్రవచనాలను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. మతవాదం, విద్వేషం, మతమౌఢ్యాన్ని వ్యాప్తి చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతూ శ్రీ నారాయణ్‌గురు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. శ్రీ నారాయణ్ గురు 1903లో శ్రీ నారాయణ్ ధర్మపరిపాలన యోగం (ఎస్ఎన్డీపీ)ని స్థాపించారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో హిందువుల్లో మెజారిటీ వర్గమైన ఈజావాల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజావాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక యాత్ర చేపట్టే శివగిరి ముత్తు ఆలయం ఇటీవల రాజకీయంగా ప్రధాన ఆకర్షణగా మారింది. సంప్రదాయికంగా వామపక్షాల ఓటుబ్యాంకు అయిన ఈజావ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే గత నెలలో కేరళ వచ్చిన మోదీ బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించి.. పూజారులతో సమావేశమయ్యారు. తాజాగా సోనియాగాంధీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.