కన్నీళ్లు పెట్టిన శ్వేతా మీనన్
కొచ్చి: కొల్లాం లోక్సభ సభ్యుడు ఎన్ పితాంబర కురుప్(73) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కొల్లాం నుంచి వచ్చిన పోలీసుల బృందం ఈ ఉదయం 9 గంటలకు శ్వేతా మీనన్ నివాసంలో ఆమె వాంగూల్మం నమోదు చేసింది. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కురుప్, శ్వేతా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పట్ల కురుప్ అభ్యంతర కరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ నిన్న ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ కూడా రాశారు. మంగళవారం ముఖ్యమంత్రిని ఆమె కలవనున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోత్సాహంతోనే తాను ఆరోపణలు చేశానని కురుప్ వ్యాఖ్యనించడాన్ని ఆమె కొట్టి పారేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.