N Peethambara Kurup
-
నాపై ఎటువంటి ఒత్తిడి లేదు:శ్వేతా మీనన్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73) పై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ తెలిపింది. కేసును వెనక్కి తీసుకోవడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని శ్వేతా తెలిపింది. గత కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఎంపీ కురుప్ అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మెట్టుదిగి వచ్చిన శ్వేతా మీనన్ గురువారం ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కేసును వెనక్కి తీసుకోబోతున్నట్లు తెలిపింది. తనకు తానుగానే ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నానని, ఈ అంశంలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదని తెలిపింది. కాగా, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఆ రోజు జరిగిన పబ్లిక్ ఫంక్షన్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, వివాదాలను స్పష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని తాను ఎప్పుడూ కోరుకోనని తెలిపింది. అతని వయసుకు గౌరవమిచ్చి కేసును వెనక్కు తీసుకుంటున్నాని తెలిపింది. -
కేరళ కాంగ్రెస్ ఎంపీని వెంటాడుతున్న శ్వేతామీనన్ కేసు!
కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై మలయాళ నటి శ్వేత మీనన్ చేసిన ఆరోపణలను ఆధారంగా స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. స్థానిక కోర్టుకు నివేదించారు. తన పట్ల ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం కొల్లాం జరిగిన ప్రసిడెంట్స్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా తన చేయి పట్టుకుని.. తనను పలుమార్లు తడిమారని కాంగ్రెస్ ఎంపీపై శ్వేత మీనన్ ఆరోపించింది. ఎంపీనే కాకుండా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు వెల్లడించింది. ఎంపీ, మరో వ్యక్తి వ్యవహరించిన తీరు తనకు మనస్తాపం కలిగించింది అన్నారు. ఆతర్వాత శ్వేత మీనన్ కు ఎంపీ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సమసిపోయింది. అయితే శ్వేత ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కారణంగా కోర్టుకు నివేదించారు. దాంతో మళ్లీ ఈ కేసు వెలుగులోకి వచ్చింది. -
శ్వేత మీనన్ ఆరోపణలపై ఎంపీ కురుప్ పై కేసు నమోదు!
తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73)పై కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొల్లాం లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 71 ఏళ్ల కురుప్ పై సెక్షన్ 354, 354(ఏ)ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రసిడెంట్ ట్రోఫి బోట్ రేస్ కార్యక్రమం సందర్భంగా మరో వ్యక్తి కూడా తనతో అనుచితంగా ప్రవర్తించారని శ్వేత మీనన్ ఆరోపించింది. సీపీఎం అనుబంధం సంస్థ డీవైఎఫ్ఐ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం శ్వేత మీనన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. పోలీసుల స్టేట్ మెంట్ ను రికార్డు చేసే సందర్భంలో శ్వేత మీనన్ భోరున విలపించింది. -
కన్నీళ్లు పెట్టిన శ్వేతా మీనన్
కొచ్చి: కొల్లాం లోక్సభ సభ్యుడు ఎన్ పితాంబర కురుప్(73) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కొల్లాం నుంచి వచ్చిన పోలీసుల బృందం ఈ ఉదయం 9 గంటలకు శ్వేతా మీనన్ నివాసంలో ఆమె వాంగూల్మం నమోదు చేసింది. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కురుప్, శ్వేతా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పట్ల కురుప్ అభ్యంతర కరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ నిన్న ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ కూడా రాశారు. మంగళవారం ముఖ్యమంత్రిని ఆమె కలవనున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోత్సాహంతోనే తాను ఆరోపణలు చేశానని కురుప్ వ్యాఖ్యనించడాన్ని ఆమె కొట్టి పారేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. -
ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారు: నటి శ్వేతా మీనన్
కొల్లాం లోక్సభ సభ్యుడు పితాంబరం కురుప్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ శనివారం కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. కొల్లాంలో నిన్న సాయంత్రం పడవల పోటీ విజేతలకు ప్రెసిడెంట్స్ ట్రోఫీ బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన పట్ల ప్రవర్తించిన తీరుకు సంబంధించిన మీడియా పూటేజ్లను ఆమె ప్రదర్శించారు. ఆయనపై చర్యల కోసం మలయాళ చిత్ర పరిశ్రమను సంప్రదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. శ్వేత మీనన్ ఆరోపణలతో మలయాళీ చిత్ర పరిశ్రమ అగ్ని మీద గుగ్గిలమైంది. పితాంబరంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అటు మలయాళీ చిత్ర పరిశ్రమ ఇటు మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే శ్వేత మీనన్ ఆరోపణలను లోక్సభ సభ్యుడు పితాంబరం (73) తీవ్రంగా ఖండించారు. ఓ మీడియా వర్గం కావాలనే తనపై ఇలా విష ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఆ విషయంలో తాను అమాయకుడినని చెప్పారు. తన నిర్దోషత్వాన్ని తర్వలో నిరూపించుకుంటానని వెల్లడించారు. శ్వేత మీనన్ ఆరోపణలను సు మోటోగా స్వీకరించి, విచారణ చేపడుతున్నట్లు కేరళా మహిళ హక్కుల సంఘం అధ్యక్షురాలు లిసీ జోస్ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.