నాపై ఎటువంటి ఒత్తిడి లేదు:శ్వేతా మీనన్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ ఎన్ పితాంబర కురుప్(73) పై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ తెలిపింది. కేసును వెనక్కి తీసుకోవడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని శ్వేతా తెలిపింది. గత కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఎంపీ కురుప్ అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మెట్టుదిగి వచ్చిన శ్వేతా మీనన్ గురువారం ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కేసును వెనక్కి తీసుకోబోతున్నట్లు తెలిపింది. తనకు తానుగానే ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నానని, ఈ అంశంలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదని తెలిపింది.
కాగా, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఆ రోజు జరిగిన పబ్లిక్ ఫంక్షన్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, వివాదాలను స్పష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని తాను ఎప్పుడూ కోరుకోనని తెలిపింది. అతని వయసుకు గౌరవమిచ్చి కేసును వెనక్కు తీసుకుంటున్నాని తెలిపింది.