సహాయక చర్యలు పూర్తయ్యాయి: ఊమెన్ చాందీ
తిరువనంతపురం : కొల్లం పుట్టంగల్ ఆలయంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు.క్షతగాత్రుల వైద్య సహాయం పై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో ఊమెన్ చాందీ ఫోన్లో వివరించారు. అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఊమెన్ చాందీకి మోదీ హామీ ఇచ్చారు.
అలాగే ప్రమాద ఘటన స్థలాన్ని కేరళ హోంశాఖ మంత్రి రమేష్ చెన్నితాల సందర్శించారు. మంటలు అదుపులోకి వచ్చాయని... గాయపడిన వారిని తిరువనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లం పుట్టంగల్ ఆలయ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేష్ చన్నితాల ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేరళ మంత్రి వర్గం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురంలో అత్యవసర సమావేశం కానుంది. ఇదిలా ఉంటే మోదీ కేరళ బయలుదేరారు. అలాగే కేరళలో నిర్వహించిన వలసిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు.