పుట్టింగల్ దేవి ఆలయ విశిష్టత
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనా భరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌లో మీనమ్ మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గుడిలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తుంటారు. అంతేకాదు మగవారు ఆడవారిలాగా అలంకరించుకొని దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత బాణాసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ.
ఈ ఏడాది కూడా లక్షలాదిమంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చారు. పూజలు చేసిన తర్వాత బాణాసంచాను కాల్చడం మొదలు పెట్టారు. అయితే ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పు రవ్వలు ఎగిసి పక్కనే ఉన్న... బాణాసంచాపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అలాగే దీపాల కోసం ఉంచిన నూనె కూడా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించి ఉండటం... ప్రమాదం జరిగిన సమయంలోనే ఎక్కువ మంది ఒకేచోట ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. నిమిషాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ప్రాణనష్టం భారీగా ఉందని తెలుస్తోంది.