కేరళలోని కొల్లాం వాసులు ‘కరోనా’కి జై కొడుతున్నారు. దేశ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనాకు ఎందుకు జై కొడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? వాళ్లు జేజేలు పలికేది కరోనా వైరస్‌కు కాదు. దీని వెనుక కథ తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..
తిరువనంతపురం: కరోనా వైరస్ మహామ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ప్రజలు ‘పో కరోనా పో’ అంటూ కరోనాపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ, కేరళలోని ఓ ప్రాంతం ప్రజలు ‘కరోనాకి జై’.. ‘కరోనా వర్ధిల్లాలి’ అంటున్నారు. అయితే ఈ జేజేలు మహామ్మారి పురుగు కరోనా వైరస్ కోసం కాదు! కార్పొరేషన్ ఎన్నికల బీజేపీ అభ్యర్థి ‘కరోనా థామస్’ కోసం. ఇంతకీ అసలు కథేంటంటే.. 24 ఏళ్ల కరోనా థామస్ కేరళలోని కొల్లాం ప్రాంతం వారు. తండ్రి థామస్ మాథ్యూ కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తి. అందుకే పుట్టిన కవల పిల్లలలో ఒకరి కోరల్ అని మరొకరికి కరోనా అని పేర్లు పెట్టాడు. గడిచిన ఇన్నేళ్లలో తన పేరు కారణంగా కరోనా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. (హాహాహా... ఊహించలేని సంఘటన ఇది! )
కానీ, ఈ కరోనా పరిస్థితుల్లో ఆమె పేరు విన్న వారు ఆమె వైపు విచిత్రంగా ఓ లుక్కేసేవారంట. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కరోనా బీజేపీ సానుభూతి పరుల ఇంట్లోకి అడుగుపెట్టారు. తాజాగా కొల్లాం కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కరోనా దూసుకుపోతున్నారు. అంతకు క్రితం వింతగా చూసిన జనం ప్రస్తుతం జైజైలు కొడుతున్నారు. అయితే కరోనా వైరస్ బారిన పడి క్రిమితో పోరాడి గెలిచిన కరోనా.. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతానేమోనన్న భయంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment