కేరళ నీట్ బాధితురాలు
తిరువనంతపురం: నీట్ పరీక్ష కోసం వెళ్లిన ఓ అభ్యర్థి చేదు అనుభవం.. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆ ఘటన దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్ట్ ఏజెన్సీ’ ఈ ఘటనను తోసిపుచ్చింది. విద్యార్థిని తండ్రి Gopakumar Sooranad ఆరోపణలను అసత్యప్రచారంగా కొట్టిపడేసింది. అయితే మంగళవారం మరో రెండు ఫిర్యాదులు అందడంతో.. నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవహారం మరింత ముదిరినట్లయ్యింది.
ఇదిలా ఉండగా.. బాధితురాలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అదొక చేదు అనుభవంగా చెప్పిన పదిహేడేళ్ల యువతి.. నీట్ సెంటర్ దగ్గర బలవంతంగా తమతో లోదుస్తులు విప్పించారని తెలిపింది. ‘స్కానింగ్ జరిగే దగ్గర కొందరు సిబ్బంది ఉన్నారు. అక్కడికి రమ్మని నాకు సైగ చేశారు. అక్కడ రెండు లైన్లలో అభ్యర్థులు నిల్చుని ఉన్నారు. నన్ను స్కాన్ చేశాక.. లోపలికి పంపిస్తారు అనుకున్నా. కానీ, ‘మెటల్ ఉన్న ఇన్నర్‌వేర్ వేస్కున్నావా?’ అని అడిగారు. ‘అవును’ అని సమాధానం ఇచ్చా. వెంటనే పక్కనే ఉన్న ఓ లైన్‌లో నిల్చొమన్నారు. అప్పుడు అర్థమైంది ఆ లైన్‌లో ఉన్నవాళ్లంతా మెటల్ హుక్ బ్రాలు ధరించిన వాళ్లేనని...
ఆ తర్వాత ఆ క్యూలో ఉన్న అందరినీ పక్కకు పిలిచి బ్రాలు తొలగించి.. టేబుల్ మీద పెట్టమన్నారు సిబ్బంది. పరీక్ష రాయడానికి బ్రాలు ఉండాల్సిన అవసరం లేదని, లేకుంటే లోపలికి పంపించమని అనడంతో మా అందరికీ సిగ్గుగా అనిపించింది. ఒక చీకటి గదిలోకి వెళ్లి అమ్మాయిలమంతా చెప్పినట్లు చేశాం. అదొక భయానక అనుభవం. గదిలో వెలుతురు లేదు.. లైట్ లేదు. అమ్మాయిలు.. అబ్బాయిలు అంతా ఒకే హాలులో పరీక్ష రాయాల్సి ఉంది. సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించి.. చాలామంది శాలువాలు, స్కార్ఫ్‌లు వేసుకుంటామని అడిగాం. కుదరదన్నారు. చేసేది లేక.. జుట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాశాం.
చాలామంది అవమానంగా, భయంభయంగా పరీక్ష రాశారు. నాతో సహా చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ ఇన్విజిలేటర్ సెక్యూరిటీతో వచ్చి.. ఎందుకు ఏడ్వడం అంటూ గట్టిగా గద్దించారు. పరీక్ష అయ్యాక బ్రాలను కుప్పలుగా పడేశారు. వెతుక్కోవడానికి చాలామంది అవస్థలు పడ్డారు. ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి రాకూడదు అంటూ ఏడుస్తూ.. చెప్పుకొచ్చింది యువతి.
ముక్తకంఠంతో ఖండన
కేరళ కొల్లాంలో నీట్ పరీక్షకు హాజరైన అమ్మాయిల లోదుస్తులు తొలగించిన ఘటనపై జాతీయ మహిళా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన సిగ్గు చేటని, అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశమని ప్రకటించింది. మూడు ఫిర్యాదులు నమోదు కావడంతో.. మళ్లీ తాజా దర్యాప్తును చేపట్టాలని కేరళ పోలీసులను విద్యాశాఖ మంత్రి డాక్టర్ బిందు ఆదేశించారు. మరోవైపు మానవ హక్కుల సంఘం సైతం ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిజనిర్ధారణ కమిటీ రెండు మూడు రోజుల్లో ఘటనపై దర్యాప్తు ప్రారంభించనుంది.
రేఖా శర్మ లేఖ
కేరళలో ఆదివారం ఓ నీట్ పరీక్ష కేంద్రంలో 17 ఏళ్ల అమ్మాయిని నిర్వాహకులు లో దుస్తులు విప్పించారన్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ తీవ్రంగా ఆగ్రహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు లేఖ రాశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు ఏజెన్సీ వ్యక్తులను, ఇద్దరు విద్యాసంస్థ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, నీట్ పరీక్షలో అభ్యర్థికి బదులు వేరొకరు పరీక్ష రాసేందుకు రూ.20 లక్షల చొప్పున ఒప్పందాలు జరిగాయని సీబీఐ విచారణలో తేలింది.
చదవండి: నీట్ పరీక్షకు ‘బ్రా’ వేసుకోకూడదా?.. గైడ్‌లైన్స్‌లో ఏముందంటే..
Comments
Please login to add a commentAdd a comment