నీతూ జోజో(ఫైల్)
ధ్వంసమైన నీతూ ఇల్లు
‘దయచేసి మమ్మల్ని రక్షించండి’ వణుకుతున్న గొంతుతో సహాయం కోసం నీతూ జోజో చేసిన ఆర్తనాదం కొందరి ప్రాణాలను రక్షించగలిగింది. వయనాడ్‌లో జూలై 30 వరదల సందర్భంగా సహాయం కోసం మొదట వచ్చిన ఫోన్ కాల్ నీతూ జోజోదే. ఆ కాల్ రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తన కుటుంబమే కాదు ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండేలా ప్రయత్నిస్తున్న క్రమంలోప్రాణాలు కోల్పోయింది నీతూ జోజో...
కేరళ వరదల (2018)పై గత సంవత్సరం వచ్చిన మలయాళ చిత్రం ‘2018’లో వరద బీభత్సం, చావుకు బతుకుకు మధ్య ఊగిసలాడిన బాధితుల దృశ్యాలు, వరద అనే అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన ఇండ్లు... ఒళ్లు జలదరింప చేసే దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి మించిన దృశ్యాలు వయనాడ్‌లో కనిపిస్తున్నాయి. ‘2018’ సినిమాలో ఇతరులను రక్షించాలని తపించిన వారిని ఉద్దేశించి ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ అనే పెద్ద అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. అలాంటి ఒక హీరో నీతూ జోజో.
నీతు వయనాడ్‌లోని మూపెన్స్ మెడికల్ కాలేజీలో నర్స్. ‘కొండచరియలు విరిగిపడ్డాయి. నేను ఇక్కడ పాఠశాల వెనకాల నివసిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలరా. మీకు ఫోన్ చేయడానికి ముందు నేను చాలామందికి ఫోన్ చేశాను’ అంటూ వెప్పడి గ్రామం నుంచి మూపెన్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది నీతు.
సిబ్బంది ఆమె నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని సహాయ బృందాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమీపంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలు తన ఇంట్లో ఆశ్రయం పొందారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తమ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఫోన్‌లో చెప్పింది నీతు.
‘ఆమె చాలా ఆందోళన, బాధతో ఫోన్ చేసింది. నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఆసుపత్రి నుంచి మా అంబులెన్స్ నీతు ఉంటున్నప్రాంతానికి బయలుదేరింది’ అంటుంది మూపెన్స్ మెడికల్ కాలేజీ డీజీఎం షనవాస్ పల్లియాల్.
అయితే చెట్లు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయింది. అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. దీంతో నీతూకు ధైర్యం చెప్పడానికి అంబులెన్స్ డ్రైవర్, ఇతర సిబ్బంది నాన్‌స్టాప్‌గా ఫోన్‌లు చేస్తూనే ఉన్నారు. రెండోసారి కొండ చరియలు విరిగిపడిన తరువాత ఫోన్ కనెక్షన్ కట్ అయింది. రోడ్లు బ్లాక్ కావడం, చూరలమాల వంతెన కొట్టుకుపోవడం వల్ల సహాయ సిబ్బంది నీతూ దగ్గరకు చేరుకోలేకపోయారు. భర్త, బిడ్డ, అత్త , ఇరుగు పొరుగు వారుప్రాణాలతో బయటపడినప్పటికీ నీతూ చనిపోయింది.
‘నేను నీతూకు ఫోన్ చేసినప్పుడు తాము మృత్యువు నుంచి తప్పించుకున్నామనే ధైర్యం ఆమె గొంతులో వినిపించింది. నీతూకు ధైర్యం ఇవ్వగలిగాం గానీ దురదృష్టవశాత్తు రక్షించలేకపోయాం’ అంటుంది షనవాస్ పల్లియాల్. ఆరోజు అర్ధరాత్రి దాటిన తరువాత... నెప్పడి గ్రామంలోని నీతు ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైంది. ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. ఒకవైపు తమను రక్షించమని ఫోన్ చేస్తూనే, మరోవైపు తన ఇంటి వారిని, పొరుగువారిని సురక్షితప్రాంతానికి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.
అయితే తెల్లవారుజామున నాలుగు గంటలప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో మృత్యువు చెంతకు వచ్చింది. ఇక ఎంతమాత్రం తప్పించుకోలేని పరిస్థితి. నీతూతో పాటు ముగ్గురిప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.
‘మా ఇంట్లో ఉంటే సురక్షితం అని మమ్మల్ని తీసుకువెళ్లడమే కాదు. మాకు ధైర్యం చెప్పింది. ఇలా అవుతుందని అనుకోలేదు’ అని నీతును గుర్తు తెచ్చుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది పొరుగింటి మహిళ.
‘నీతూ ఫోన్ కాల్ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వచ్చింది’ శోకతప్త హృదయంతో అంటుంది నీతూతో కలిసి మూపెన్స్ మెడికల్ కాలేజీలో పనిచేసిన ఉద్యోగి.
బీభత్సాలు జరిగినప్పుడు తమప్రాణాలు అడ్డేసి ఇతరులప్రాణాలు కాపాడేవారు ఉంటారు. నీతు జోసెఫ్‌ను వయనాడ్ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment