కంటి ఉప్పెనను నవ్వుతో కప్పేసి
వాయినాడ్ విలయం
ధైర్యంగా ఉండాలి. ఆశ నిలపాలి. స్థైర్యాన్ని కూడగట్టుకోవాలి. జూలై 30న వాయనాడ్ వరదల్లో శ్రుతి చూసిన నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారం నీటి పాలయ్యాయి. ఆఖరికు చేసుకోవాల్సిన కుర్రాడు కూడా యాక్సిడెంట్‌లో మరణించాడు. అయినప్పటికీ ఎందరో ఆమెకు తోడుగా నిలిచారు. శ్రుతి విధిని ఎదిరించి నిలబడింది. మొన్నటి సోమవారం ప్రభుత్వ ఉద్యోగిగా నియమితురాలై తన సీటులో కూచుని నవ్వింది.
సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఇలా రాశారు ‘వాయనాడ్ వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన శ్రుతికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చాం. ఇవాళ మా మాట నెరవేర్చాం’ అని ఉంది అందులో. వాయనాడ్ కలక్టరెట్‌లోని కంప్యూటర్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా బాధ్యతలు తీసుకుని చిరునవ్వుతో చూస్తున్న శ్రుతి ఫొటోను విజయన్ తన వ్యాఖ్యకు జత చేయడం వల్ల నెటిజన్స్ అందరూ ఆ ఫొటోలోని శ్రుతిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ సమయంలో మా అమ్మా నాన్నలేరు. నాకు కావలసిన భర్త కూడా లేరు. అందుకు నాకు బాధగా ఉంది. కాని జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని తెలుసుకుని ఆ విధంగా కొనసాగినందుకు సంతోషంగా ఉన్నాను’ అందామె. 24 ఏళ్ల శ్రుతి కచ్చితంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె కోసం కేరళ అంతా తోడుగా నిలిచింది.
ఇకపై నిలిచే ఉంటుంది. ఒక ధైర్యం సాటి మనిషి కల్పిస్తే బాధలో ఉన్న వ్యక్తి కోలుకుంటారనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. అలాగే దు:ఖంలో ఉన్న వ్యక్తి ధైర్యం సడలనివ్వకుండా ఉంటే సమాజం తోడు నిలిచి ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటుందనడానికి కూడా ఈ ఘటనే ఉదాహరణ.
వాయనాడ్‌లో ఆమె
వాయనాడ్‌లోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న శ్రుతి తనకు బాల్య స్నేహితుడైన జాన్సన్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. వారివి వేరు వేరు మతాలైనా ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. సెప్టెంబర్, 2024లో పెళ్లి అనుకుంటే జూన్ 1 వాళ్లు వాయనాడ్ సమీపంలోని సొంత ఇంటికి మారారు. జూన్ 2న శ్రుతికి, జాన్సన్‌కు నిశ్చితార్థం అయ్యింది. అంతా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉండగా జూన్ 30న వరదలు చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగి పడ్డాయి.
ఆ సమయానికి శ్రుతి వాయనాడ్‌లో ఉండటం వల్ల ఆమె తప్ప కుటుంబంలోని 15 మంది మృత్యువు పాలయ్యారు. అదొక్కటే కాదు పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచి పెట్టిన బంగారం, 4 లక్షల నగదు మొత్తం వరద నాలయ్యాయి. ఇల్లు కూలిపోయింది.
ఈ విషాదంలో శ్రుతి స్తంభించిపోయింది. అయితే జాన్సన్ ఆ సమయంలో ఆమెకు కొండంత అండగా ఉన్నాడు. ధైర్యం చెప్పాడు. ‘నీ దగ్గర రూపాయి లేకపోయినా నేను వివాహం చేసుకుంటా... నిన్ను సంతోషంగా ఉంచుతా’ అని మాట ఇచ్చాడు. అందరూపోయినా జాన్సన్ ఉన్నందుకు ఆమె కార్చే కన్నీటిలో ఒక చిన్న ఆశాకిరణాన్ని నిలబెట్టుకుంది.
కోల్పోయిన ఆ తోడు
అయితే విధి మరోసారి శ్రుతి మీద పగబట్టింది. సెప్టెంబర్ మొదటి వారంలో తన బంధువుల సమాధులను (వాయనాడ్ వరద మృతులు) చూసి వద్దామని వ్యాన్‌లో జాన్సన్ బయలుదేరి తోడుగా శ్రుతిని, బంధువులను తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే ఆ వ్యాన్‌కు యాక్సిడెంట్ అయ్యింది. డ్రైవ్ చేస్తున్న జాన్సన్ దుర్మరణం పాలయ్యాడు.
కదలిన కేరళ
ఈ ఉదంతం తెలిసిన వెంటనే కేరళ మొత్తం కదిలింది. అందరూ శ్రుతి ఫొటోను తమ ఫోన్ల డీపీలుగా పెట్టుకుని ‘నీకు మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. వందలాది వేలాది మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్‌ఏలు వచ్చి పలుకరించి ధైర్యం చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఇవన్నీ శ్రుతిని నిలబెట్టాయి. ఇప్పుడు తను ప్రభుత్వ ఉద్యోగిని అయ్యింది. మర్చిపోయిన నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంది. కాలం దయతో చూడాలి అందరినీ. అది ఇక్కట్లపాలు చేసినా వెలుతురు తీసుకువస్తుంది.
(చదవండి: రణబీర్ కపూర్‌కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?)
Comments
Please login to add a commentAdd a comment