neetu
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఆమె గొంతుక.. మన గుండెల్లో..!
‘దయచేసి మమ్మల్ని రక్షించండి’ వణుకుతున్న గొంతుతో సహాయం కోసం నీతూ జోజో చేసిన ఆర్తనాదం కొందరి ప్రాణాలను రక్షించగలిగింది. వయనాడ్‌లో జూలై 30 వరదల సందర్భంగా సహాయం కోసం మొదట వచ్చిన ఫోన్ కాల్ నీతూ జోజోదే. ఆ కాల్ రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తన కుటుంబమే కాదు ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండేలా ప్రయత్నిస్తున్న క్రమంలోప్రాణాలు కోల్పోయింది నీతూ జోజో...కేరళ వరదల (2018)పై గత సంవత్సరం వచ్చిన మలయాళ చిత్రం ‘2018’లో వరద బీభత్సం, చావుకు బతుకుకు మధ్య ఊగిసలాడిన బాధితుల దృశ్యాలు, వరద అనే అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన ఇండ్లు... ఒళ్లు జలదరింప చేసే దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి మించిన దృశ్యాలు వయనాడ్‌లో కనిపిస్తున్నాయి. ‘2018’ సినిమాలో ఇతరులను రక్షించాలని తపించిన వారిని ఉద్దేశించి ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ అనే పెద్ద అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. అలాంటి ఒక హీరో నీతూ జోజో.నీతు వయనాడ్‌లోని మూపెన్స్ మెడికల్ కాలేజీలో నర్స్. ‘కొండచరియలు విరిగిపడ్డాయి. నేను ఇక్కడ పాఠశాల వెనకాల నివసిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలరా. మీకు ఫోన్ చేయడానికి ముందు నేను చాలామందికి ఫోన్ చేశాను’ అంటూ వెప్పడి గ్రామం నుంచి మూపెన్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది నీతు.సిబ్బంది ఆమె నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని సహాయ బృందాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమీపంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలు తన ఇంట్లో ఆశ్రయం పొందారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తమ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఫోన్లో చెప్పింది నీతు.‘ఆమె చాలా ఆందోళన, బాధతో ఫోన్ చేసింది. నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఆసుపత్రి నుంచి మా అంబులెన్స్ నీతు ఉంటున్నప్రాంతానికి బయలుదేరింది’ అంటుంది మూపెన్స్ మెడికల్ కాలేజీ డీజీఎం షనవాస్ పల్లియాల్.అయితే చెట్లు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయింది. అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. దీంతో నీతూకు ధైర్యం చెప్పడానికి అంబులెన్స్ డ్రైవర్, ఇతర సిబ్బంది నాన్‌స్టాప్‌గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రెండోసారి కొండ చరియలు విరిగిపడిన తరువాత ఫోన్ కనెక్షన్ కట్ అయింది. రోడ్లు బ్లాక్ కావడం, చూరలమాల వంతెన కొట్టుకుపోవడం వల్ల సహాయ సిబ్బంది నీతూ దగ్గరకు చేరుకోలేకపోయారు. భర్త, బిడ్డ, అత్త , ఇరుగు పొరుగు వారుప్రాణాలతో బయటపడినప్పటికీ నీతూ చనిపోయింది.‘నేను నీతూకు ఫోన్ చేసినప్పుడు తాము మృత్యువు నుంచి తప్పించుకున్నామనే ధైర్యం ఆమె గొంతులో వినిపించింది. నీతూకు ధైర్యం ఇవ్వగలిగాం గానీ దురదృష్టవశాత్తు రక్షించలేకపోయాం’ అంటుంది షనవాస్ పల్లియాల్. ఆరోజు అర్ధరాత్రి దాటిన తరువాత... నెప్పడి గ్రామంలోని నీతు ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైంది. ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. ఒకవైపు తమను రక్షించమని ఫోన్ చేస్తూనే, మరోవైపు తన ఇంటి వారిని, పొరుగువారిని సురక్షితప్రాంతానికి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.అయితే తెల్లవారుజామున నాలుగు గంటలప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో మృత్యువు చెంతకు వచ్చింది. ఇక ఎంతమాత్రం తప్పించుకోలేని పరిస్థితి. నీతూతో పాటు ముగ్గురిప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.‘మా ఇంట్లో ఉంటే సురక్షితం అని మమ్మల్ని తీసుకువెళ్లడమే కాదు. మాకు ధైర్యం చెప్పింది. ఇలా అవుతుందని అనుకోలేదు’ అని నీతును గుర్తు తెచ్చుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది పొరుగింటి మహిళ.‘నీతూ ఫోన్ కాల్ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వచ్చింది’ శోకతప్త హృదయంతో అంటుంది నీతూతో కలిసి మూపెన్స్ మెడికల్ కాలేజీలో పనిచేసిన ఉద్యోగి.బీభత్సాలు జరిగినప్పుడు తమప్రాణాలు అడ్డేసి ఇతరులప్రాణాలు కాపాడేవారు ఉంటారు. నీతు జోసెఫ్‌ను వయనాడ్ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్ పోరు
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్‌లో లుత్సయ్ఖాన్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్ ప్రపంచ చాంపియన్‌లో నీతూ తొలిసారి ఫైనల్‌కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు. -
నిఖత్ పంచ్ అదిరె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షి ప్లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 5–0తో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించిన వలెన్సియాను నిఖత్ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్‌లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్ మూడో రౌండ్లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది. 2 ఒకే ప్రపంచ చాంపియన్‌షి ప్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 3 మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి ప్లో కనీసం రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్ ఏకంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం సాధించింది. నిఖత్ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్‌కు చేరారు. నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో లుత్సయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)తో నిఖత్ జరీన్... కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. -
రెండో రౌండ్లో భారత బాక్సర్ నీతూ
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నీతూ శుభారంభం చేసింది. ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం తొలి రౌండ్లో నీతూ 5–0తో స్టెలుటా దుతా (రొమేనియా)పై నెగ్గింది. నేడు జరిగే బౌట్లలో హెరెరా (మెక్సికో)తో నిఖత్ జరీన్ (51 కేజీలు), కళా థాపా (నేపాల్)తో మనీషా (57 కేజీలు), మరియా బోవా (ఉక్రెయిన్)తో పర్వీన్ (63 కేజీలు), కెర్రీ డేవిస్ (ఇంగ్లండ్)తో సవీటి (75 కేజీలు) పోటీపడతారు. -
Neetu Yadav And Kirti Jangra: బర్రెలు అమ్మే బిజినెస్.. 2500 కోట్ల అమ్మకాలు!
‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?’ నీతూ యాదవ్, కీర్తి జంగ్రాలను అందరూ ఇదే అడిగారు. ఇద్దరూ ఢిల్లీ ఐఐటిలో చదివారు. ఒకటి రెండు ఉద్యోగాలు చేశారు. మానేసి ఆన్లైన్లో పశువుల సంత పెడతామంటున్నారు. ‘మీకేమైనా పిచ్చా?’ ‘బుద్ధి గడ్డి తింది’ ‘చదివాక పిసలు అన్నారట’ ఎన్నో కామెంట్స్... కాని ఈ ఇద్దరు అమ్మాయిలు ‘యానిమాల్’ అనే యాప్ తయారు చేశారు. 2019లో మొదలెట్టారు. ఇప్పటికి 2500 కోట్ల విలువైన పశు అమ్మకాలు సాగించారు. IITians Neetu Yadav And Kirti Jangra: అది 2019. నీతూ యాదవ్ బెంగళూరు నుంచి జైపూర్‌లో ఫ్లయిట్ దిగింది. సెప్టెంబర్ నెల. జల్లు పడుతోంది. నీతూ బుర్రలో కూడా ఆలోచనల జల్లు కురుస్తోంది. బెంగళూరులో ఆన్లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం మానేసి జైపూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతవూరు నవల్పూరుకు వెళుతోందామె. అక్కడ ఏం చేయాలో తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. మరోవైపు అదే సమయానికి హర్యానాలోని హిసార్ పట్టణంలో కీర్తి జంగ్రా నివాసం కోలాహలంగా ఉంది. కీర్తికి అమెరికాలో ఉన్నత చదువులకు సీట్ వచ్చింది. ఆమె అమెరికాకు వెళ్లనున్నందున తల్లిదండ్రులు బంధువులను పిలిచి చిన్న పార్టీ అరేంజ్ చేశారు. కాని కీర్తి మనసులో ఏముందో తెలిస్తే వారి రియాక్షన్ ఏమిటో. రియాక్షన్ ఎలా ఉన్నా నిర్ణయం చెప్పాల్సిందే కదా. ‘ఆన్లైన్లో పశువులు అమ్ముతాం’... ఇదీ నీతూ యాదవ్, కీర్తి జంగ్రా తమ ఇళ్లల్లో చెప్పింది. వాళ్లిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. రూమ్మేట్స్. జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నో కలలు కన్నారు. ఐఐటి అయ్యాక నీతూ బెంగళూరులో ‘ప్రతిలిపి’లో పని చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్గావ్లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్‌లో పని చేయడానికి వెళ్లింది. ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఇద్దరికీ తాము చేస్తున్న ఉద్యోగాలు అంత సంతృప్తినివ్వడం లేదు. ఏదైనా సొంతగా సాధించాలనే తపన. నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు. నీతూకు పశువులతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కీర్తి తండ్రి టీచర్. కాని అతని మేనమామలు పాడి రైతులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పశువుల సంతలు చూశారు. పశువుల లావాదేవీల సమయంలో రైతుల హైరానా చూశారు. ఇద్దరికీ ఒకేసారి ‘అసలు ఆన్లైన్లో పశువులు ఎందుకు అమ్మకూడదు’ అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం ఎదురైంది.పశువులంటే ఉప్పులో పప్పులో కాదు. బట్టలు కాదు ఆన్లైన్లో కొనడానికి. రైతులు సంతకు వచ్చి ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కుంటారు. మరి ఆన్లైన్లో వీళ్లు ఎలా అమ్ముతారు? ఇదే ప్రశ్న అందరూ వేశారు ఇద్దరినీ. వాళ్లు సమాధానం చెప్పలేదు. చివరకు ఇద్దరి ఇళ్లలోనూ ‘సరే.. మీకు నచ్చిందే చేయండి’ అన్నారు. 2019 చివరలో బెంగళూరులో 11 వేల రూపాయల అద్దెతో ఒక చిన్న గది నుంచి నుంచి నీతూ, కీర్తిల ‘యానిమాల్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. ‘యానిమల్’ పశువు. ‘యానిమాల్’ పశువుల సంత. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. వర్చువల్ సంత. కొనాలనుకున్న రైతు అమ్మాలనుకున్న రైతు వీళ్లు తయారు చేసిన ‘యానిమాల్’ ద్వారా లావాదేవీలు ముగించవచ్చు. ‘అసలు జనం టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి కాలక్షేపం యాప్‌లను కాకుండా పనికొచ్చే ఉపాధికి అవసరమయ్యే యాప్‌లను ఎందుకు చూడరు. దేశంలో 30 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ఏడున్నర కోట్ల పాడి రైతుల దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఇది పెద్ద మార్కెట్. ఆన్లైన్ అమ్మకాలలో వీటిని తేవచ్చునని చాలామంది అనుకోలేదు. ఎందుకంటే సంప్రదాయ సంతల్లోనే వీటి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. కాని మేము వీటిని ఆన్లైన్లో తేదలుచుకున్నాం. యాప్ తయారు చేశాం. సక్సెస్ అయ్యాం’ అంటుంది నీతూ యాదవ్. అయితే ఇలా సక్సెస్ కావడం అంత సులభం కాలేదు. 2019 చివరి వరకూ వీళ్లు కేవలం 50 పశువులే తమ యాప్ ద్వారా అమ్మారు. కాని 2020లో లాక్డౌన్ వచ్చాక వీరి యాప్ ఊపందుకుంది. దీనిని రైతుల సౌలభ్యం కోసం హిందీలో కూడా డెవలప్ చేశారు. దాంతో రాజస్థాన్‌లోనే ఐదులక్షల మంది పాడిరైతులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్లలో యానిమాల్ కార్యకలాపాలు విస్తరించాయి. 2020 నవంబర్ నాటికి 30 వేల పశువుల లావాదేవీలు సాగితే డిసెంబర్‌కు వాటి సంఖ్య 40 వేలు అయ్యింది. 2021 నుంచి సగటున నెలకు 50 వేల పశువులు ‘యానిమాల్’ ద్వారా అమ్మకమో కొనుగోలో జరుగుతోంది. ఇప్పటికి 80 లక్షల మంది రైతులు ‘యానిమాల్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘ఇన్వెస్టర్లు భారీగా మాకు ఫండ్ చేయడానికి ముందుకు వచ్చారు. చేశారు కూడా’ అని మెరుస్తున్న కళ్లతో అంటుంది కీర్తి. ఇప్పటికి 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి దక్కాయి. కీర్తి, నీతూ చేసింది ఏమిటంటే అమ్మే రైతును, కొనే రైతును అనుసంధానం చేయడమే. ‘మేం చెప్పామని కొనొద్దు. పాలు పితికి చూసి మరీ తీసుకోండి’ అని వీరు అంటారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు. అలాగే పాడిరైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తారు. పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో కూడా తెలియ చేస్తారు. ఉత్తర భారతదేశంలో యానిమాల్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది. ఇది రైతుల మాటే. ‘ఇలా మేము ఎప్పుడూ పశువులను కొనలేదు’ అని వారు అంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక కొత్త ఆలోచన మెరిపించారు. అది ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కారణమైంది. ‘నీ తెలివి సంతకెళ్లా’ అనేది మనకు తిట్టు. కాని తెలివి నిజంగా సంతకెళితే ఏమవుతుందో చూశారుగా! -
బిగ్‌బాస్: వైభవంగా నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం.. ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ గర్భవతి అనే సంగతి తెలిసిందే. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్ షోలోకి వెళ్లాడు. తొలుత వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ భార్య ఫోర్స్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు షో ప్రారంభం రోజు నటరాజ్ మాస్టర్ చెప్పారు. తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు కానీ బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తాను అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. తాజాగా నీతూకు సీమంతం జరిపారు కుటుంబ సభ్యులు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలునవీన, శ్రీవాణి,అంజలి పవన్, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం సీమంతంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్ మాస్టర్ టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులందరితో కలిసి పని చేశాడు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన భార్య నీతూతో కలిసి టీవీ షోలు, ఆడియో మరియు అవార్డు ఫంక్షన్లు వంటి 200 కి పైగా కార్యక్రమాలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు బిగ్ బాస్ ఐదో సీజన్లోకి వెళ్లాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.
జోధ్‌పూర్: హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు. ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెనుకడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్ లక్ష్యమన్నారు. -
మందు పార్టీ ఇచ్చి... చంపేసింది
న్యూఢిల్లీ : సహ జీవనం చేస్తున్న వ్యక్తి పెట్టే బాధలు తట్టుకోలేక ఓ మహిళ...అతడిని హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం నీతూతో కలసి యోగేంద్ర సింగ్ ఆరేళ్లుగా కలసి జీవిస్తున్నాడు. ఏనాడు రూపాయి సంపాదించేవాడు కాదు. పైగా డబ్బులు కావాలంటూ ఆమెను వేధించేవాడు. ఒక్కోరోజు పీకలదాకా తాగి వచ్చి మరీ ఆమెను తన్నేవాడు. అంతే కాకుండా విపరీతంగా అప్పులు చేసేవాడు. అతడి హింసను తట్టుకోలేపోయింది. దీంతో అతన్ని వదిలించుకునేందు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు సహకరించమని నీతూ... తన 18 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ రోహిత్, పొరుగింట్లో నివసించే ఆశాను కోరింది. అందుకు సహకరించేందుకు వారు ఒప్పుకున్నారు. దీంతో రీతూ మంగళవారం రాత్రి ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. మందు చూసే సరికి యోగేంద్ర సింగ్ రెచ్చిపోయాడు. ముందు ఫూట్‌గా లాగించేసి... పడిపోయాడు. నీతూ ఆమె స్నేహితులు కలసి మత్తులో పడివున్న సింగ్ గొంతు నులుమి హత్య చేశారు. బుధవారం తెల్లవారుజామున కారులో అతడి మృతదేహన్ని తీసుకువెళ్లి ఔటర్ ఢిల్లీలోని నిర్మానుష్య ప్రాంతమైన డీడీఏ ఫ్లాట్స్ సమీపంలో పడేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు సింగ్ ముఖాన్ని బండరాయితో కొట్టారు. అనంతరం ఏమి తెలియనట్లు నీతూ అండ్ కో ఇంటికి వెళ్లిపోయారు. అయితే డీడీఏ ఫ్లాట్స్ వాసులు మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని యోగేంద్ర సింగ్‌దిగా గుర్తించి... అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు యోగేంద్ర సింగ్ మృతదేహన్ని గుర్తించి.... ఆరేళ్లుగా నీతూ అనే మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. పోలీసులు వెంటనే నీతూను అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో ప్రశ్నించారు. అంతే హత్యకు దారి తీసిన పరిస్థితులు... ఎలా హత్య చేసింది అంతా కళ్లకు కట్టినట్లు వివరించింది. పోలీసులు ..హత్యకు సహకరించిన అందరినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి... జ్యుడీషియల్ రిమాండ్‌కి తరలించారు. -
పసుపు రంగు గౌను
తపాలా నా పేరు నీతు. మాది కదిరి, అనంతపురం జిల్లా. నాకు ఒక ముద్దుల చెల్లి ఉంది. తన పేరు ఫరా. మా చెల్లికి అప్పుడు మూడేళ్లు. తనకీ నాకూ ఒకేలాంటి పసుపు రంగు గౌను ఉండేది. ఏమంటే నాది కాస్త పొడవుగా, తనది కాస్త పొట్టిగా! ఒకరోజు ఏమైందంటే, పెళ్లికి వెళ్లడానికి అమ్మ చెల్లినీ, నన్నూ తయారుచేస్తోంది. చెల్లి ఏమో నా పసుపు గౌను కావాలని మారాం చేస్తోంది. అమ్మ ఏమో, ‘అది నీకు పొడవు అవుతుంది, ఆడుకునే సమయంలో తట్టుకుని పడుతావు, వద్దు,’ అని చెబుతోంది. కానీ చెల్లి మాత్రం మాట వినడం లేదు. దాంతో అమ్మకు కోపం వచ్చి నాలుగు తగిలించింది. ఇంక చెల్లి ఒక గదిలోకి ఏడుస్తూ వెళ్లి, తలుపు పెట్టుకుంది. అమ్మ నన్ను తయారుచేస్తూ తనని పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత, అమ్మకు చెల్లి గుర్తుకొచ్చింది. గొళ్లెం పెట్టుకున్న రూమ్ దగ్గరకెళ్లి, చాలాసార్లు గట్టిగా ‘ఫరా’, ‘ఫరా’ అని కేకపెట్టింది. తను మాత్రం ఉలుకు పలుకు లేదు. దాంతో అమ్మకు చాలా భయమేసింది. పక్కింటివాళ్లను పిలిచింది. వాళ్లు కూడా వచ్చి చాలాసార్లు పిలిచారు, తలుపు తట్టారు కాని ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అందరం చాలా కంగారపడిపోయాం. నాన్నేమో ఆఫీసులో ఉన్నారు. అప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా లేదు విషయం చెబుదామంటే. నాన్న పనిచేసే ఊరికి, ఒక జీపు వెళ్తుంటే, వారికి చెప్పి పంపింది అమ్మ. నాన్న కంగారుతో అప్పటికప్పుడు అదే జీపులో బయలుదేరారు. నాన్న ఇక తలుపు పగలగొట్టడానికి ఒక గడారు కూడా తీసుకొచ్చారు. కానీ అందరం ఆపాం. దాంతో గదికి ఉన్న కిటికీ అద్దాన్ని పగులగొట్టారు. తీరాచూస్తే, తను చక్కగా గాఢనిద్రలో ఉంది. అద్దం ముక్కలు తనపై పడటంతో కాస్త కదిలింది. నాన్న ఊపిరి పీల్చుకున్నారు. నాన్న చాలా ప్రేమగా, ‘బంగారూ బయటికి రా! మనం చాక్లెట్, ఐస్‌క్రీమ్ తిందాం’ అన్నారు. దాంతో తను నిద్రలేచి మెల్లిగా గడియ తీసింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నాన్నేమో ప్రేమతో చెల్లికి ముద్దులు పెట్టారు, అమ్మకు మాత్రం చీవాట్లు పడ్డాయి. - నీతు కదిరి, అనంతపురం జిల్లా