పసుపు రంగు గౌను
తపాలా
నా పేరు నీతు. మాది కదిరి, అనంతపురం జిల్లా. నాకు ఒక ముద్దుల చెల్లి ఉంది. తన పేరు ఫరా. మా చెల్లికి అప్పుడు మూడేళ్లు. తనకీ నాకూ ఒకేలాంటి పసుపు రంగు గౌను ఉండేది. ఏమంటే నాది కాస్త పొడవుగా, తనది కాస్త పొట్టిగా!
ఒకరోజు ఏమైందంటే, పెళ్లికి వెళ్లడానికి అమ్మ చెల్లినీ, నన్నూ తయారుచేస్తోంది. చెల్లి ఏమో నా పసుపు గౌను కావాలని మారాం చేస్తోంది. అమ్మ ఏమో, ‘అది నీకు పొడవు అవుతుంది, ఆడుకునే సమయంలో తట్టుకుని పడుతావు, వద్దు,’ అని చెబుతోంది. కానీ చెల్లి మాత్రం మాట వినడం లేదు. దాంతో అమ్మకు కోపం వచ్చి నాలుగు తగిలించింది. ఇంక చెల్లి ఒక గదిలోకి ఏడుస్తూ వెళ్లి, తలుపు పెట్టుకుంది. అమ్మ నన్ను తయారుచేస్తూ తనని పట్టించుకోలేదు.
కొద్దిసేపటి తర్వాత, అమ్మకు చెల్లి గుర్తుకొచ్చింది. గొళ్లెం పెట్టుకున్న రూమ్ దగ్గరకెళ్లి, చాలాసార్లు గట్టిగా ‘ఫరా’, ‘ఫరా’ అని కేకపెట్టింది. తను మాత్రం ఉలుకు పలుకు లేదు. దాంతో అమ్మకు చాలా భయమేసింది. పక్కింటివాళ్లను పిలిచింది. వాళ్లు కూడా వచ్చి చాలాసార్లు పిలిచారు, తలుపు తట్టారు కాని ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అందరం చాలా కంగారపడిపోయాం. నాన్నేమో ఆఫీసులో ఉన్నారు. అప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా లేదు విషయం చెబుదామంటే. నాన్న పనిచేసే ఊరికి, ఒక జీపు వెళ్తుంటే, వారికి చెప్పి పంపింది అమ్మ.
నాన్న కంగారుతో అప్పటికప్పుడు అదే జీపులో బయలుదేరారు.
నాన్న ఇక తలుపు పగలగొట్టడానికి ఒక గడారు కూడా తీసుకొచ్చారు. కానీ అందరం ఆపాం. దాంతో గదికి ఉన్న కిటికీ అద్దాన్ని పగులగొట్టారు. తీరాచూస్తే, తను చక్కగా గాఢనిద్రలో ఉంది. అద్దం ముక్కలు తనపై పడటంతో కాస్త కదిలింది. నాన్న ఊపిరి పీల్చుకున్నారు. నాన్న చాలా ప్రేమగా, ‘బంగారూ బయటికి రా! మనం చాక్లెట్, ఐస్‌క్రీమ్ తిందాం’ అన్నారు. దాంతో తను నిద్రలేచి మెల్లిగా గడియ తీసింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నాన్నేమో ప్రేమతో చెల్లికి ముద్దులు పెట్టారు, అమ్మకు మాత్రం చీవాట్లు పడ్డాయి.
- నీతు కదిరి, అనంతపురం జిల్లా