మందు పార్టీ ఇచ్చి... చంపేసింది
న్యూఢిల్లీ : సహ జీవనం చేస్తున్న వ్యక్తి పెట్టే బాధలు తట్టుకోలేక ఓ మహిళ...అతడిని హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం నీతూతో కలసి యోగేంద్ర సింగ్ ఆరేళ్లుగా కలసి జీవిస్తున్నాడు. ఏనాడు రూపాయి సంపాదించేవాడు కాదు. పైగా డబ్బులు కావాలంటూ ఆమెను వేధించేవాడు. ఒక్కోరోజు పీకలదాకా తాగి వచ్చి మరీ ఆమెను తన్నేవాడు. అంతే కాకుండా విపరీతంగా అప్పులు చేసేవాడు. అతడి హింసను తట్టుకోలేపోయింది. దీంతో అతన్ని వదిలించుకునేందు ప్రణాళిక సిద్ధం చేసింది.
అందుకు సహకరించమని నీతూ... తన 18 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ రోహిత్, పొరుగింట్లో నివసించే ఆశాను కోరింది. అందుకు సహకరించేందుకు వారు ఒప్పుకున్నారు. దీంతో రీతూ మంగళవారం రాత్రి ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. మందు చూసే సరికి యోగేంద్ర సింగ్ రెచ్చిపోయాడు. ముందు ఫూట్గా లాగించేసి... పడిపోయాడు. నీతూ ఆమె స్నేహితులు కలసి మత్తులో పడివున్న సింగ్ గొంతు నులుమి హత్య చేశారు.
బుధవారం తెల్లవారుజామున కారులో అతడి మృతదేహన్ని తీసుకువెళ్లి ఔటర్ ఢిల్లీలోని నిర్మానుష్య ప్రాంతమైన డీడీఏ ఫ్లాట్స్ సమీపంలో పడేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు సింగ్ ముఖాన్ని బండరాయితో కొట్టారు. అనంతరం ఏమి తెలియనట్లు నీతూ అండ్ కో ఇంటికి వెళ్లిపోయారు. అయితే డీడీఏ ఫ్లాట్స్ వాసులు మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని యోగేంద్ర సింగ్దిగా గుర్తించి... అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు యోగేంద్ర సింగ్ మృతదేహన్ని గుర్తించి.... ఆరేళ్లుగా నీతూ అనే మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. పోలీసులు వెంటనే నీతూను అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో ప్రశ్నించారు. అంతే హత్యకు దారి తీసిన పరిస్థితులు... ఎలా హత్య చేసింది అంతా కళ్లకు కట్టినట్లు వివరించింది. పోలీసులు ..హత్యకు సహకరించిన అందరినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి... జ్యుడీషియల్ రిమాండ్కి తరలించారు.