ఆన్‌లైన్‌లో పశువుల సంతను విజయవంతంగా నిర్వహిస్తున్న నీతూ యాదవ్, కీర్తి జంగ్రా
‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?’ నీతూ యాదవ్, కీర్తి జంగ్రాలను అందరూ ఇదే అడిగారు. ఇద్దరూ ఢిల్లీ ఐఐటిలో చదివారు. ఒకటి రెండు ఉద్యోగాలు చేశారు. మానేసి ఆన్‌లైన్‌లో పశువుల సంత పెడతామంటున్నారు. ‘మీకేమైనా పిచ్చా?’ ‘బుద్ధి గడ్డి తింది’ ‘చదివాక పిసలు అన్నారట’ ఎన్నో కామెంట్స్... కాని ఈ ఇద్దరు అమ్మాయిలు ‘యానిమాల్’ అనే యాప్ తయారు చేశారు. 2019లో మొదలెట్టారు. ఇప్పటికి 2500 కోట్ల విలువైన పశు అమ్మకాలు సాగించారు.
IITians Neetu Yadav And Kirti Jangra: అది 2019. నీతూ యాదవ్ బెంగళూరు నుంచి జైపూర్‌లో ఫ్లయిట్ దిగింది. సెప్టెంబర్ నెల. జల్లు పడుతోంది. నీతూ బుర్రలో కూడా ఆలోచనల జల్లు కురుస్తోంది. బెంగళూరులో ఆన్‌లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం మానేసి జైపూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతవూరు నవల్‌పూరుకు వెళుతోందామె. అక్కడ ఏం చేయాలో తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది.
మరోవైపు అదే సమయానికి హర్యానాలోని హిసార్ పట్టణంలో కీర్తి జంగ్రా నివాసం కోలాహలంగా ఉంది. కీర్తికి అమెరికాలో ఉన్నత చదువులకు సీట్ వచ్చింది. ఆమె అమెరికాకు వెళ్లనున్నందున తల్లిదండ్రులు బంధువులను పిలిచి చిన్న పార్టీ అరేంజ్ చేశారు. కాని కీర్తి మనసులో ఏముందో తెలిస్తే వారి రియాక్షన్ ఏమిటో. రియాక్షన్ ఎలా ఉన్నా నిర్ణయం చెప్పాల్సిందే కదా.
‘ఆన్‌లైన్‌లో పశువులు అమ్ముతాం’... ఇదీ నీతూ యాదవ్, కీర్తి జంగ్రా తమ ఇళ్లల్లో చెప్పింది. వాళ్లిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. రూమ్మేట్స్. జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నో కలలు కన్నారు. ఐఐటి అయ్యాక నీతూ బెంగళూరులో ‘ప్రతిలిపి’లో పని చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్‌గావ్‌లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్‌లో పని చేయడానికి వెళ్లింది. ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఇద్దరికీ తాము చేస్తున్న ఉద్యోగాలు అంత సంతృప్తినివ్వడం లేదు. ఏదైనా సొంతగా సాధించాలనే తపన.
నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు. నీతూకు పశువులతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కీర్తి తండ్రి టీచర్. కాని అతని మేనమామలు పాడి రైతులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పశువుల సంతలు చూశారు. పశువుల లావాదేవీల సమయంలో రైతుల హైరానా చూశారు. ఇద్దరికీ ఒకేసారి ‘అసలు ఆన్‌లైన్‌లో పశువులు ఎందుకు అమ్మకూడదు’ అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం ఎదురైంది.పశువులంటే ఉప్పులో పప్పులో కాదు. బట్టలు కాదు ఆన్‌లైన్‌లో కొనడానికి. రైతులు సంతకు వచ్చి ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కుంటారు. మరి ఆన్‌లైన్‌లో వీళ్లు ఎలా అమ్ముతారు? ఇదే ప్రశ్న అందరూ వేశారు ఇద్దరినీ. వాళ్లు సమాధానం చెప్పలేదు. చివరకు ఇద్దరి ఇళ్లలోనూ ‘సరే.. మీకు నచ్చిందే చేయండి’ అన్నారు.
2019 చివరలో బెంగళూరులో 11 వేల రూపాయల అద్దెతో ఒక చిన్న గది నుంచి నుంచి నీతూ, కీర్తిల ‘యానిమాల్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. ‘యానిమల్’ పశువు. ‘యానిమాల్’ పశువుల సంత. ఇది ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. వర్చువల్ సంత. కొనాలనుకున్న రైతు అమ్మాలనుకున్న రైతు వీళ్లు తయారు చేసిన ‘యానిమాల్’ ద్వారా లావాదేవీలు ముగించవచ్చు. ‘అసలు జనం టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి కాలక్షేపం యాప్‌లను కాకుండా పనికొచ్చే ఉపాధికి అవసరమయ్యే యాప్‌లను ఎందుకు చూడరు.
దేశంలో 30 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ఏడున్నర కోట్ల పాడి రైతుల దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఇది పెద్ద మార్కెట్. ఆన్‌లైన్ అమ్మకాలలో వీటిని తేవచ్చునని చాలామంది అనుకోలేదు. ఎందుకంటే సంప్రదాయ సంతల్లోనే వీటి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. కాని మేము వీటిని ఆన్‌లైన్‌లో తేదలుచుకున్నాం. యాప్ తయారు చేశాం. సక్సెస్ అయ్యాం’ అంటుంది నీతూ యాదవ్.
అయితే ఇలా సక్సెస్ కావడం అంత సులభం కాలేదు. 2019 చివరి వరకూ వీళ్లు కేవలం 50 పశువులే తమ యాప్ ద్వారా అమ్మారు. కాని 2020లో లాక్‌డౌన్ వచ్చాక వీరి యాప్ ఊపందుకుంది. దీనిని రైతుల సౌలభ్యం కోసం హిందీలో కూడా డెవలప్ చేశారు. దాంతో రాజస్థాన్‌లోనే ఐదులక్షల మంది పాడిరైతులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఆ తర్వాత హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌లలో యానిమాల్ కార్యకలాపాలు విస్తరించాయి. 2020 నవంబర్ నాటికి 30 వేల పశువుల లావాదేవీలు సాగితే డిసెంబర్‌కు వాటి సంఖ్య 40 వేలు అయ్యింది. 2021 నుంచి సగటున నెలకు 50 వేల పశువులు ‘యానిమాల్’ ద్వారా అమ్మకమో కొనుగోలో జరుగుతోంది. ఇప్పటికి 80 లక్షల మంది రైతులు ‘యానిమాల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
‘ఇన్వెస్టర్లు భారీగా మాకు ఫండ్ చేయడానికి ముందుకు వచ్చారు. చేశారు కూడా’ అని మెరుస్తున్న కళ్లతో అంటుంది కీర్తి. ఇప్పటికి 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి దక్కాయి. కీర్తి, నీతూ చేసింది ఏమిటంటే అమ్మే రైతును, కొనే రైతును అనుసంధానం చేయడమే. ‘మేం చెప్పామని కొనొద్దు. పాలు పితికి చూసి మరీ తీసుకోండి’ అని వీరు అంటారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు.
అలాగే పాడిరైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తారు. పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో కూడా తెలియ చేస్తారు. ఉత్తర భారతదేశంలో యానిమాల్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది. ఇది రైతుల మాటే. ‘ఇలా మేము ఎప్పుడూ పశువులను కొనలేదు’ అని వారు అంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక కొత్త ఆలోచన మెరిపించారు. అది ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కారణమైంది. ‘నీ తెలివి సంతకెళ్లా’ అనేది మనకు తిట్టు. కాని తెలివి నిజంగా సంతకెళితే ఏమవుతుందో చూశారుగా!
Comments
Please login to add a commentAdd a comment