పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
యాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి
సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీట
ఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.
దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.
పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), యుఎస్‌ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.
ఈవీఎంలకు పెద్ద పీట
అంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్‌ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు.
దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.
సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు
తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్‌ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్‌ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు.
ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది.
Comments
Please login to add a commentAdd a comment