తిరువనంతపురం: నీట్ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష‍్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే కేరళ కొల్లం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు.
రూల్ ఏం లేదు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ మెటల్ హుక్స్ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్ చేసిన తర్వాతైనా హాల్‌లోకి అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాకు సంబంధం లేదు
మార్ థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్‌లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు.
చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..
Comments
Please login to add a commentAdd a comment