National Eligibility Entrance Examination
-
నీట్ పరీక్షలో విద్యార్థినికి ఘోర అవమానం! ఫిర్యాదు చేసిన తండ్రి
తిరువనంతపురం: నీట్ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే కేరళ కొల్లం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు. రూల్ ఏం లేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మెటల్ హుక్స్ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్ చేసిన తర్వాతైనా హాల్లోకి అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కోవిడ్ నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు మార్ థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
12 వరకూ నీట్ దరఖాస్తుల గడువు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు దరఖాస్తులు సమర్పించేందుకు తుదిగడువును మార్చి 12 వరకూ పొడిగించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కాకుండా మిగతా గుర్తింపుకార్డులనూ అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు నీట్ పరీక్ష దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు మార్చి 8గా ఉండేది. తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు తమ దరఖాస్తుల్ని మార్చి 12 సాయంత్రం 5.30 వరకూ సమర్పించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ఫీజును మార్చి 13, రాత్రి 11.50 వరకూ చెల్లించవచ్చన్నారు. -
నీట్గా కొట్టేశారు...
∙ ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులు ∙ రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన తర్వాతే అడ్మిషన్లు తిరుపతి ఎడ్యుకేషన్ : వైద్యవిద్య(ఎంబీబీఎస్, బీడీఎస్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. మే 7వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన 12పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. సీబీఎస్ఈ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షకు రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్థులు 7,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. 167 మంది గైర్హాజరవడంతో 7,157మంది పరీక్ష రాశారు. గతంలో ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చరల్, ఆయుష్ వంటి వైద్యవిద్యలో ప్రవేశానికి ఎంసెట్ ర్యాంకుల ద్వారా బైపీసీ విద్యార్థులను భర్తీ చేసేవారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం అమలుకోసం వైద్యవిద్యలో ప్రవేశానికి జాతీయస్థాయి పరీక్ష నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. గత ఏడాది నీట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్లో జరిపినప్పటికీ ఎంసెట్ ద్వారానే వైద్య విద్య సీట్లను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది నీట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆ దిశగా సన్నద్ధం అయ్యారు. రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ రీజియన్ పరిధిలున్నాయి. ఈ రెండింటి పరిధిలో దాదాపు 4,850 ఎంబీబీఎస్, 2,200 బీడీఎస్ సీట్లు ఉన్నట్లు అంచనా. ఎస్వీయూ రీజియన్ పరిధిలో 1,200 ఎంబీబీఎస్, 600 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎస్వీయూ రీజియన్లోనే చోటు సాధించేందుకు ఉత్తమ ర్యాంకులు సాధించాల్సి ఉండడంతో రోజూ 12 నుంచి 14 గంటల పాటు కష్టపడినట్లు ర్యాంకర్లు తెలిపారు. ఈ ఏడాది నీట్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ము అండ్ కశ్మీర్ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో మరో రెండుమూడు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ఆధారంగా ఆ మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. నీట్ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శ్రీచైతన్య విద్యార్థులు కె.తేజశ్రీ 1,045, పి.సాయి ధనుష్ 2,138, టి.రుశీశ్వర్రెడ్డి 2,219, నారాయణ విద్యార్థి వి.విక్రాంత్రెడ్డి 3,155, డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఎస్.షాజియా 3,196, వి.యువచరీష్ 3,984, పి.సాయికృష్ణ 3,984 ర్యాంకు కైవసం చేసుకున్నారు. న్యూరాలజిస్ట్ కావాలని ఉంది న్యూరాలజిస్ట్గా రోగులకు సేవలందించడమే నా ధ్యేయం. నా తల్లిదండ్రులు మదనపల్లెకి చెందిన అశోక్కుమార్, జయశ్రీ సహకారం నాకు ఎంతగానో తోడ్పడింది. వారితో పాటు టీచర్లు సహకరించడంతో నీట్ ఫలితాల్లో 720మార్కులకు గాను 625 సాధించగలిగాను. –కె.తేజశ్రీ, 1,045వ ర్యాంకర్ శ్రీచైతన్య విద్యార్థిని