
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు దరఖాస్తులు సమర్పించేందుకు తుదిగడువును మార్చి 12 వరకూ పొడిగించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కాకుండా మిగతా గుర్తింపుకార్డులనూ అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు నీట్ పరీక్ష దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు మార్చి 8గా ఉండేది. తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు తమ దరఖాస్తుల్ని మార్చి 12 సాయంత్రం 5.30 వరకూ సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజును మార్చి 13, రాత్రి 11.50 వరకూ చెల్లించవచ్చన్నారు.