∙ ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులు
∙ రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన తర్వాతే అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : వైద్యవిద్య(ఎంబీబీఎస్, బీడీఎస్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. మే 7వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన 12పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. సీబీఎస్‌ఈ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షకు రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్థులు 7,324 మంది దరఖాస్తు చేసుకున్నారు.
167 మంది గైర్హాజరవడంతో 7,157మంది పరీక్ష రాశారు. గతంలో ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చరల్, ఆయుష్ వంటి వైద్యవిద్యలో ప్రవేశానికి ఎంసెట్ ర్యాంకుల ద్వారా బైపీసీ విద్యార్థులను భర్తీ చేసేవారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం అమలుకోసం వైద్యవిద్యలో ప్రవేశానికి జాతీయస్థాయి పరీక్ష నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. గత ఏడాది నీట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లో
జరిపినప్పటికీ ఎంసెట్ ద్వారానే వైద్య విద్య సీట్లను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది నీట్ ఆధారంగానే భర్తీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆ దిశగా సన్నద్ధం అయ్యారు.
రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ రీజియన్ పరిధిలున్నాయి. ఈ రెండింటి పరిధిలో దాదాపు 4,850 ఎంబీబీఎస్, 2,200 బీడీఎస్ సీట్లు ఉన్నట్లు అంచనా. ఎస్వీయూ రీజియన్ పరిధిలో 1,200 ఎంబీబీఎస్, 600 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎస్వీయూ రీజియన్‌లోనే చోటు సాధించేందుకు ఉత్తమ ర్యాంకులు సాధించాల్సి ఉండడంతో రోజూ 12 నుంచి 14 గంటల పాటు కష్టపడినట్లు ర్యాంకర్లు తెలిపారు. ఈ ఏడాది నీట్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ము అండ్ కశ్మీర్ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో మరో రెండుమూడు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ఆధారంగా ఆ మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు.
నీట్ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శ్రీచైతన్య విద్యార్థులు కె.తేజశ్రీ 1,045, పి.సాయి ధనుష్ 2,138, టి.రుశీశ్వర్‌రెడ్డి 2,219, నారాయణ విద్యార్థి వి.విక్రాంత్‌రెడ్డి 3,155, డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఎస్.షాజియా 3,196, వి.యువచరీష్ 3,984, పి.సాయికృష్ణ 3,984 ర్యాంకు కైవసం చేసుకున్నారు.
న్యూరాలజిస్ట్ కావాలని ఉంది
న్యూరాలజిస్ట్‌గా రోగులకు సేవలందించడమే నా ధ్యేయం. నా తల్లిదండ్రులు మదనపల్లెకి చెందిన అశోక్‌కుమార్, జయశ్రీ సహకారం నాకు ఎంతగానో తోడ్పడింది. వారితో పాటు టీచర్లు సహకరించడంతో నీట్ ఫలితాల్లో 720మార్కులకు గాను 625 సాధించగలిగాను.
–కె.తేజశ్రీ, 1,045వ ర్యాంకర్
శ్రీచైతన్య విద్యార్థిని
నీట్‌గా కొట్టేశారు...
Published Sat, Jun 24 2017 1:49 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement