వయనాడ్ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.
కేరళ వయనాడ్ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.
చూరాల్‌మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్ 2న ఎంగేజ్‌మెంట్ జరిగింది.జూన్ 30న వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..
వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment