
కొల్లాం : కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సమీపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్రిడ్జిపై సుమారు 80మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జిపై స్థానికులు రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా స్థానికులు వాకింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది.
దీంతో పలువురు నదిలో పడిపోగా, మరికొంతమంది ఇనుపరాడ్ల మధ్య చిక్కుకుపోయారు. ఈత వచ్చినవారు నదిలో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరోవైపు స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి తుప్పు పట్టిందని, మరమ్మత్తులు చేయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు కేఎంఎంఎల్ ఉద్యోగిని శ్యామల (55)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment