పెను విషాదాన్ని ఆమె ముందే ఊహించింది
ఒక్క కొల్లాంలోనేకాదు ప్రపంచం నలుమూలలా మత కార్యక్రమంలోనో చోటుచేసుకునే విషాదాల్లో ప్రాణాలు కోల్పోయేది అమాయక భక్తులే! బీదసాదలే! అమ్మవారికి దండం పెట్టుకునేందుకు ఆలయాలకు వచ్చే అలాంటి భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, సంప్రదాయం పేరుతో విషాదాలు సృష్టించొద్దని నాలుగేళ్లుగా నినదిస్తోంది.. కొల్లాంకు చెందిన వృద్ధురాలు పంకజాక్షి. పుట్టింగళ్ ఆలయంలో పెను విషాదం జరుగుతుందని ముందే ఊహించిందామె. ఆ విషాదాన్ని అడ్డుకునేందుకు నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనేఉంది. కానీ ఫలితంరాలేదు.
'ఏదో ఒకరోజు ఇలా జురుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆ పేలుళ్ల తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు' అని అంటోంది పంకజాక్షి. కొల్లాంలో ఆ ఆలయానికి పక్కనే ఆమె ఇల్లుంటుంది. బాణాసంచ ఆచారం ఇప్పటిది కాకపోయినప్పటికీ మధ్య పేలుళ్ల తీవ్రత ఎక్కువైపోయిందని వాపోతున్నారామె. ఆలయంలో బాణాసంచా పేలినప్పుడల్లా పంకజాక్షి వాళ్ల ఇల్లు కంపిస్తుంది. ఆ వేడుక జరిగినంతసేపు వాళ్ల కుటుంబం ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని కూర్చుంటారు. పేలుళ్ల తీవ్రతకు ఇంటి పై కప్పు పెచ్చులు ఊడటం, సామాన్లన్ని చెల్లాచెదురుగా పడిపోవటం పరిపాటేనట.
ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కొల్లాం జిల్లా కలెక్టర్ ను సైతం పలుమార్లు కలిసి వినతి పత్రం ఇచ్చింది. అలా నాలుగేళ్ల నుంచి అధికారులకు వినతులు చేసిచేసి విసుగెత్తింది. ఈ ఏడాది కూడా వేడుక ప్రారంభంకావటానికి ముందు కలెక్టర్ ను కలిసొచ్చింది.
'ఆచారవ్యవహారాలకు నేను వ్యతిరేకం కాదు. అమాయకుల ప్రాణాల గురించే పాకులాట. భారీ పేలుడు పదార్థాలను వినియోగించడం ఎప్పటికైనా ప్రమాదమేనని నేను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆదివారం నాటి విషాదంలో మా ఇల్లు కూడా ధ్వంసమైంది. ఎవరో బాంబులు వేసినట్లు కుప్పకూలిపోయింది. ఇకనైనా ఆలయంలో బాణాసంచ కాల్చడం ఆపేయాలన్నదే నా మనవి' అని విజ్ఞప్తి చేస్తోంది పంకజాక్షి. కొల్లాంలోని పుట్టింగళ్ ఆలయంలో వార్షిక ఉత్సవాల్లో భాగంగా పటాకులు పేల్చే కార్యక్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 108 మంది మరణించారు. మరో 400 మంది క్షతగాత్రులయిన సంగతి తెలిసిందే.