కొల్లం: కేరళలో వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసిఆత్మహత్యకుప్రేరేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించింది.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల నేరాలకుగాను ఈ శిక్ష విధించినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్ ,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహనరాజ్ విలేకరులకు తెలిపారు. ఈకేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కుమార్‌కు గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.ఈ ఘటనకు ఒక రోజు ముందు, విస్మయ తన బంధువులకు వరకట్న వేధింపుల గురించి వాట్సాప్ సందేశాలను పంపింది, అలాగే ఆమె శరీరంపై గాయాల ఫోటోలు, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపించింది. 2020లో పెళ్లి సందర్భంగా కుమార్‌కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్‌కి కట్నంగా ఇచ్చారు. కారు, నచ్చలేదని, వద్దన్న కిరణ్ ఆ పది లక్షల నగదు రూపంలో కావాలని వేధించి, చిత్ర హింసలకు గురి చేయడంతో విస్మయ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే, దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ పరిణామంపై స్పందించిన విస్మయ తల్లితండ్రులు త్రివిక్రమన్ నాయర్, సజిత సంతోషం వ్యక్తం చేశారు. అయితే కిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకున్నారు. అంతేకాదు ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే ఆమె తండ్రి విచారణకు హాజరయ్యారు. ‘‘నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం సీటు ఎపుడూ ఖాళీగా ఉంచుతా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు తాజా తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment