మాఫియా డాన్‌లను పట్టుకోవడానికి పోలీసు అధికారి నరసింహం విదేశాలకు వెళ్లడం చూశాం. నేరం చేసిన వాడు ఎవడైతే ఏంటి, ఎక్కడ తలదాచుకుంటే ఏమిటి.. చిత్తశుద్ధి ఉంటే వాడి తాట తీయడం తీయొచ్చని అని నరసింహం నిరూపించాడు. అయితే అదంతా సింగం సిరీస్‌లో హీరో సూర్య రీల్ లైఫ్ పెర్ఫామెన్స్. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఓ మహిళా ఆఫీసర్ ఉన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి సౌదీకి పారిపోయిన ఓ మృగాడిని పట్టుకునేందుకు ఆమె తన టీమ్‌తో కలిసి ఎడారి దేశానికి బయల్దేరారు. ఇంటర్‌పోల్ సహాయంతో అతడిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. ఆ లేడీ సింగం పేరు మెరిన్ జోసెఫ్. కేరళలోని కొల్లాం పోలీసు కమిషనర్ ఆమె. అకృత్యానికి బలై ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు ఆమె చేస్తున్న కృషి నిజంగా స్ఫూర్తిదాయకం.
కేసు నేపథ్యం ఇదీ...
కేరళలోని కొల్లాంకు చెందిన సునీల్ కుమార్ బంద్రాన్(38) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో టైల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో సెలవుల నిమిత్తం స్వదేశానికి వచ్చినపుడు స్నేహితుడి మేన కోడలిపై అకృత్యానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల బాలిక అనే కనికరం లేకుండా మూడు నెలల పాటు ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారి మిన్నకుండి పోయింది. అయితే ఆ కామాంధుడు సౌదీ వెళ్లిపోయాక జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ పీడకలను మర్చిపోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొల్లాం పోలీస్ చీఫ్ మెరిన్ ఇటీవలే రియాద్‌కు వెళ్లారు. స్థానిక పోలీసుల అదుపులో ఉన్న సునీల్ కుమార్‌ను అరెస్టు చేసి కేరళకు తీసుకువచ్చారు. పోక్సో చట్టం కింద అతడిపై ఉన్న కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఎక్కడా దాక్కున్నా శిక్ష తప్పదు..
ఈ కేసు గురించి జోసెఫ్ మెరిన్ మాట్లాడుతూ..‘ ఇది అత్యంత హేయమైన నేరం. సునీల్ దుశ్చర్య కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మహిళలు, చిన్నారుల పట్ల ఇటువంటి అకృత్యాలు జరిగినపుడు మనసు కకావికలం అవుతుంది. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎంతటి మానసిక క్షోభ అనుభవిస్తారో నాకు తెలుసు. సమాజం కూడా వారిని చూసే తీరు వేరుగా ఉంటుంది. అటువంటి వాళ్లకు న్యాయం చేయడం నా కర్తవ్యం. అందుకే నిందితుడిని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను.
ఈ కేసులో నిందితుడు సౌదీకి పారిపోయాడు. అతడు ఒక్కడే కాదు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న చాలా మంది కేరళ కార్మికులు.. ఇక్కడ నేరాలకు పాల్పడి పారిపోతున్నారు. ఇటువంటి కేసులు ఎంత క్లిష్టతరమైనవో నాకు తెలుసు. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. మా బాస్ ప్రోద్భలంతో కేసులో పురోగతి సాధించాను. రియాద్‌కు వెళ్లి సునీల్ కుమార్‌ను అరెస్టు చేసి కేరళకు తీసుకువచ్చాను. ఇక అతడికి శిక్ష వేయించడమే నా ముందున్న లక్ష్యం. ’ అని చెప్పుకొచ్చారు.
సవాళ్లను స్వీకరించాలి..
‘సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న లింగ వివక్ష వేళ్లూనుకుపోయింది. అయితే ఒక మహిళగా నేనెప్పుడూ రాయితీలు కోరుకోలేదు. ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నిరాశ చెందక సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగాను. ఐపీఎస్ కావాలన్న నా కలను నెరవేర్చుకున్నాను. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను. నిజానికి మహిళా అధికారుల పట్ల కూడా ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. ఒత్తిళ్లను ఎదుర్కొని పని చేయలేరన్న కారణంగా ఫీల్డ్ పోస్టింగులు తక్కువగా ఇస్తుంటారు. అది వాస్తవం కాదు. మహిళలకు పని పట్ల శ్రద్ధ, అంకిత భావం ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అన్ని రంగాల్లో వారు ముందుకు సాగుతున్న తీరును గమనించాలి. పోలీసు శాఖలో మహిళా అధికారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది’ అంటూ కేరళలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పోలీసు కమిషనర్‌గా గుర్తింపు పొందిన మెరీన్(29) అమ్మాయిల్లో స్ఫూర్తి నింపారు.
Comments
Please login to add a commentAdd a comment