పాడేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీఎస్సీ అర్హత కోసం ముందుగా నిర్వహించే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 3 వేల మంది అభ్యర్థులు పేపర్–1(ఎస్జీటీ), పేపర్–2(స్కూల్ అసిస్టెంట్), పేపర్–3 (లాంగ్వేజ్ పండిట్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న సమయంలో గతంలో మాదిరిగా పరీక్షకు హాజరయ్యే జిల్లా పేరును ఎంచుకోవాలని ప్రస్తావించలేదు. పరీక్ష కేంద్రం జిల్లా కోసం తర్వాత ఆప్షనల్ ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయం ముందుగా ప్రకటించకపోవడం తో అభ్యర్థులు పెద్దగా పట్టించుకోలేదు. దరఖాస్తు గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29 వరకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సెల్‌ఫోన్లకు మెసెజ్‌లు పంపించింది.
సెల్ సిగ్నల్ అందుబాటులో ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లి పరీక్ష కేంద్రాలను ఎంచుకున్నారు. కానీ ఏజెన్సీలో సమాచార వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో మారుమూల గ్రామాల్లో అభ్యర్థులకు ఈ విషయం తెలియలేదు. చివరి రోజు కొంతమంది ఆన్‌లైన్ సెంటర్లకు వచ్చి సెంటర్లకు ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించగా విశాఖ జిల్లాల్లో పరీక్ష సెంటర్లు ఖాళీగా లేవని కర్ణాటక, చెన్నై, హైదరబాద్ వంటి ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నాయి.దీంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. దూరం కారణంగా చాలా మంది అభ్యర్థులు ఆ సెంటర్లను ఎంపిక చేసుకోలేదు. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు పాడేరు ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసి విశాఖ జిల్లాలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ అన్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న కొందరు గిరిజన అభ్యర్థులు మంగళవారం ఆయనను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment